logo

పర్యావరణ పరిరక్షణతో మానవ మనుగడ

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.

Published : 06 Jun 2023 05:27 IST

మొక్క నాటుతున్న కలెక్టర్‌, చిత్రంలో జేసీ, డీఆర్వో తదితరులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత నగరంలోని కంబాలచెరువు పార్కు వద్ద నుంచి ఆనం కళాకేంద్రం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ, అటవీ, పరిశ్రమలు తదితర శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పద్మరాజు, జిల్లా అటవీశాఖ అధికారి నాగరాజు, ఆం‌్రధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు ప్రసాదరావు, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యురాలు మహాలక్ష్మి తదితరులు మాట్లాడారు. ప్లాస్టిక్‌ కాలుష్యం, పరిష్కారమార్గాలు, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మిషన్‌లైఫ్‌ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలన్నారు. అందరూ పర్యావరణ అనుకూల అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చలం, మీరాసుభాన్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో...

సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కలెక్టర్‌ మాధవీలత పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో జేసీ తేజ్‌భరత్‌, సహాయ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మానవాళి మనుగడకు దోహదపడుతూ, ప్రాణవాయువు అందించే మొక్కలను ప్రతిఒక్కరూ తమ పరిసరాల్లో నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో జి.నరసింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని