logo

ఒకటే వంతెన.. ఎక్కాలంటే యాతన

ప్రయాణికుల భద్రతే మా లక్ష్యం.. అంటూ రైల్వే శాఖ అన్ని స్టేషన్లలో భారీగా ప్రచారం చేస్తున్నా ఆచరణలో శూన్యమని చెప్పడానికి నిదర్శనం పలుచోట్ల ప్రయాణికులు ప్రమాదకరంగా పట్టాలు దాటడమే.

Published : 08 Jun 2023 05:01 IST

న్యూస్‌టుడే, పెద్దాపురం, సామర్లకోట

రెండు, మూడు ప్లాట్‌ఫారాల నుంచి మొదటి ప్లాట్‌ఫారానికి రావడానికి పట్టాలు దాటుతున్న ప్రయాణికులు

ప్రయాణికుల భద్రతే మా లక్ష్యం.. అంటూ రైల్వే శాఖ అన్ని స్టేషన్లలో భారీగా ప్రచారం చేస్తున్నా ఆచరణలో శూన్యమని చెప్పడానికి నిదర్శనం పలుచోట్ల ప్రయాణికులు ప్రమాదకరంగా పట్టాలు దాటడమే. కాకినాడ జిల్లాలోని సామర్లకోట జంక్షన్‌ రైల్వేపరంగా ప్రధాన జంక్షన్‌. రోజూ ఇటు విశాఖపట్నం, అటు విజయవాడ నగరాలకు 60 రైళ్లు పరుగులు తీస్తుంటాయి. వాటిలో దాదాపు 20 వేల మంది వరకు ఈ స్టేషన్‌ నుంచే వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు. పెద్దాపురం, సామర్లకోట, ప్రత్తిపాడు, జగ్గంపేట, ఏలేశ్వరం, గండేపల్లి, కిర్లంపూడి, కాకినాడ తదితర కేంద్రాల నుంచి ప్రయాణికులు సామర్లకోట నుంచే వివిధ నగరాలు, ముఖ్య ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇలాంటి కీలకమైన స్టేషన్‌లో మూడు ప్లాట్‌ఫారాలు, ఒకటే వంతెన ఉంది. రైళ్లు ఎక్కడానికి, దిగి ఫ్లాట్‌ఫారాలు మారడానికి ఎంతో అవసరమైన వంతెన ఎక్కడానికి కొంత దూరం నడిస్తేనేగానీ అందుబాటులోకి రాదు. ఈ కారణంగా ఎక్కువ మంది ప్రయాణికులు బ్యాగులు, సామగ్రితో నడవలేక, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలతో వచ్చినవారు, చంటిపిల్లలను ఎత్తుకున్న మహిళలు పట్టాలు దాటేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఆ సమయంలో రైళ్ల రాకపోకలు ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. రైల్వే శాఖాపరంగా ఇది ప్రధాన జంక్షన్‌ అయినా స్టేషన్‌లో ఎస్కలేటరు లేదు. ఒక ఫ్లాట్‌ఫారంపై వంతెన ఉన్న నేపథ్యంలో మధ్యలో మరో వంతెన లేదా ఎస్కలేటర్‌ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు అందించినా స్పందన లేదు.


రైల్వే జోనల్‌ సమావేశంలో చర్చిస్తా...

సామర్లకోట రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులను కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌, రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను. స్టేషన్‌లో ఫ్లాట్‌ఫారాలు మారేందుకు రెండో వంతెన, ఎస్కలేటర్‌ అవసరమే. చాలామంది ప్రయాణికులు ప్రమాదకర పరిస్థితుల్లో పట్టాలు దాటుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని రైల్వే జోనల్‌ సమావేశంలో చర్చిస్తాను.

రావుల మాధవరావు, జడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు, పిఠాపురం


ప్రతిపాదనలు పంపాం..

సామర్లకోట రైల్వేస్టేషన్‌ ప్రధాన జంక్షన్‌ అన్నది వాస్తవమే. ప్రస్తుతం ఒకే ప్లాట్‌ఫారం వంతెన ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుంటే మరొకటి అవసరం. ప్రయాణికుల ఇబ్బందులను అర్థం  చేసుకుని ఎస్కలేటర్‌ ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపాం. వారి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఏర్పాటుకు కృషి చేస్తాం.

ఎం.రమేష్‌, రైల్వేస్టేషన్‌ మాస్టర్‌, సామర్లకోట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని