logo

మట్టి ట్రాక్టర్లుకు.. ఇంకెందరు బలికావాలి..

ఎంతో ఉన్నత భవిష్యత్తున్న బాలికలు. చక్కగా చదువుకుంటున్నారు. కన్నవారి ఆశలకు ప్రతిరూపాలుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిని మట్టి ట్రాక్టర్లు బలిగొంటున్నాయి.

Published : 04 Jun 2023 05:42 IST

మృతదేహం వద్ద విలపిస్తున్న ప్రశాంతి తండ్రి బాలాజీ (పాత చిత్రం)

న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం: ఎంతో ఉన్నత భవిష్యత్తున్న బాలికలు. చక్కగా చదువుకుంటున్నారు. కన్నవారి ఆశలకు ప్రతిరూపాలుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిని మట్టి ట్రాక్టర్లు బలిగొంటున్నాయి. వరుస ఘటనలతో అమలాపురం పరిసర ప్రాంతాలవారు తమ పిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్నారు. పల్లె, పట్టణం తేడాలేకుండా ఉదయం నుంచి రాత్రి  వరకు రోడ్లపై ఎక్కడచూసినా మట్టి ట్రాక్టర్లే. నల్లవంతెన, ఎర్రవంతెన, విత్తనాలవారి కాలువగట్టు, అల్లవరం, ఉప్పలగుప్తం రోడ్లు.. ఇలా ఏమూలచూసినా మట్టి ట్రాక్టర్లు ఉంటున్నాయి. వాటి వేగానికి రహదారిపై బైకులు, కార్లు వెళ్లేదారికూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇష్టానుసారం..

చెవిలో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని, డ్రైవింగ్‌ లైసెన్స్‌కూడా లేకుండా, నిర్లక్ష్యంగా, మద్యం తాగి, పెద్ద శబ్దాలతో పాటలు వింటూ ట్రాక్టర్లు నడుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు రోడ్డుపైకి వచ్చేందుకు వణికిపోతున్నారు. మట్టి తరలింపుదారులిచ్చే డబ్బులకు ఆశపడి.. రాజకీయ నాయకుల దన్నుతో అక్రమ మట్టితవ్వకాలపై పోలీస్‌, రెవెన్యూ, రవాణాశాఖ, ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.


పుట్టినరోజు సందడికి వెళ్లి..

అమలాపురం మండలం నడిపూడికి చెందిన పెనుమాల ప్రశాంతి(16) పదో తరగతి పరీక్షలురాసింది. వేసవి సెలవుల్లో తన స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కునేందుకు నడిపూడి లాకుల వద్దనున్న దుకాణానికి వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి తిరిగివస్తుండగా ఇరుకుగా ఉన్న ఆ రోడ్డులో వేగంగా వచ్చిన మట్టి ట్రాక్టర్‌ వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రశాంతి అక్కడక్కడే మృతిచెందగా మిగిలిన ఇద్దరు స్నేహితురాళ్లు సరెళ్ల మానస, సరెళ్ల సత్యభవాని గాయపడ్డారు. డ్రైవర్‌ నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్లే తమ కుమార్తె మృతిచెందిందని ప్రశాంతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.


ఆడుకుని వస్తూ..

అమలాపురం మహిపాలవీధికి చెందిన జంగా లక్ష్మీజాహ్నవి(11) ఆరో తరగతి చదివింది. మే 19న జాహ్నవి సైకిల్‌పై గాంధీనగర్‌ శివారుకు వెళ్లి తన స్నేహితురాలితో ఆనందంగా ఆడుకుని ఇంటికి తిరిగొస్తోంది. గాంధీనగర్‌ దారిలో సైకిల్‌ చైన్‌ ఊడిపోవడంతో దిగి చూస్తుండగా అటుగా వెళ్తున్న మట్టిట్రాక్టర్‌ చిన్నారిని బలిగొంది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ బాలికను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాడు. మిట్టమధ్నాహ్నం కావడం, ఆ సమయంలో ఎవరూ చిన్నారిని చూడకపోవడంతో బాలిక తీవ్రగాయాలతో రోడ్డుపైనే విలవిల్లాడింది. చాలాసేపటికి స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించినా అదేరోజు అర్ధరాత్రి మృతిచెందింది. కనీసం మానవత్వంతో డ్రైవర్‌ వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా ప్రాణపాయం తప్పేదేమోనని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. చదువులో ఎప్పుడూ ముందుండే కుమార్తె దూరమవ్వడంతో మంచి భవిష్యత్తు చూపించాలనే వారి ఆశలు అడియాశలయ్యాయి.


కఠిన చర్యలు తీసుకుంటాం
- అశోక్‌ప్రతాపరావు, జిల్లా రవాణాశాఖాధికారి

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా, నిర్లక్ష్యంగా, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన 460 మందిపై కేసులుపెట్టి రూ.23 లక్షలు వసూలు చేశాం. సరైన ధ్రువపత్రాలులేని ట్రాక్టర్లపై 614 కేసులు పెట్టాం. 33 వాహనాలను స్వాధీనం చేసుకుని, వేలంలో రూ.7.49లక్షలకు విక్రయించాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని