logo

టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకర్ల కొర్రీ

అమలాపురం పట్టణానికి చెందిన లక్ష్మి అనే గృహిణికి అల్లవరం మండలం బోడసకుర్రు పంచాయతీ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయంలో ఇల్ల్లు మంజూరైంది. అధికారులు బ్యాంకు రుణం వస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పారు.

Published : 08 Jun 2023 05:01 IST

సిబిల్‌ స్కోర్‌, వయస్సు పేరిట రుణాల మంజూరుకు నిరాకరణ
న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

బోడసకుర్రు వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయం

అమలాపురం పట్టణానికి చెందిన లక్ష్మి అనే గృహిణికి అల్లవరం మండలం బోడసకుర్రు పంచాయతీ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయంలో ఇల్ల్లు మంజూరైంది. అధికారులు బ్యాంకు రుణం వస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పారు. దీంతో రుణం కోసం ఆమె బ్యాంకుకు వెళ్లగా సిబ్బంది ఆధార్‌ నంబరు ద్వారా సిబిల్‌ స్కోరు పరిశీలించి తక్కువగా ఉన్న కారణంగా రుణం మంజూరు చేయలేమన్నారు. సొమ్ము చెల్లిస్తే తప్ప రిజిస్ట్రేషన్‌ చేయలేమని అధికారులు చెబుతున్నారు.

రామచంద్రపురం పురపాలిక పరిధిలో 55 ఏళ్ల మహిళకు నాలుగేళ్ల కిందట టిడ్కో ఇల్లు మంజూరైంది. పత్రం చేతికొచ్చే సమయంలో ప్రభుత్వం మారింది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ల తరువాత రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభించారు. లబ్ధిదారుడి వాటా సొమ్ము పోను మిగిలిన మొత్తం రుణంగా తీసుకునేందుకు బ్యాంకుకు వెళితే వయస్సు ఎక్కువగా ఉన్నందున ఇవ్వలేమని చెప్పేశారు.

..వీరే కాదు.. జిల్లా వ్యాప్తంగా సుమారు 316 మంది లబ్ధిదారులకు సిబిల్‌ స్కోరు లేని కారణంగా రుణం ఇవ్వడానికి బ్యాంకర్లు తిరస్కరించారు.

పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లకు నాలుగేళ్లవుతున్నా పూర్తిస్థాయిలో మోక్షం కలగడం లేదు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. మరో వైపు లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడానికి అవసరమైన రుణాల మంజూరుకు బ్యాంకులు
పలు కొర్రీలు పెడుతున్నాయి. దీంతో కొందరు లబ్ధిదారులు సొంత సొమ్ముతో రిజిస్ట్రేషన్లకు సిద్దమవుతుంటే, మరి కొందరికి చేతిలో సొమ్ము లేక సొంత గూడుకు దూరమవ్వాల్సి వస్తోంది.

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, మండపేట పురపాలికల పరిధిలో ఉన్న పేదలకు ఆయా ప్రాంతాల్లో  4,192 టిడ్కో ఇళ్లు నిర్మించారు. మూడు కేటగిరీలుగా గృహాలు నిర్మించి లబ్ధదారులకు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వీటిలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లకు బ్యాంకు రుణాలు అవసరం లేదు. 365, 430 చ.అ. కేటగిరీ ఇళ్ల లబ్ధిదారులకు మాత్రం బ్యాంకు రుణం అవసరం. గతేడాది నవంబరు నుంచి అధికారులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు పెట్టారు. ఆరునెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించలేకపోయారు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సాంకేతిక కారణాలు సాకుగా చూపి తప్పుకుంటున్నాయి. దీంతో చేసేది లేక కొందరితో సొంత డబ్బు కట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అమలాపురం పురపాలిక పరిధిలో రూ.3 లక్షల రుణం చెల్లించేందుకు మూడు వాయిదాలు ఇచ్చినట్లు సమాచారం. ఇలా సుమారు వంద మందికి పైగా వరకు సొంత సొమ్ము చెల్లించి టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.

పాత బకాయిలు చెల్లిస్తే ఆలోచిద్దాం..

జగనన్న తోడు, చేదోడు, ముద్ర, స్వనిధి వంటి ప్రభుత్వ పథకాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా స్వల్ప రుణాలు మంజూరు చేశారు. వాటికి కూడా అధికారులకు లక్ష్యాలు విధించడంతో అవసరం లేని వారికి కూడా వెంటపడి ఇచ్చారు. ఆయా రుణాలను తిరిగి ఏడాదిలోగా బ్యాంకులకు చెల్లించాలి. తక్కువ మొత్తమే అయినా కొంత మంది కొన్ని వాయిదాలు బకాయి పడడం, సకాలంలో చెల్లించక పోవడం వంటివి జరిగాయి. టిడ్కో రుణాలకొచ్చే సరికి ఈ బకాయిల ప్రభావం వల్ల సిబిల్‌ స్కోర్‌ తగ్గి రుణాల మంజూరుకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పాత బకాయిలు చెల్లించి నాలుగు నెలలు తరువాత రండి అప్పటికి సిబిల్‌ స్కోరు పెరుగుతుంది. అప్పుడు రుణాల గురించి ఆలోచిద్దామని పంపించేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.


బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం..

టిడ్కో ఇళ్లరుణ ప్రక్రియ దాదాపుగా పూర్తికావస్తోంది. జిల్లా వ్యాప్తంగా 300 మంది పైగా సిబిల్‌ స్కోరు లేని కారణంగా రుణాలు నిలిచి పోయాయి. వారిలో ఇప్పటి వరకు సుమారు సగం మంది పైగా సొంత సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సిబిల్‌ స్కోరు లేని వారికి, వయస్సు పైబడిన వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు.అవకాశం ఉన్నంత వరకు బ్యాంకు రుణాలు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. లేని పక్షంలో సొంతంగా సొమ్ము చెల్లించాలని లబ్ధిదారులకు సూచిస్తున్నాం.

ప్రియంవద, మెప్మా పీడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని