logo

ఎడాపెడా కట్‌ కట్‌

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్తు సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఓ వైపు అత్యవసర మరమ్మతుల పేరుతో గంటల కొద్దీ సరఫరా నిలిపివేస్తుండగా మరో వైపు అధిక లోడ్‌ కారణంగా అనేక ప్రాంతాల్లో కోత విధిస్తుండటంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Updated : 09 Jun 2023 05:45 IST

విద్యుత్తు సరఫరా నిలిచి అవస్థలు

దేవీచౌక్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్తు సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఓ వైపు అత్యవసర మరమ్మతుల పేరుతో గంటల కొద్దీ సరఫరా నిలిపివేస్తుండగా మరో వైపు అధిక లోడ్‌ కారణంగా అనేక ప్రాంతాల్లో కోత విధిస్తుండటంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండేళ్ల క్రితం ఇదే సమయంలో 19-20 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగం ఉండేది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పంకాలు, ఏసీలు నిరంతరం పనిచేస్తూనే ఉండటంతో వినియోగం 21 మి.యూనిట్లకు చేరుకుంది. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా కీలక సమయాల్లో రెండు నుంచి మూడు గంటలు కోత విధిస్తున్నారు. ఏటా వాడకం పెరుగుతున్నా తదనుగుణంగా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో ఈపీడీసీఎల్‌ సీఎండీ అధికారులతో సమావేశం నిర్వహించి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని సూచించారు. అధికారులు సైతం వేసవి ప్రారంభానికి ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలుకాలేదు. బుధవారం 220 కేవీ పరవాడ-కాకినాడ రెండో సర్క్యూట్‌లో బ్రేక్‌ డౌన్‌ కారణంగా సాయంత్రం 6.50 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచింది. కాకినాడ, అమలాపురం డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో విడతల వారీ ఈఎల్‌ఆర్‌ ఇచ్చారు. 5 గంటల చొప్పున కోత పడటంతో ఈసురోమనాల్సి వచ్చింది. గురువారం రాజమహేంద్రవరం గ్రామీణంలోని అనేక ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు కరెంట్‌ లేదు. జిల్లాలో అత్యధిక వినియోగం ఉన్నప్పటికీ నిరంతరం సరఫరా చేస్తున్నట్లు రాజమహేంద్రవరం సర్కిల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. గాలివానలు, సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే అంతరాయం ఏర్పడుతోందన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు