logo

పేదల దరిచేరని జనరిక్‌ మందులు..

తక్కువ ధరలకే రోగులకు మందులు అందించాలనే సదాశయంతో ప్రవేశపెట్టిన జనరిక్‌ మందుల దుకాణాలు పేదల దరికి చేరలేకపోతున్నాయి. వీటిపై ప్రజలకు సరైన అవగాహన, ప్రభుత్వ ప్రోత్పాహం కానరాక దుకాణాలు వెలవెలబోతున్నాయి.

Published : 07 Jun 2023 05:47 IST

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన  జనరిక్‌ మందుల దుకాణం

క్కువ ధరలకే రోగులకు మందులు అందించాలనే సదాశయంతో ప్రవేశపెట్టిన జనరిక్‌ మందుల దుకాణాలు పేదల దరికి చేరలేకపోతున్నాయి. వీటిపై ప్రజలకు సరైన అవగాహన, ప్రభుత్వ ప్రోత్పాహం కానరాక దుకాణాలు వెలవెలబోతున్నాయి. దీంతో గత్యంతరంలేక పేదలుసైతం భారీ ధరలు వెచ్చించి బ్రాండెడ్‌ మందులు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి.


గణాంకాల ప్రకారం..

అనారోగ్యంతో బాధపడేవారు ప్రతినెలా వైద్యసేవలు, మందులకోసం రూ.వేలల్లో వెచ్చిస్తున్నారు. దీర్ఘకాలిక రోగులు తమ ఆదాయంలో 30 శాతం ఆస్పత్రి, వైద్య పరీక్షలు, మందులకే కేటాయిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాంటివారు జనరిక్‌ మందులు వినియోగించే సౌలభ్యం ఉన్నా.. చాలాచోట్ల జనరిక్‌ ఔషధ దుకాణాలు అందుబాటులో ఉండటం లేదు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటుగా బ్రాండెడ్‌ మందులనే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు బ్రాండెడ్‌ మందులే సూచిస్తుండడంతో తాము జనరిక్‌ మందులు కొనుగోలు చేసేందుకు సంశయించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. దీంతో రూ.10కి వచ్చే మాత్రలకు రూ.100 వరకు వెచ్చించాల్సివస్తోందంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో జనరిక్‌ మందులే రాయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనిని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అమలుచేసే వీలుంది. ఆ దిశగా వైద్యారోగ్యశాఖ నుంచి ప్రయత్నాలు కానరావడం లేదనే విమర్శలున్నాయి.


అవగాహన లేక..

జనరిక్‌ మందులు సరిగా పనిచేయవనే అపోహతోనే రోగులు బ్రాండెడ్‌ మందులను ఆశ్రయిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. జనరిక్‌ మందులు నాణ్యమైనవైనా వినియోగించేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ వైద్యులు, వైద్యారోగ్యశాఖ అధికారులు మిన్నకుండిపోవడంతో జనరిక్‌ మందులు ఆదరణకు నోచుకోవడం లేదు. ఫార్మా కంపెనీలు తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రైవేటు వైద్యులు బ్రాండెడ్‌ మందులే రాసేలా చేస్తుండటమూ ఓ కారణమనే ఆరోపణలూ ఉన్నాయి. కొందరు వైద్యులు కమీషన్‌ల కోసం బ్రాండెడ్‌ మందులే రాస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.


20 ఏళ్ల తరువాత నాన్‌ బ్రాండెడ్‌..

ఫార్మా కంపెనీలు కొత్త రకం మందులను కనుగొనేందుకు చాలా ఏళ్లపాటు పరిశోధనలు చేస్తాయి. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించి, అన్నిరకాల పరీక్షలు విజయవంతమయ్యాక తమ సొంత బ్రాండ్‌పై మార్కెట్‌లోకి విడుదల చేస్తాయి. వాటిపై వారికి కొన్ని సంవత్సరాలపాటు పేటెంట్‌ హక్కులు ఉంటాయి. అప్పటివరకు ఆ మందులను ఆదే ఫార్ములాతో ఇతర కంపెనీలు తయారు చేయకూడదు. 20 ఏళ్ల తరువాత అదే ఫార్ములాతో వేరే కంపెనీలు ఔషధాలను తయారుచేసి ఎలాంటి బ్రాండ్‌ లేకుండా మార్కెట్‌లోకి జనరిక్‌ పేరుతో తక్కువ ధరకే విడుదల చేస్తాయి. వీటిని కేవలం జనరిక్‌ మందుల దుకాణాల్లో మాత్రమే అమ్ముతారు.


జిల్లాలో నామమాత్రంగానే..

జిల్లాలో జనరిక్‌ దుకాణాలకు ప్రజాదరణ అంతంతమాత్రంగానే ఉంటోంది. జిల్లావ్యాప్తంగా కేవలం 13 జనరిక్‌ దుకాణాలు మాత్రమేఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రతి మండల కేంద్రంలోనూ వీటిని ఏర్పాటుచేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత ప్రభుత్వపరంగా వీటికి ప్రోత్సాహం లేకపోవడంతో క్రమేపీ ప్రజలకు దూరమయ్యాయి. రూ.లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటుచేసినా పూర్తిస్థాయిలో అమ్మకాలు లేక అనేక మంది మూసేశారు. అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట, రాజోలు, లక్కవరం ప్రభుత్వాసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా మరో ఎనిమిది చోట్ల ఉన్నాయి.


ఎంతో  ప్రయోజనకరం

జనరిక్‌ మందులకు పరిశోధనలు, క్లినికల్‌ ట్రయల్స్‌ వంటి ఖర్చులు ఉండకపోవడంతో వాటి ధరలు తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు బలానికి వినియోగించే ఓ రకం మాత్రల షీట్‌ బ్రాండెడ్‌లో రూ.135 వరకు ఉంటుంది. అదే జనరిక్‌లో రూ.40కే లభిస్తుంది. జలుబుకు వినియోగించే మరో రకం పది మాత్రల షీట్‌ రూ.10 ఉంటే జనరిక్‌ దుకాణాల్లో  రూ.3కే వస్తుంది. నొప్పులకు వినియోగించే స్ప్రేలు బ్రాండెడ్‌లో రూ.230 ఉంటే జనరిక్‌లో రూ.130 నుంచి అందుబాటులో ఉంటున్నాయి.


అపోహ మాత్రమే..
- దుర్గారావుదొర, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి

ప్రముఖ కంపెనీల నుంచి వచ్చే బ్రాండెడ్‌ మందులు, జనరిక్‌ మందుల్లోనూ ఒకే ఫార్ములా ఉంటుంది. బ్రాండెడ్‌ మందులతో మాత్రమే రోగం నయమవుతుందనేది కేవలం అపోహ మాత్రమే. బ్రాండెడ్‌ మందులు వాడాలా, జనరిక్‌ వాడాలా అన్నది రోగుల ఇష్టం. జనరిక్‌ ఔషధాలు వినియోగించడం వల్ల ఇతర ఇబ్బందులు ఏమీ ఉండవు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని