logo

ఆశల దీవి...అనుమతి ఎప్పుడో మరి!

గోదావరి వరదలకు సముద్రంలోకి కొట్టుకొచ్చే ఇసుకతో సహజ సిద్ధంగా సముద్రం మధ్యలో 200 ఏళ్ల క్రితం ఏర్పడిన భూభాగం హోప్‌ ఐలాండ్‌. కాకినాడ పోర్టుకు 13 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో 2,500 ఎకరాల్లో విస్తరించిందీ దీవి

Published : 06 Jun 2023 05:40 IST

మూడున్నరేళ్లుగా నిలిచిన హోప్‌ ఐలాండ్‌ సందర్శన

ఈనాడు, కాకినాడ

ఐలాండ్‌ విహంగ వీక్షణం


సహజ రక్షణ కవచం

గోదావరి వరదలకు సముద్రంలోకి కొట్టుకొచ్చే ఇసుకతో సహజ సిద్ధంగా సముద్రం మధ్యలో 200 ఏళ్ల క్రితం ఏర్పడిన భూభాగం హోప్‌ ఐలాండ్‌. కాకినాడ పోర్టుకు 13 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో 2,500 ఎకరాల్లో విస్తరించిందీ దీవి. ఈ ప్రాంతంపై వందల రకాల పక్షి జాతులు, విభిన్న జీవరాశులు ఆధారపడి ఉన్నాయి. కాకినాడ నగరాన్ని విపత్తుల నుంచి కాపాడే సహజ రక్షణ కవచమిది.

గతమంతా ఘనం

హోప్‌ ఐలాండ్‌లో పురాతన లైట్‌ హౌస్‌ ఉంది. ఇసుక తిన్నెలు.. సాగర జలాల్లో రాకపోకలు సాగించే పెద్ద్ద నౌకలు.. సుందర ప్రకృతి దృశ్యాలు ఇక్కడి ప్రత్యేకత. తాళ్లరేవు మండలంలోని కోరింగ అభయారణ్యంలో  అంతర్భాగం ఈ ప్రాంతం.

ఇప్పుడేమయ్యింది..?

ఈ దీవిలో పడవ ప్రయాణం నిలిచిపోయి మూడున్నరేళ్లు దాటింది. కచ్చులూరు వద్ద గోదావరిలో 2019లో పెను ప్రమాదం తర్వాత హోప్‌ ఐలాండ్‌ పర్యటన స్తంభించింది.  పాపికొండలు, గోదావరి, కోరింగ, దిండి పర్యాటక ప్రాంతాల్లో బోటు షికార్లు పునరుద్ధరించినా.. హోప్‌ ఐలాండ్‌కు మాత్రం నేటికీ మోక్షం దక్కలేదు.

మనసును హత్తుకునే చల్లని గాలులు.. చుట్టూ నీలి మేఘాలు.. అబ్బురపరిచే సాగర సోయగాలు.. పక్షుల కిలకిలారావాలతో మదిని దోచే సుందర ద్వీపం హోప్‌ ఐలాండ్‌. ఈ దీవి సందర్శనకు దేశ, విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ పర్యవేక్షణలో కాకినాడ పోర్టు నుంచి మోటరైజ్డ్‌ బోటు ద్వారా పర్యాటకులు హోప్‌ ఐలాండ్‌ పర్యటనకు వెళ్లేవారు. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత హోప్‌  ఐలాండ్‌ యాత్ర నిలిచిపోయింది. ఇక్కడి బోటును  రాజమహేంద్రవరంలోని పద్మావతి ఘాట్‌లో గోదావరి షికారుకు ఏడాదిన్నరగా తిప్పుతున్నారు. ఇన్‌లాండ్‌ వెసల్‌ నిబంధనలకు లోబడి హోప్‌ ఐలాండ్‌ పడవ ప్రయాణానికి అనువైన బోటుకు నిధులు మంజూరు చేయాలన్న ప్రతిపాదన బుట్టదాఖలయ్యింది.

పట్టాలెక్కని ప్రతిపాదనలు

కోరింగ అభయారణ్యాన్ని 1998లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించడంతో వైవిధ్య జీవరాశులున్న  ఈ ప్రాంతంలో అటవీ సంరక్షణ కార్యక్రమాలు మినహా మరేవీ అనుమతించకూడదన్న నిబంధన తెరమీదకు వచ్చింది. దీంతో కోరింగలో అంతర్భాగమైన హోప్‌ ఐలాండ్‌లో శాశ్వత పర్యాటక అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వాలు పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించినా ప్రగతి సాధ్యపడలేదు. అటవీశాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ బేస్డ్‌ ఎకో టూరిజం(సీబీఈటీ) ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనకూ మోక్షం దక్కడం లేదు. సారా తయారీ, అనధికారిక వ్యవహారాలకు అభయారణ్యం వేదిక అవుతుండడం విమర్శలకు తావిస్తోంది.

పరపతి ఉంటే సై..

అధికారికంగా హోప్‌ ఐలాండ్‌ సందర్శనను 45 నెలలుగా నిలిపేశారు. పర్యాటక బోటు ప్రమాణాలకు అనుగుణంగా లేదని పోర్టు యంత్రాంగం తేల్చి ఆంక్షలు తెరమీదకు తెచ్చినా.. ప్రభుత్వం అనువైన బోటుకు నిధులు సమకూర్చలేదు. దీంతో పర్యాటక శాఖ ఆదాయాన్ని కోల్పోయింది. హోప్‌ ఐలాండ్‌కు అనధికారిక రాకపోకలు మాత్రం ఆగలేదు. పరపతి, రాజకీయ దన్ను ఉన్న వ్యక్తులు ప్రైవేటు బోట్లలో దర్జాగా ఆ ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. పర్యవేక్షించాల్సిన కీలక శాఖలు చూసీచూడనట్లు వదిలేస్తున్నాయి.


కొద్ది నెలల్లో పర్యాటక ప్రయాణం

కాకినాడ నుంచి హోప్‌ ఐలాండ్‌కు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో బోటు తిప్పడానికి ఓ అడ్వంచర్స్‌ సంస్థకు అనుమతి దక్కింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదిరి.. పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని రెండు, మూడు నెలల్లో హోప్‌ ఐలాండ్‌ యాత్ర పునరుద్ధరించే అవకాశం ఉంది.
 పవన్‌కుమార్‌, డివిజనల్‌ మేనేజర్‌, ఏపీటీడీసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని