logo

కన్నెత్తి చూడరు.. లెక్కా పత్రం అడగరు..!

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఓ ప్రైవేటుసంస్థకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడ ర్యాంపులు ఇచ్చారో.. ఎక్కడ తవ్వుతున్నారో తెలియని పరిస్థితి.

Published : 06 Jun 2023 05:35 IST

అడ్డగోలు ఇసుక తవ్వకాలతో గోదారమ్మకు తూట్లు

కపిలేశ్వరపురం మండలం తాతపూడి పుష్కర ఘాట్‌ వద్ద భారీగా ఇసుక నిల్వలు

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే,పి.గన్నవరం, కపిలేశ్వరపురం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఓ ప్రైవేటుసంస్థకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడ ర్యాంపులు ఇచ్చారో.. ఎక్కడ తవ్వుతున్నారో తెలియని పరిస్థితి. ఏ రీచ్‌ నుంచి రోజుకు ఎన్ని లారీల ఇసుక  తరలుతోందన్న లెక్కాపత్రం లేదు. తవ్వకాల్లో నిబంధనల అమలు జరుగుతుందా.. లేదా.. అనేది క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో అడ్డగోలుగా ఇసుక దందా నడుస్తోంది. ఇసుక తవ్వకాల్లో నదీ పరివాహక చట్టాన్ని   ఉల్లంఘిస్తున్నా.. ప్రాణాలు పోతున్నా అటువైపు కన్నెత్తి చూసేందుకు అధికారులు సాహసించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పరిస్థితిపై పరిశీలనాత్మక కథనం.

గోదావరి నదీ గర్భంలో పరివాహక చట్టానికి(రివర్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌) లోబడే తవ్వకాలు జరపాలని నిబంధన. గోదావరి ప్రస్తుత మట్టానికి గరిష్ఠంగా మీటరున్నర లోతు మాత్రమే తవ్వాలి. కానీ భారీ యంత్రాలతో 20 అడుగులకు పైగా అంటే సుమారు ఆరు మీటర్ల లోతున నదీ గర్భాన్ని యంత్రాలతో తొలిచేస్తున్నారు. యంత్రాలతో తవ్వితే ఈ తరహా సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నదీ గర్భాల్లో యంత్రాలతో తవ్వేందుకు నిరాకరిస్తుంది. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

ఇవీ నిబంధనలు

* ఇసుక, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే ముందుగా  గనులు, భూగర్భ జల, రెవెన్యూ, వ్యవసాయ, హెడ్‌వర్క్సు తదితర శాఖల అధికారులు సంయుక్త పరిశీలన చేయాలి. *నిబంధనలకు లోబడి ఉంటే ఎన్‌వోసీ ఇవ్వాలి. * తవ్వకాలు ఎన్ని క్యూబిక్‌ మీటర్ల మేర చేపట్టాలన్నది ఉత్తర్వుల్లో పేర్కొనాలి. *తవ్వకాలు చేపట్టే ప్రదేశం హద్దులు చూపిస్తూ జియోకార్డినేట్‌ ఏరియాను నిర్ణయించి ఆ పరిధిలో ఎర్రజెండాలు పాతాలి. * గరిష్ఠంగా మీటరున్నర లోతు మించి తవ్వకాలు చేపట్టకూడదు. * ఇసుక, మట్టి తరలించే సమయంలో శబ్ద కాలుష్యం ఉండకూడదు. (రాజమహేంద్రవరంలోని ఓ ఇసుక రీచ్‌కు జిల్లా కమిటీలో నిర్ణయించి అనుమతులిచ్చారు. నివాసాల మధ్య రీచ్‌ ఉండడం నిబంధనలకు విరుద్ధమని స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. అనుమతులిచ్చే ముందు నిబంధనలు పాటించలేదని, రివర్‌ కన్జర్వేటర్‌ నుంచి ఎన్‌వోసీ తీసుకోలేదని పేర్కొంటూ అనుమతులను న్యాయస్థానం రద్దు చేసింది.

ఉల్లంఘన ఇలా..

* వరదల సమయంలో నీటి ఉద్ధృతి నుంచి కాపాడే ఏటిగట్లపై భారీ వాహనాలు నడపకూడదు. కొన్ని సందర్భాల్లో రైతు ఉత్పత్తులు తరలించేందుకు మాత్రమే 10 నుంచి 14 టన్నుల వరకు అనుమతిస్తారు. రాజమహేంద్రవరం పరిధిలో అవేమీ పట్టనట్లు అఖండ గోదావరి ఎడమ ఏటిగట్టుపై రేయింబవళ్లు భారీ వాహనాలు వందల సంఖ్యలో తిరుగుతున్నాయి.

* బోట్స్‌మెన్‌ సొసైటీ పేరుతో అనుమతులు

తీసుకుని.. ఆయా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా చిన్నబోట్లకు డ్రెడ్జర్లు అమర్చి ఇసుక భారీగా వెలికి తీస్తున్నా అధికారులకు పట్టకపోవడం గమనార్హం. ఇష్టారాజ్యంగా నదీ ప్రవాహానికి అడ్డుగా కిలో మీటర్ల మేర బాటలు నిర్మిస్తున్నా ఎవరూ కన్నెత్తి చూడడంలేదు.

అన్నీఅనర్థాలే...

గోదావరిలో ఇష్టారాజ్యంగా  20 నుంచి 25 అడుగుల లోతులో యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. ఆ గోతుల్లోకి ఊట నీరు చేరి చేపల చెరువులను తలపిస్తున్నాయి. ఏటిగట్లకు ఆనుకుని సైతం అదే రీతిన తవ్వుతున్నారు. దీని వల్ల గోదావరిలో సాధారణ నీటి మట్టం ఉన్నప్పుడు లంకలకు స్థానికులు నడిచి వెళ్లే క్రమంలో గోతులు గుర్తించక మృత్యువాత పడిన ఘటనలున్నాయి. ఇలా డాక్టర్‌
బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనే ఈ ఏడాదిలో మే వరకు అయిదు నెలల వ్యవధిలో అయిదుగురు చనిపోయారు.

* అధిక లోడుతో టిప్పర్లు వెళ్తున్న సమయంలో కొన్నిచోట్ల వంతెనలు శిథిలావస్థకు చేరుతున్నాయి. దారులు ధ్వంసమవుతున్నాయి.  పి.గన్నవరం మండలం  వై.వి.పాలెం వద్ద ఇసుక, మట్టి లారీల రాకపోకలతో వంతెన శిథిలావస్థకు చేరింది. కందాలపాలెం వద్ద ర.భ.శాఖ రహదారి దెబ్బతింది. పి.గన్నవరం మూడు రహదారుల కూడలి నుంచి అంబాజీపేట వైపు ర.భ.శాఖ రహదారి మరింత అధ్వానంగా మారింది.

కోనసీమ ప్రాంతంలో...

కోనసీమ ప్రాంతంలో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, అల్లవరం, ముమ్మిడివరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, రావులపాలెం, ఆత్రేయపురం తదితర మండలాల్లో వశిష్ఠ, వైనతేయ, గౌతమి గోదావరి తీరాల్లో ఇసుక, తువ్వ   ఇసుక, లంకమట్టి తవ్వకాలు సాగుతున్నాయి. పి.గన్నవరం మండలంలో మానేపల్లి, కందాలపాలెం, లంకలగన్నవరం, వై.వి.పాలెం,
బెల్లంపూడి ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జోరుగా చేస్తున్నారు.  

అనుమతులు లేకున్నా..

కపిలేశ్వరపురంలో పగటి పూట పదుల సంఖ్యలో, రాత్రయితే వందల సంఖ్యలో వాహనాల్లో ఇసుక రవాణా సాగుతోంది. కపిలేశ్వరపురం-తాతపూడి గ్రామాల వద్ద గోదావరిలో 15 అడుగుల లోతున గోతులు ఏర్పడ్డాయి. దీనిపై తహసీల్దారు సూర్యారావు వివరణ కోరగా పరిస్థితి ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. ర్యాంపు నిర్వహణకు అనుమతులొచ్చాయని మైన్స్‌ అధికారులు చెప్పినా, తమకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదన్నారు.


తనిఖీలు చేపట్టి చర్యలు

ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చినప్పుడే కచ్చితంగా నదీ పరివాహక చట్టానికి లోబడే తవ్వకాలు చేపట్టాలని, నిబంధనలు అతిక్రమిస్తే అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశాం. నదీ గర్భంగా మీటరున్నరకు మించి తవ్వకూడదు. భారీగా తవ్వుతున్నట్లు మా దృష్టికి రాలేదు. నదిలో డ్రెడ్జింగ్‌ చేసేందుకు ఎవరికీ అనుమతులు లేవు. ఏటి గట్లపైనా భారీ వాహనాలు నడపకూడదు. క్షేత్రస్థాయి సిబ్బందితో తనిఖీలు చేపట్టి అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటాం.  
కాశీవిశ్వేశ్వరరావు, రివర్‌ కన్జర్వేటర్‌, ఈఈ, హెడ్‌ వర్క్స్‌, ధవళేశ్వరం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని