logo

స్పందనకు పోటెత్తిన అర్జీలు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు అర్జీలు పోటెత్తాయి. మండుటెండలోనూ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు వినతులు అందజేశారు

Published : 06 Jun 2023 05:45 IST

సమస్య తెలుసుకుంటున్న కలెక్టర్‌ కృతికాశుక్లా

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు అర్జీలు పోటెత్తాయి. మండుటెండలోనూ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు వినతులు అందజేశారు. సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, ఇళ్ల స్థలాలకు కేటాయించాలని, కాలుష్య కారక పరిశ్రమలను పెట్టొద్దని, భూముల సమస్యలను పరిష్కరించాలని, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, తదితర సమస్యలపై 330 మంది అర్జీలు దాఖలు చేశారు. కలెక్టర్‌ కృతికాశుక్లా, జేసీ ఇలక్కియ, డీఆర్వో శ్రీధర్‌రెడ్డి, జడ్పీ సీఈవో సత్యనారాయణ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీలు సుబ్బలక్ష్మి, సునీత ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి అర్జీకి సరైన  పరిష్కారం చూపాలని జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.

ఈ నీరు తాగేదెలా..?

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 7వ డివిజన్‌ రేచర్లపేట, బర్మాకాలనీ ప్రాంతంలో గతనెల రోజులుగా కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయని, వీటి నుంచి కాపాడాలని సోమవారం కలెక్టరేట్‌ స్పందనలో కలెక్టర్‌ కృతికాశుక్లాకు మహిళలు ఫిర్యాదు చేశారు. కొళాయిల ద్వారా దుర్వాసన, రంగుమారిని నీటిని సరఫరా చేస్తున్నారని, వీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శుద్ధి జలాలను సరఫరా చేయాలని వేడుకున్నారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటిని తాగలేక ప్రైవేటుగా కొనుక్కోవాల్సి వస్తోందన్నారు. కొళాయిల నుంచి వస్తున్న కలుషిత జలాలు తాగి అనేక మంది రోగాల బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

నా బిడ్డను అప్పగించండి

తన బిడ్డను అప్పగించాలని పిఠాపురంలోని రథాలపేటకు చెందిన దాసరి లక్ష్మి స్పందనలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పేదరికాన్ని ఆసరాగా తీసుకొని రెండేళ్ల క్రితం తనకు పుట్టిన ఆడ పిల్లను ఇస్తే రూ. లక్ష ఇస్తానని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ వైద్యురాలు ఆశ చూపారన్నారు. బిడ్డను ఇచ్చినా తర్వాత డబ్బులు ఇవ్వలేదని సంబంధిత వైద్యురాలిని ప్రశ్నిస్తే కేసు పెడతానని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను ఏం చేశారో తెలియడం లేదని, వెంటనే ఇప్పించాలని ఆమె అధికారులకు విన్నవించారు.

ఈనాడు, కాకినాడ


పోలీసుశాఖకు 68 అర్జీలు

మసీదుసెంటర్‌(కాకినాడ): జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ ఫిర్యాదుదారుల నుంచి సోమవారం 68 అర్జీలు స్వీకరించారు. వీటిలో సివిల్‌ తగాదాలు-14, కుటుంబ తగాదాలు-26, ఇతర సమస్యలు-28 ఉన్నాయి. ఎస్పీ ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిపై సంబంధిత పోలీసు అధికారులతో వీసీ ద్వారా మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎస్పీలు పి.శ్రీనివాస్‌, సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులు, పట్టణ సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని