logo

సహకారంతోనే ఆక్వా రైతుల సంక్షేమం

ఆక్వా రైతులకు ఎంపెడా(సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద పలు రాయితీలు కల్పిస్తోంది. సంఘాలుగా ఏర్పడిన ఆక్వా రైతులకు ఇప్పటికే అనేక పథకాలు అందిస్తున్నారు.

Published : 09 Jun 2023 03:40 IST

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

అల్లవరంలో సాగవుతున్న రొయ్యల చెరువు

ఆక్వా రైతులకు ఎంపెడా(సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద పలు రాయితీలు కల్పిస్తోంది. సంఘాలుగా ఏర్పడిన ఆక్వా రైతులకు ఇప్పటికే అనేక పథకాలు అందిస్తున్నారు. అలాంటి సంఘాలన్నింటినీ సహకార సంఘాలుగా మార్చి ఎక్కువ లబ్ధిచేకూర్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఎంపెడా ఆధ్వర్యంలో కేంద్రం అందిస్తున్న రాయితీలు పొందాలంటే సహకార సంఘాలుగా ఏర్పడడం తప్పనిసరి.. అనే నిబంధన విధించింది. దీనికోసం ఎంపెడా అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

అనుమతులు తప్పనిసరి

ఇప్పటివరకు ఎంపెడా అమలుచేస్తున్న పథకాలకు సంబంధించి ఆ శాఖ పరిధిలోని సంఘాలకు అనుమతులు జారీ చేసి రాయితీలిచ్చేవారు. కొత్త నిబంధనల మేరకు రైతులు సాగు చేసే చెరువులకు సీఏఏ(కోస్టల్‌ ఆక్వా అథారిటీ) అనుమతులు కచ్చింతగా తీసుకోవాలని ఆదేశించింది. ఇవి రావాలంటే రైతులందరూ విధిగా సొంత భూమి కలిగిఉండాలి. కానీ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కౌలుదారులే ఎక్కువగా ఆక్వా సాగుచేస్తున్నారు. దీంతో వేలాది మంది కేంద్రం అందించే లబ్ధి పొందలేకపోతున్నారు. నిబంధనలు మార్చాలని మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోడం లేదని పలువురు వాపోతున్నారు.

గతంలో ఇలా..

జిల్లాలోని పలు గ్రామాల్లో ఆక్వా రైతులను సభ్యులుగా చేసి సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసేవారు. ఎంపెడా ఆధ్వర్యంలో వివిధ పథకాల ద్వారా రాయితీలు ఇచ్చేవారు. ఎంపెడా పథకాలకు సంబంధించి ఆ శాఖ పరిధిలోనే లైసెన్సులు జారీ, రాయితీలు సమకూర్చేవారు.

మారిన నిబంధనలతో..

ప్రస్తుతం మారిన నిబంధనల ప్రకారం రైతులు తాము సాగుచేసే చెరువులకు కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ అనుమతులు కచ్చితంగా పొందాలి. పాత సంఘాలన్నింటినీ సహకార సంఘాలుగా మార్చితేనే రాయితీలు అందుతాయి. జిల్లావ్యాప్తంగా ఎంపెడా అధికారులు సమావేశాలు ఏర్పాటుచేసి సంఘాలను మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువ మంది కౌలురైతులు, అసైన్డ్‌ భూముల్లో సాగు చేస్తుండటం, సీఆర్‌జడ్‌, గోదావరి పరివాహక ప్రాంతాలు, నాన్‌ ఆక్వా జోన్‌ పరిధిలో సాగు చేస్తుండటంతో వారికి సీఏఏ అనుమతులు లభించని పరిస్థితి. వారు ప్రస్తుతం కొనసాగుతున్న సంఘాలను సహకార సంఘాలుగా మార్చుకునే వీలులేదు. దీంతో ఈ ప్రాంత రైతులు కేంద్రం అందించే పథకాలకు దూరం కావాల్సిందేనా.. అని వాపోతున్నారు.

ప్రయోజనాలు ఇవే..

ఎంపెడా ఆధ్వర్యంలో సంఘాలుగా ఏర్పడిన రైతులకు రాయితీపై సాగు పరికరాలు అందిస్తారు. వీటిల్లో ఏరియేటర్లు, పంకాలు ఉంటాయి. ఇవి కాకుండా ఆక్వా ఉత్పత్తులు తరలించేందుకు రహదారులు, మైనర్‌ డ్రెయిన్లపై చిన్నచిన్న కల్వర్టులు నిర్మిస్తారు. తీర ప్రాంత మండలాల్లో ల్యాబ్‌లు ఏర్పాటుచేసి రైతులకు నీటి నాణ్యత పరీక్షలు, వ్యాధుల నిర్ధారణ, ఇతర పరీక్షలు నిర్వహించి రైతులకు వివరిస్తారు.

పది మంది కలిసి..

ఆక్వా సాగు చేస్తున్న పది మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడాలి. వీరికి 1964 సహకార చట్టం ప్రకారం అనుమతులు ఇస్తారు. సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతుల్లో జనరల్‌ కేటగిరీవారికి 50 శాతం, ఎస్సీ కేటగిరీ రైతులకు 70 శాతం రాయితీపై పరికరాలు అందిస్తారు. రైతులు పండించిన పంటకు మంచి ధర వచ్చేలా వీరు కృషి చేస్తారు. ప్రస్తుతం ఈ సంఘాలనే సహకార సంఘాలుగా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా మార్పు చేసుకున్నవారికి మాత్రమే కేంద్రం అందించే రాయితీలు వర్తించే అవకాశం ఉంది.

అవగాహన కల్పిస్తున్నాం

ప్రభుత్వం విడుదలచేసిన నూతన మార్గదర్శకాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సంక్షేమ సంఘాలను సహకార సంఘాలుగా మార్పు చేసుకోవాలని సూచనలు చేస్తున్నాం. అలా మార్పు చేసుకోవాలంటే సీఏఏ అనుమతులు తప్పనిసరి చేశారు. ఇది కొంతమంది రైతులకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సిఉంది.

బాలాజీ, ఎంపెడా ప్రతినిధి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని