logo

పోలవరం నిర్మాణం తెదేపాకే సాధ్యం

తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని, వైకాపా ప్రభుత్వం వల్లకాదని గత నాలుగేళ్లలో రుజువైందని రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యుడు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.

Published : 08 Jun 2023 05:01 IST

గోరంట్ల బుచ్చయ్యచౌదరి
దేవీచౌక్‌ (రాజమహేంద్రవరం)

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గోరంట్ల

తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని, వైకాపా ప్రభుత్వం వల్లకాదని గత నాలుగేళ్లలో రుజువైందని రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యుడు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని జగన్‌ ప్రభుత్వం నిధులు దోచుకుంటోందని ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెదేపా హయాంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆదా చేస్తామని చెప్పిన జగన్‌ రెట్టింపు నిధులు ఖర్చు చేస్తున్నా, ఈ ప్రభుత్వంలో పనులు 2 శాతమే పూర్తయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు పూర్తయితే, ఈ నాలుగేళ్లలో వారు సాధించిన పురోగతి 2 శాతమేనని ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు పునరావాస కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని, నాలుగేళ్లలో కనీసం ఒక్క ఇల్లు అయినా నిర్మించారా? అని ప్రశ్నించారు. నీటి నిల్వను 194 టీఎంసీల నుంచి 145కు తగ్గించి జాతీయ ప్రాజెక్టును కాటన్‌ బ్యారేజీ స్థాయికి దిగజార్చారని ఆక్షేపించారు. రాయలసీమకు నీరు వెళ్లకుండా చేసి సీమాంధ్రులకు ద్రోహం చేశారన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు 2025 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని చెబుతుంటే, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్‌ మాత్రం డిసెంబరు నాటికి ప్రారంభిస్తామని అంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు మీడియాను రానివ్వకుండా అంత రహస్యంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పనికిమాలిన ప్రభుత్వ నిర్వాకం వల్ల 900 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోయిందన్నారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై చర్చకు రావాలని గోరంట్ల సవాలు విసిరారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్‌, మద్యం ఇలా.. అన్నింట్లోనూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్తు ఛార్జీలను నాలుగు రెట్లు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. రాయలసీమలో లోకేశ్‌ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో తెదేపా నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, మత్సేటి శివప్రసాద్‌ పాల్గొన్నారు.

మద్యనిషేధం హామీలాంటిదే..

టి.నగర్‌: ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన కొత్త పింఛన్‌ పథకం అమలుపై నమ్మకం లేదని రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. బుధవారం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. గత ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అమలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి తప్పాడని గుర్తు చేశారు. మద్యనిషేధం లాంటి హామీనే మళ్లీ ఇప్పుడు తెరపైకి తెచ్చాడని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని