logo

వంతెన నిర్మాణం.. వేగవంతం

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల పరిధిలోని వశిష్ఠ గోదావరి పాయకు మధ్యలోని ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక, జి.పెదపూడిలంక గతేడాది ఆగస్టు 26న వరదలకు మునిగాయి.

Published : 09 Jun 2023 03:40 IST

అధికారులకు సీఎం ఆదేశం
న్యూస్‌టుడే, పి.గన్నవరం

మలికిపురంలో బుధవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పనుల ప్రగతిని వివరిస్తున్న డీఈఈ రాంబాబు

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల పరిధిలోని వశిష్ఠ గోదావరి పాయకు మధ్యలోని ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక, జి.పెదపూడిలంక గతేడాది ఆగస్టు 26న వరదలకు మునిగాయి. నాడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆయా ప్రాంతాలను సందర్శించారు. ఇక్కడి నదీ పాయపై వంతెన నిర్మాణం చేపడతామని బాధిత ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక్కడ వంతెన నిర్మించేందుకు 2018లోనే రూ.49.50 కోట్లు మంజూరయ్యాయి. వరదల సమయంలో లంక గ్రామాల ప్రజలు పడుతున్న వెతలను ‘ఈనాడు’ కథనాలు వెలుగులోకి తెచ్చాయి. పనులకు సంబంధించి గతంలో రెండుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందన రాలేదు. గతేడాది మూడోసారి పిలిచిన టెండరు ఖరారైంది. ఈ ఏడాది మార్చిలో గుత్తేదారు పనులు మొదలుపెట్టేలా ప్రభుత్వం అనుమతులిచ్చింది. గోదావరి నదీ పాయపై వంతెన నిర్మాణ ఆవశ్యకతను ఎమ్మెల్యే చిట్టిబాబు పలుమార్లు సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు. నదీ పాయపై నిర్మించనున్న ప్రధాన వంతెనకు అనుబంధంగా ముందుగా ప్రధాన పంట కాలువపై చింతావారిపేట-ఉచ్చులవారిపేట మధ్య రూ.2.80 కోట్లతో మే 14న వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. పనులు వేగంగా సాగుతున్నాయి. వంతెన నిర్మాణ పనుల ప్రగతిని ఈ నెల 7న మలికిపురం వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కలెక్టర్‌ హిమాన్షుశుక్లా వివరించారు. దీంతోపాటు ప్రధానంగా వశిష్ఠ గోదావరి పాయపై వంతెన నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రధాన పంట కాలువపై వంతెన నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ఈ పనులు జరుగుతున్న కారణంగా గన్నవరం ప్రధాన పంట కాలువకు సాగునీటిని విడుదల చేయకుండా వాయిదా వేశారు. వంతెన నిర్మాణం సురక్షిత స్థాయికి చేరుకోవడంతో ఈ నెల 10న రాత్రి గన్నవరం ప్రధాన పంట కాలువకు సాగునీరు విడుదల చేయనున్నారు. కాలువలో నీరు పారుదల ఉన్నా.. వంతెన స్లాబు వేసేందుకు ఎలాంటి ఇబ్బందిలేకుండా క్రిబ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.

9 ఎకరాలు సేకరించాలి..

గోదావరి నదీ పాయపై ప్రధాన వంతెన నిర్మాణానికి సుమారు తొమ్మిది ఎకరాల భూమి సేకరించాల్సిఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కొత్తపేట ఆర్డీవో ద్వారా కలెక్టర్‌కు పంపామని తహసీల్దార్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తెలిపారు. జులైనుంచి సెప్టెంబరు చివరి వరకు వరదల సీజన్‌ ఉంటుంది. ఈలోగా భూసేకరణ ప్రక్రియతోపాటు ఇతర శాఖాపరమైన చర్యలు పూర్తిచేసి పంచాయతీరాజ్‌శాఖకు అప్పగిస్తే అక్టోబరు మొదటి వారం నుంచి గోదావరి నదీ పాయపై ప్రధాన వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు వీలుంటుంది.

ప్రధాన పంట కాలువపై నిర్మాణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు