logo

నిబంధనలు పట్టక.. ఆదాయం దక్కక..

పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, పంచాయతీ పరిధుల్లో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి.

Published : 06 Jun 2023 05:42 IST

పెద్దాపురం పట్టణం

న్యూస్‌టుడే, పెద్దాపురం: పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, పంచాయతీ పరిధుల్లో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి. కుడా, గుడా, పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనల ప్రకారం భవన నిర్మాణదారులు పనులు చేపట్టాలి. నిబంధనలు కాగితాల్లోనే తప్పా ఆచరణలో కనిపించడంలేదు. ఇంటి ముందున్న మురుగుకాల్వ.. రోడ్డు.. స్థలం ఏదైనా ఆక్రమించుకుని అక్రమ కట్టడాలకు తెర లేపుతున్నారు. సొంత స్థలంలో కొంతభాగాన్ని రోడ్డుకు విడిచిపెట్టకుండా ముందుకు వచ్చి నిర్మాణాలు చేపడుతున్నట్లు అధికారులు గుర్తించినా చర్యలు శూన్యంగా మారుతున్నాయి. రోడ్డుకు ఎంత కావాలో స్థల యజమాని నుంచి మార్టిగేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించడంతో గతంలో యజమానులు ఆ స్థలాన్ని విడిచిపెట్టి నిర్మాణాలు చేపట్టేవారు. స్థల విస్తీర్ణం ప్రకారం వెనుక భాగం, రెండు పక్కలా సెట్‌ బ్యాక్‌ విడిచిపెట్టి కట్టడాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే భవన నిర్మాణదారులు పాటించడంలేదు. పల్లెలు, పట్టణాలు, నగర ప్రాంతాల్లోనూ ఇదే కొనసాగుతోంది. అలాంటి నిర్మాణాలను వార్డు, గ్రామ సచివాలయ సాంకేతిక సిబ్బంది గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళితే వారు భవన యజమానులకు నోటీసులు జారీచేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని పురపాలక సంఘాలు, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో ఇప్పటికే అధికారులు పలువురికి నోటీసులు అందించారు. వీటిపై స్పందించి భవన నిర్మాణదారులు క్రమబద్ధీకరణకు ముందుకు వస్తే అపరాధ రుసుం వసూలుచేసి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.

ఆదాయాన్ని కోల్పోతున్నాయి..

నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన యజమానులకు నోటీసులు జారీచేస్తున్నా ఆయా భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో జారీచేస్తే పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది. ఈ విషయమై ప్రభుత్వం,  ఉన్నతాధికారులు దృష్టి సారించడంలేదు. ఆస్తి పన్ను పెంచడం, చెత్తపై పన్ను విధించడం, ట్రేడ్‌ లైసెస్సుల రుసుం వసూలుపై దృష్టి సారిస్తున్నారే తప్ప రూ.కోట్లు ఆదాయం వచ్చే మార్గాలపై శ్రద్ధ చూపడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.


నోటీసులు జారీచేశాం..

నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టిన యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీచేశాం. కొందరిని ప్రాసిక్యూషన్‌ చేయడానికి కోర్టులో కేసులు వేశాం. పట్టణ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలి. వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వం భవనాల క్రమబద్ధీకరణకు జీవో జారీచేస్తే అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతాం. తద్వారా పురపాలక సంఘాల ఖజానాకు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతుంది.
జె.సురేంద్ర, రామారావు, రామ్మోహన్‌, మున్సిపల్‌ కమిషనర్లు పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని