logo

పాఠ్యాంశాల పునరుద్ధరణకు పోరాడదాం

దేశ చరిత్రపై భాజపా తన దాడిని తీవ్రతరం చేసిందని, ఇందులో భాగంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల ప్రతికూల పాఠ్యాంశాలను పుస్తకాల నుంచి తొలగిస్తోందని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ఆరోపించారు.

Published : 06 Jun 2023 05:22 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు

శ్యామలాసెంటర్‌, న్యూస్‌టుడే: దేశ చరిత్రపై భాజపా తన దాడిని తీవ్రతరం చేసిందని, ఇందులో భాగంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల ప్రతికూల పాఠ్యాంశాలను పుస్తకాల నుంచి తొలగిస్తోందని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ఆరోపించారు. ‘పాఠ్యాంశాల తొలగింపు, పూర్వాపరాలు, పర్యవసానాలు’ అనే అంశంపై రాజమహేంద్రవరం రోటరీహాల్లో సోమవారం సమావేశం జరిగింది. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జయకర్‌ అధ్యక్షతన రాజమహేంద్రి ఆలోచన వేదిక, యూటీఎఫ్‌, జనవిజ్ఞాన వేదిక తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్స్‌, నీట్‌ వంటి పరీక్షల్లో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ కీలకపాత్ర పోషిస్తుందని, వీటిని విద్యార్థులు చదువుతుంటారన్నారు. ఇటీవల పదో తరగతిలో పలు పాఠ్యాంశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటం బాధాకరమన్నారు. పదోతరగతిలో డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గురించి, 11వ తరగతిలో జమ్మూ కశ్మీర్‌ విలీనం, ఆర్‌ఎస్‌ఎస్‌ నిషేధం, గోద్రా అల్లర్లు, డెమొక్రటిక్‌ పాలిటిక్స్‌, మొఘల్‌ చక్రవర్తుల చరిత్ర వంటి అంశాలను పాఠ్యాంశాల నుంచి తొలగించారన్నారు. చరిత్ర తెలుసుకుంటేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు. దేశ చరిత్రను వక్రీకరించేలా భాజపా ప్రభుత్వం తన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించి పాఠ్యాంశాల పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ యూనియన్‌ ఆలిండియా నాయకులు సతీష్‌, నాయకులు పీఎస్‌ఎస్‌రాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.రాజులోవ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని