logo

పెడదారిలో ప్రైవేటు వైద్యం

కొవిడ్‌ అనంతర పరిణామాల దృష్ట్యా ప్రైవేటు ఆసుపత్రులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా ఆసుపత్రులు వెలుస్తున్నాయి. వీటి ఏర్పాటులో యాజమాన్యాలు నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి.

Published : 07 Jun 2023 05:32 IST

ఆసుపత్రుల ఏర్పాటులో నిబంధనలు బేఖాతరు
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

ఓ ఆసుపత్రిలో దస్త్రాలు పరిశీలిస్తున్న వైద్యఆరోగ్యశాఖ, ఐఎంఏ ప్రతినిధులు (దాచినచిత్రం)

కొవిడ్‌ అనంతర పరిణామాల దృష్ట్యా ప్రైవేటు ఆసుపత్రులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా ఆసుపత్రులు వెలుస్తున్నాయి. వీటి ఏర్పాటులో యాజమాన్యాలు నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది విద్యార్హత సక్రమంగా లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించి సేవలకు సిద్ధపడుతున్నారు. కొన్ని వైద్యశాలల్లో ఒకరి పేరిట అనుమతి తీసుకుని మరొకరు చికిత్సలు చేయడం.. కనీసం ఇంటర్‌ ఉత్తీర్ణత కూడా లేని వారిని ఓటీ సహాయకులు, నర్సులుగా నియమించి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల జిల్లాలో ఆసుపత్రులపై ఈ తరహా ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో నకిలీ ధ్రువపత్రంతో ఆసుపత్రి నిర్వహించిన ఓ వైద్యుడిపై ఆరు నెలల కిందట ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. మళ్లీ ఆ వైద్యుడు బయటికొచ్చి వేరొకరి రిజిస్ట్రేషన్‌తో ఆసుపత్రి ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసుకోవడం.. ఇంకా అనుమతులు రాకుండానే ఓపీ చూస్తుండడంతో వైద్యఆరోగ్యశాఖ పర్యవేక్షణ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు, ముగ్గురు ఆర్‌ఎంపీలు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు కలిసి ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, అందులో కన్సల్టెంటు వైద్యులను నియమించుకుని రోగి స్థితిని బట్టి ఆయా వైద్యులను బయట నుంచి పిలిపించి వైద్యసేవలందిస్తూ కాసులు దండుకుంటున్నారు. వైద్యఆరోగ్యశాఖ ఆయా ఆసుపత్రుల నిబంధనలు, వైద్యులు, సిబ్బంది ధ్రువపత్రాలపై ఆకస్మిక తనిఖీలు చేపడితే పదుల సంఖ్యలో నకిలీలు వెలుగుచూసే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.


జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో సుమారు 500 వరకు ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో మూడేళ్లలోపు ఏర్పాటైన వాటిలో సగానికి పైగా పూర్తిస్థాయి నిబంధనలు పాటించడం లేదు. వీరు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యుడి రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రం, సిబ్బంది విద్యార్హతలు, ఆసుపత్రి భవనం వివరాలు, వసతులు, పడకలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కొత్త ఆసుపత్రి ప్రారంభ అనుమతులు కోరుతూ వైద్యఆరోగ్య శాఖకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇందులో కొన్నింటిని మొక్కుబడిగా పరిశీలించి అనుమతులివ్వడం, మళ్లీ ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడే వాటిని పరిశీలిస్తుండడంతో కొందరు ఇష్టానుసారంగా వైద్యం చేస్తున్నారు.


ఇలా జరుగుతోంది..

* సాధారణంగా ఆసుపత్రి ప్రారంభానికి ముందు ఏ వైద్యుడి పేరిట అనుమతులు కోరుతున్నారో ఆయన అక్కడ కచ్చితంగా ఉండాలి. ఎక్కడో ఉన్న వైద్యుడి ధ్రువపత్రాన్ని చూపి అనుమతులు పొంది, వేరొకరు చికిత్సలు చేయకూడదు. నగరంలోని కొన్ని ఆసుపత్రుల్లో అదే జరుగుతుంది.

* ఆన్‌లైన్‌లో ఆసుపత్రి అనుమతి కోసం దరఖాస్తు చేసేటప్పుడే వైద్యులు, సిబ్బంది విద్యార్హతలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉన్నా ధ్రువపత్రం ఒకరిది.. ఆసుపత్రిలో ఉండేది మరొకరు అన్నట్లుగా ఉంటుంది.

* అనుమతులొచ్చాక విద్యార్హత లేనివారిని తక్కువ వేతనాలకు నియమించుకుని వచ్చీరాని వైద్యంతో రోగులను ఇబ్బంది పెడుతున్నారు.

* జిల్లాలో మూడేళ్లలో 70 ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులిచ్చారు. అందులో కొన్ని అత్యవసర వైద్యశాలలు ఉన్నాయి. వాటిలో సంబంధిత విభాగ నిపుణులైన వైద్యులు లేకుండానే సేవలందిస్తున్నారు.


కానరాని పర్యవేక్షణ

ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొరవడింది. నగరంలోని నకిలీ వైద్యుడిని గుర్తించినప్పుడు కలెక్టర్‌ ఆధ్వర్యంలో వైద్యఆరోగ్య శాఖ, భారతీయ వైద్య మండలి(ఐఎంఏ) అధికారులతో సమావేశం నిర్వహించి అన్ని ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించాలని.. నిబంధనలు పక్కాగా అమలు చేయాలని.. లోపాలున్న ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించినా మొక్కుబడి తంతుగా ముగించారనే ఆరోపణలు ఉన్నాయి.


ఫిర్యాదు చేస్తే చర్యలు
- డాక్టర్‌ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

నకిలీ వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్న విషయమై ఆయా ఆసుపత్రులపై ప్రజలు ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. గతంలో ఎనిమిది బృందాలతో ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీలు చేపట్టాం. నిబంధనలు అతిక్రమిస్తే మూల్యం తప్పదు. నకిలీ ధ్రువపత్రాలతో ఆసుపత్రులు పెట్టేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు