logo

వైకాపా నాయకుడి దాష్టీకం

రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనం ఉంచాడని ఓ కారు డ్రైవర్‌పై వైకాపా నాయకుడు, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఏనుగు శ్రీను(బంకు శ్రీను), అతని అనుచరులు బీరు సీసాలతో దాడి చేశారు.

Published : 08 Jun 2023 05:01 IST

బైక్‌ అడ్డంగా ఉందని బీరు సీసాతో దాడి

చికిత్సపొందుతున్న మణికంఠ

మసీదుసెంటర్‌(కాకినాడ), ప్రత్తిపాడు: రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనం ఉంచాడని ఓ కారు డ్రైవర్‌పై వైకాపా నాయకుడు, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఏనుగు శ్రీను(బంకు శ్రీను), అతని అనుచరులు బీరు సీసాలతో దాడి చేశారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కిర్లంపూడికి చెందిన కారు డ్రైవర్‌ బందిల మణికంఠ మంగళవారం రాత్రి రాచపల్లిలోని అత్తవారి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలోని పోలవరం కాలువ వంతెన వద్ద లఘుశంక తీర్చుకునేందుకు వాహనం ఆపి పక్కకు వెళ్లారు. అదే సమయంలో ఆ మార్గంలో కారులో వచ్చిన శ్రీను, మరో ఐదుగురు బీరు సీసాతో దాడి చేశారు. బాధితుడికి స్థానికంగా ప్రాథమిక చికిత్స చేసి, బుధవారం కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించగా వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం సర్జికల్‌ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో మణికంఠ పరిస్థితి చూసి ఆయన భార్య జ్యోతి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం ఆమె, బాధితుడి సోదరుడు చిన్న విలేకరులతో మాట్లాడారు. బంకు శ్రీను, అతని అనుచరులే తన భర్తపై బీరు సీసాలతో దాడి చేశారని జ్యోతి ఆరోపించారు. వైకాపా నాయకుడు శ్రీను ఇతర పార్టీల వారితో గొడవలు పెట్టుకుని దాడులు చేయడంతో పాటు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంటారని ఆరోపించారు. గతంలో తనపైనా కేసులు పెట్టించారని బాధితుడి సోదరుడు చిన్న చెప్పారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ మణి కంఠ వాహనాన్ని రహదారిపై నిలపడంతో రాకపోకలకు అడ్డుగా లేకుండా పక్కన పెట్టాలని దారిలో వెళ్తున్నవారు కోరారని, ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న బంకు శ్రీను, మణికంఠకు వాగ్వాదం జరిగిందన్నారు. అనంతరం తనపై దాడి జరిగిందని మణికంఠ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపారు. దీనిపై ఏనుగు శ్రీను మాట్లాడుతూ.. రోడ్డుపై వాహనం తీయమని చెప్పిన సమయంలో అతడితో వాగ్వాదం జరిగిందే తప్ప దాడి చేయలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని