logo

యథా ఫలితాలు.. తథా ప్రవేశాలు

విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌(ఇంటర్‌)లో మొదటి సంవత్సరం ప్రవేశాల్లో అధ్యాపకులకు అవస్థలు తప్పడం లేదు.

Published : 07 Jun 2023 05:26 IST

ఇంటర్మీడియట్‌ దరఖాస్తుల కోసం వచ్చిన విద్యార్థులు

న్యూస్‌టుడే, వెంకట్‌నగర్‌: విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌(ఇంటర్‌)లో మొదటి సంవత్సరం ప్రవేశాల్లో అధ్యాపకులకు అవస్థలు తప్పడం లేదు. వీటిని ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించినా కనీసం పాఠ్య పుస్తకాలు అందించలేకపోవడంతో ఆ ప్రభావం ఫలితాలు, ప్రవేశాలపై పడింది. గతేడాది పూర్తిస్థాయి అధ్యాపకులు లేకపోవడంతో జిల్లాలో ఉత్తీర్ణత 7.19 శాతానికే పరిమితమైంది. దీంతో ఇక్కడి ప్రవేశాలపై తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదనే వాదన వినిపిస్తోంది. మొదటి ఏడాది గడిచినా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రయోగపరీక్షలు ఎక్కడ చేయిస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.


ఇదీ పరిస్థితి..

* కాకినాడ రూరల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో  222 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ఇందులో 80 మంది బాలికలే. ఇప్పటి వరకు ఆ పాఠశాలలో కేవలం అయిదుగురు మాత్రమే ఇందులో ప్రవేశాలు పొందారు.

* కరప జడ్పీ ఉన్నత పాఠశాలలో 215 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ఇక్కడ బాలికలు 106 మంది ఉన్నారు. ఎనిమిది మంది మాత్రమే ప్లస్‌టులో చేరారు.


నిరాసక్తత..

ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా ప్రవేశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ప్రధానంగా ఉన్నత పాఠశాలలను ఉన్నతీకరించి మండలానికి ఒకటి చొప్పున బాలికల కోసం ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌లో మొదటి ఏడాది సగటున పది మంది చేరిన దాఖలాలు లేవు. యాజమాన్యాల వారీగా హైస్కూల్‌ ప్లస్‌ 15, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు 2, సోషల్‌ వెల్ఫేర్‌ 7, గురుకులాలు 13, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 14, కేజీబీవీలు 2, మోడల్‌ పాఠశాలలు 2, ప్రైవేటు కళాశాలలు 61 ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నింటిలోనూ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు పెరగ్గా ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. గతనెల 24 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి తరగుతులు ప్రారంభించారు. ప్రతి గ్రూపులోనూ పరిమితి లేకుండా విద్యార్థులకు అవకాశం కల్పించారు. గతేడాది కాకినాడ జిల్లాలో వివిధ యాజమాన్యాల్లో జనరల్‌, వృత్తి విద్యాకోర్సులు కలిపి మొదటి సంవత్సరంలో 21,279 మంది ప్రవేశాలు పొందారు.


అధ్యాపకుల నియామకం..

హైస్కూల్‌ ప్లస్‌లో బోధించేందుకు పీజీ పూర్తయిన స్కూల్‌ అసిస్టెంట్లను నియమించారు. వారంతా విధుల్లో చేరడంతో ప్రస్తుతం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి ప్రభుత్వ కళాశాలల్లోని వసతుల గురించి వివరిస్తున్నారు. కొంతమంది ఇళ్లకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. నాడు-నేడు కింద కళాశాలల్లో వసతులు మెరుగుపరిచి ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరిస్తున్నారు. ప్రవేశాల కోసం కళాశాలల వద్దే దరఖాస్తులు పొంది, పూర్తిచేసి తిరిగి అక్కడే అందజేయాలి. తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. హైస్కూల్‌ ప్లస్‌లో సౌకర్యాల మెరుగుకు చర్యలు తీసుకున్నామని డీఈవో అన్నపూర్ణ తెలిపారు. అన్నిచోట్లా అధ్యాపకులను  నియమించామని, సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత ప్రవేశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని