logo

గుండెల్లో రైళ్లు.. అరచేతుల్లో ప్రాణాలు

ఒడిశా రాష్ట్రంలోని రైలు ప్రమాదంతో ఉమ్మడి జిల్లా ఉలిక్కిపడింది. కోరమాండల్‌ రైల్లో వస్తూ 31 మంది రాజమహేంద్రవరంలో దిగాల్సి ఉండడంతో ముందు ఆందోళన వ్యక్తమైనా ఆరుగురు మినహా అందరి ఆచూకీ తెలియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

Updated : 04 Jun 2023 06:07 IST

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, వీఎల్‌పురం, టి.నగర్‌, దానవాయిపేట, నల్లజర్ల : ఒడిశా రాష్ట్రంలోని రైలు ప్రమాదంతో ఉమ్మడి జిల్లా ఉలిక్కిపడింది. కోరమాండల్‌ రైల్లో వస్తూ 31 మంది రాజమహేంద్రవరంలో దిగాల్సి ఉండడంతో ముందు ఆందోళన వ్యక్తమైనా ఆరుగురు మినహా అందరి ఆచూకీ తెలియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ప్రమాదం నుంచి బయటపడినవారు తమ యాతన చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జిల్లాకు చేరుకున్నామన్నారు.

ఒడిశా బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో యంత్రాంగం అప్రమత్తమైంది. హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి, సమాచారాన్ని అందించింది.  కోరమాండల్‌ రైలులో రాజమహేంద్రవరం వరకు వచ్చేందుకు వివిధ స్టేషన్లనుంచి మొత్తం 31 మంది రిజర్వేషన్‌ చేసుకోగా వీరిలో ఆరుగురి మినహా మిగతావారి క్షేమ సమాచారాలు తెలిశాయి. కలెక్టరేట్‌ హెల్ప్‌డెస్క్‌లో రైల్వే రిజర్వేషన్‌ జాబితా ఆధారంగా వీఆర్వోలు, వాలంటీర్ల సాయంతో స్థానికులను గుర్తించే ప్రయత్నం చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన అయిదుగురు, రాజోలులో పనిచేస్తున్న ఓ వ్యక్తి శనివారం క్షేమంగా చేరుకున్నారు. వీరిలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కుటుంబం ఉంది. తాడేపల్లిగూడేనికి చెందిన ఓ వ్యక్తి రాజమహేంద్రవరంలో దిగి ఇంటికి బస్సులో పయనమయ్యారు. ఘటనతో పలు రైళ్లు రద్దవగా.. మరికొన్ని ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. శనివారం సాయంత్రం 6.58 గంటలకు ప్రత్యేక రైలులో వచ్చిన ప్రయాణికులను నేరుగా సీటీఐ ఛాంబరుకు రైల్వే అధికారులు తీసుకెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్తామనగా.. తమకు అంతా బాగానే ఉందని వారంతా ఇంటికి వెళ్లిపోయారు.

రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల నిరీక్షణ


* రాజమహేంద్రవరానికి రావాల్సిన మొత్తం ప్రయాణికులు : 31 మంది

* క్షేమంగా బయటపడినవారు : 25 మంది - ఫోను నంబర్లు పనిచేయనివారు: ముగ్గురు

*  ఫోన్లు నంబర్లు అందుబాటులో లేనివారు: ముగ్గురు


తెలియాల్సింది ఈ ఆరుగురి ఆచూకీ

* రాజమహేంద్రవరం వచ్చేందుకు ఖరగ్‌పూర్‌లో రైలు ఎక్కిన డి.ఇందిరా కుమారి (59), డి.లోకేష్‌ (36)కు సంబంధించిన ఫోన్‌ నంబర్లు అందుబాటులో లేవు.

* షాలిమార్‌లో రైలు ఎక్కిన బి.పంజా ఫోన్‌ నంబరు అందుబాటులోకి రాలేదు.

* బాలాసూర్‌ నుంచి రాజమహేంద్రవరం వచ్చేందుకు రైలు ఎక్కిన ఫగురం ముర్రు (48), సుశాంతి (40), అభిషిక్త్‌ (11) ఫోన్‌ నంబర్లు పని చేయడం లేదు.


ఉత్తరాదివారే అధికం

రాజమహేంద్రవరం వచ్చేందుకు రిజర్వేషన్‌ చేసుకున్న వారిలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. వీరిలో కొందరు స్థానికంగా జరిగే వివాహాలకు హాజరయ్యేందుకు వస్తున్నట్లు తెలిసింది. మరికొందరు వ్యాపారాలు, బంగారు పని చేసే వ్యక్తులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.


ఆ ముగ్గురూ సురక్షితం

మరోవైపు పట్టాలు తప్పిన బెంగళూరు-హవ్‌డా(12864) రైలులో రాజమహేంద్రవరం నుంచి పట్నా వెళ్లేందుకు ముగ్గురు ప్రయాణికులు ఎక్కారు. వారంతా సురక్షితంగా పాట్నా చేరుకున్నట్టు ఫోన్‌ ద్వారా సమాచారం అందింది.


టికెట్ల రద్దు...

రైళ్లు రద్దవడంతో  రిజర్వేషన్‌ చేయించుకున్న పలువురు  రద్దు చేసుకున్నారు.రాజమహేంద్ర వరంలో 35 మంది వరకు ప్రయాణికులు టికెట్లు రద్దు చేసుకోగా, ఆన్‌లైన్‌లో టికెట్‌ రద్దు చేసుకున్నవారి సంఖ్య మరింత ఉంటుందని  సిబ్బంది చెబుతున్నారు.


మహాప్రస్థానం వాహనాల తరలింపు

మసీదుసెంటర్‌ (కాకినాడ): ప్రమాద బాధితుల కోసం కాకినాడ జీజీహెచ్‌లోని ఏడు మహా ప్రస్థానం వాహనాలను శనివారం పంపించినట్లు ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డా.వెంకటరెడ్డి తెలిపారు. రెండు వైద్య బృందాలను సిద్ధం చేశామన్నారు. బృందంలో నలుగురేసి చొప్పున వైద్యులు, సిబ్బంది ఉంటారన్నారు.


కూతురితో వెళ్లా...
- యానాపు మురళీకృష్ణ, కొత్తపేట, రాజమహేంద్రవరం

మాఅల్లుడు ఝార్ఖండ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కుమార్తెను దిగబెట్టి తిరిగి రాజమహేంద్రవరం వచ్చేందుకు షాలిమార్‌లో కోరమాండల్‌ బి-8 బోగీలో ఎక్కా. రాత్రి ఏడు గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. మా బోగీ నేలలో కూరుకుపోయింది. ఏం జరిగిందో తెలియదు. అంతా చీకటి.. హాహాకారాలు. బయటకు దిగేందుకు అవకాశం లేని పరిస్థితి. కాసేపటి తరువాత రైలు భారీ ప్రమాదానికి గురైనట్టు తెలిసింది. స్థానికులు సహాయక చర్యలు అందించడంతో క్షేమంగా బయటపడ్డాం. బ్రహ్మపుర వరకు బస్సులో, అక్కడ్నుంచి విశాఖకు రైల్లో వచ్చా. అక్కడ్నుంచి ప్రత్యేక రైలులో రాజమహేంద్రవరం చేరుకున్నా.


అమ్మను చూసేందుకు వస్తూ..
- కాసాని ఉమామహేశ్వరరావు, పోతవరం, నల్లజర్ల మండలం

కోల్‌కతాలో ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తున్నా. అమ్మానాన్నలు నల్లజర్ల మండలం పోతవరంలో ఉంటారు. అమ్మకు శస్త్రచికిత్స చేయించేందుకు సెలవు పెట్టి ఇంటికొస్తున్నా. మా బోగీలో 70 మంది దాకా కూర్చుని ఉన్నాం. ఏం జరిగిందో అర్థమయ్యేలోగా మా బోగీ పక్కకు ఒరిగిపోయింది. స్థానిక యువకుల సాయంతో రైలులో నుంచి బయటపడ్డాం. తాగడానికి మంచినీళ్లు ఇచ్చారు. అరగంట తర్వాత హైవే మీదకు చేరుకున్నా. ఆ తర్వాత భువనేశ్వర్‌ వచ్చి, అక్కడి నుంచి బస్సులో రాజమహేంద్రవరం చేరుకున్నా. పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డా.


మా బోగీలో ఉన్నవారంతా క్షేమం
- ఉమామహేశ్వరరావు, తాడేపల్లిగూడెం

కోల్‌కతాలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా.  కోరమాండల్‌ రైలులో బీ4 బోగీలో కూర్చున్నా. అంతా సందడిగా మాట్లాడుకుంటూ సాఫీగా ప్రయాణం సాగుతుండగా.. ఒక్కసారిగా భయంకరమైన శబ్దం వచ్చింది. అంతా ఒకరిపై ఒకరు పడిపోవడంతో బిగ్గరగా అరుస్తున్నాం. కాసేపటికి నెమ్మదిగా తేరుకుని బోగీ తలుపులు తెరిచి బయటకు వచ్చాం.  అప్పటికి రైలు బోగీలు ఒకదానిపై ఒకటి ఉన్న దృశ్యాలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యా. ప్రత్యేక రైలులో రాజమహేంద్రవరం వచ్చి తాడేపల్లిగూడెం వెళ్తున్నా.


పిల్లలతో ప్రాణాలు దక్కించుకున్నాం
- అనూప్‌కుమార్‌, సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌, రాజమహేంద్రవరం

మాది బిహార్‌. రాజమహేంద్రవరంలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా.  భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కోరమాండల్‌ రైలులో బీ4 బోగీలో వస్తున్నాం. నేను పిల్లలకు ఆహారం తెచ్చేందుకు ప్యాంట్రీకార్‌కు వెళ్తున్నా. పిల్లలు పైబెర్తులో పడుకుని ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో భార్య, ఇద్దరు పిల్లలు అంతా కిందపడిపోయారు. అందరికీ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఇంటికి చేరినప్పటికీ అంతా ఆ షాక్‌లోనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని