logo

ఉన్నతీకరణ ఉత్తిదేనా..?!

 పదో తరగతి బాలికలు ఇంటర్మీడియట్‌ విద్యకోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రాల్లోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం నుంచి జడ్పీ పాఠశాలల ఉన్నతీకరణ పేరుతో ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభించారు

Published : 06 Jun 2023 05:48 IST

ఉప్పలగుప్తం మండలంలో ఇంటర్మీడియట్‌ ప్రారంభించిన గొల్లవిల్లి జడ్పీ ఉన్నత పాఠశాల

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: పదో తరగతి బాలికలు ఇంటర్మీడియట్‌ విద్యకోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రాల్లోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం నుంచి జడ్పీ పాఠశాలల ఉన్నతీకరణ పేరుతో ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభించారు. జూనియర్‌ కళాశాలలు, కస్తూర్బా పాఠశాలలు లేని మండలాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానేఉన్నా ప్రవేశాలు ఆలస్యంగా చేపట్టడం, అధ్యాపకులను నియమించకుండా జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పీజీ అర్హత కలిగిన ఉపాధ్యాయులతో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యాంశాలు చెప్పించడం, మమ అనిపించడం తదితర చర్యలతో ఇక్కడ చేరిన విద్యార్థినులు చదువుపరంగా నష్టపోవాల్సివచ్చింది. మొత్తం పరీక్ష రాసినవారిలో కేవలం 32 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం, అదీ అత్తెసరు మార్కులు తెచ్చుకోవడం పరిస్థితిని తెలియజేస్తోంది.

జిల్లాలో 21 జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉన్నతీకరణ పేరుతో గతేడాది ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభించారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించినా.. మౌలిక వసతులు లేవనే కారణంతో ఈ కళాశాలల్లో చేరేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ప్రధానోపాధ్యాయులు, స్థానిక నాయకుల చొరవతో కొందరు చేరారు. జిల్లావ్యాప్తంగా 21 పాఠశాలల్లోనూ కేవలం 15 పాఠశాలల్లో మాత్రమే 190 మంది విద్యార్థినులు చేరారు. మరో ఆరు పాఠశాలల్లో ఒక్కరు కూడా చేరలేదు. వీరిలో కేవలం 19 మంది మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.

మార్పు వచ్చేనా..?

హైస్కూల్‌ ప్లస్‌ తొలి ఏడాది ఫలితాలపరంగా తీవ్ర నిరాశపరిచినా.. అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. ఇప్పుడైనా తగిన బోధనా సిబ్బందిని నియమిస్తారనుకుంటే ఈ ఏడాది కూడా స్కూల్‌ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చి తాత్కాలిక ఉద్యోగోన్నతి పేరుతో సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం జడ్పీ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల్లో పీజీ అర్హత ఉండి ఇంటర్‌ విద్యార్థులకు బోధన చేసేందుకు మక్కువచూపుతున్న వారి వివరాలు సేకరించి, వారికి కౌన్సెలింగ్‌ పూర్తిచేసి ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఉన్నతీకరించిన పాఠశాలల్లో నియామకాలు పూర్తి చేసినట్లు సమాచారం.

మౌలిక వసతుల మాటేది..

ఇంటర్మీడియట్‌ కళాశాలలుగా ఉన్నతీకరించిన జడ్పీ పాఠశాలల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై అధికారులు నోరుమెదపడం లేదు. మొదటి ఏడాది ప్రయోగశాలలతో అవసరం లేనప్పటికీ ద్వితీయ సంవత్సరంలో కచ్చితంగా విద్యార్థులకు ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకురావాల్సిఉంది. ప్రస్తుతం పాఠశాలల్లోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ గదులను ప్రయోగశాలలుగా వినియోగించుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా పూర్తి స్థాయి తరగతి గదులు లేకపోవడం కూడా లోపమే. ఇన్ని అవాంతరాల మధ్య పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన బాలికలను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు.

తల్లిదండ్రుల్లో ఆందోళన..

జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్లస్‌వన్‌ ఏర్పాటు చేశారు. మరికొన్ని రోజుల్లో ద్వితీయ సంవత్సరం ప్రారంభం కానుంది. మరోవైపు జడ్పీ ఉన్నత పాఠశాలల్ని ఉన్నతీకరించారే తప్ప.. అవసరమైన బోధకులను నియమించలేదనే ఆరోపణలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. స్థానికంగానే జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, పీజీటీలను నియమిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. ఆ తర్వాత వాటిగురించి పట్టించుకోలేదు. కొత్తగా ఏర్పాటుచేసిన కళాశాలల్లో ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోగశాలలతో కలిపి కనీసం అయిదు తరగతి గదులైనా ఉండాలి. కానీ ఏర్పాటు చేయలేదు. ఉన్నత పాఠశాలల్లో పీజీ పూర్తి చేసిన ఉపాధ్యాయులతో ఇంటర్మీడియట్‌ ప్రారంభించారు. పాఠ్య పుస్తకాల పంపిణీకూడా అంతంత మాత్రంగానే చేపట్టారు. దీంతో అక్కడ చేరిన విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

వసతుల కల్పనకు చర్యలు

ఇంటర్మీడియట్‌ కళాశాలలుగా ఉన్నతీకరించిన పాఠశాలల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. జిల్లావ్యాప్తంగా ఉన్నతీకరించిన పాఠశాలల్లో 140 మంది అధ్యాపకులు అవసరం కాగా ఇప్పటివరకు 107 మంది అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఆయా పాఠశాలల్లో నియామకాలు చేపట్టాం. మిగిలిన పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు వంటివాటిని కూడా పాఠశాలలు తెరిచేలోపు ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నాం. విద్యార్థినులు ఇబ్బందిపడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం.
కమలకుమారి, జిల్లా విద్యాశాఖాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని