logo

ఆ రహదారిపై ప్రయాణమంటే హడల్‌

ఆ జాతీయ రహదారి పేరు చెబితే వాహనదారులు హడలిపోతుంటారు. తరచూ ఆ మార్గంలో రక్తపు మరకలు, నుజ్జవుతున్న వాహనాలు చూసి ప్రయాణికులు జడుసుకుంటున్నారు.

Updated : 09 Jun 2023 05:39 IST

బందపురం సమీపంలో పోలవరం కుడి కాలువ వంతెనపై ప్రమాదకరంగా మలుపు

దేవరపల్లి, నల్లజర్ల, న్యూస్‌టుడే: ఆ జాతీయ రహదారి పేరు చెబితే వాహనదారులు హడలిపోతుంటారు. తరచూ ఆ మార్గంలో రక్తపు మరకలు, నుజ్జవుతున్న వాహనాలు చూసి ప్రయాణికులు జడుసుకుంటున్నారు. వాహనదారుల అతివేగం...అధికారుల నిర్లక్ష్యం..వెరసి ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. ఏలూరు జిల్లా గుండుగొలను నుంచి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వరకు రూ.1,800 కోట్లతో 69.8 కిలోమీటర్ల పొడవున నిర్మించిన 16వ నంబరు జాతీయ రహదారిపై ఐదు నెలలుగా రోడ్డు ప్రమాదాలు జోరందుకున్నాయి. ద్విచక్రవాహనం మొదలుకుని భారీ వాహనాల వరకు ప్రమాదాల్లో నుజ్జవుతున్నాయి. సమీపంలో సరైన ప్రభుత్వ ఆసుపత్రి లేక, క్షతగాత్రులకు సరైన వైద్యం అందక దూరప్రాంతాలకు తరలించేలోపే మార్గంమధ్యలోనే కొందరు మృతి చెందుతున్నారు. నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు మండలాల పరిధిలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారికంగా నమోదవుతున్న కేసులకుతోడు, రాజీ పడుతున్నవీ చాలా ఉన్నాయని వాహనదారులు చెబుతున్నారు.

కారణాలివీ...

రాత్రిళ్లు నిద్రపోతూ వాహనాలు నడపడం, అతివేగంగా వెళ్తూ, ముందు వెళ్తున్న వాహనాలను అధిగమించే ప్రయత్నంలో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించారు. రహదారిపై వాహనాలు మరమ్మతుకు గురై అర్ధంతరంగా ఆగినప్పుడు వాటిని గుర్తించేలా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయకపోవడమూ ఓ లోపమే. హెచ్చరిక బోర్డులు ఉన్నచోట వాటిని గమనించకుండా దూసుకుపోవడం కూడా ప్రమాదాలకు కారణం. చరవాణిలో మాట్లాడటం, మద్యం తాగి నడపడం వల్ల కొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. నాలుగు రోడ్ల కూడళ్లలో రహదారులు, ప్రాంతాల పేర్లు, దూరం గుర్తించేలా సూచికలు శూన్యం.

తస్మాత్‌ జాగ్రత్త

దేవరపల్లి మండల పరిధిలోని యర్నగూడెం నుంచి పొంగుటూరు వెళ్లే మార్గంలో, సర్వీస్‌ రహదారి నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే ప్రాంతం, కృష్ణంపాలెం నుంచి యర్నగూడెం జాతీయ రహదారిపైకి వెళ్లే సర్వీస్‌ రోడ్డు, యాదవోలు, దుద్దుకూరు, గౌరీపట్నం గ్రామాల్లోకి దిగేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. బందపురం సమీపంలో సర్వీస్‌ రహదారిలో వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడమూ ఓ సమస్యగా ఉంటోంది. నల్లజర్ల-పుల్లలపాడు మార్గంలో అండర్‌పాస్‌ లేక రైతులు పంట పొలాలకు వెళుతుండగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్చన్నపాలెం నుంచి నల్లజర్ల వచ్చే మార్గంలోనూ ఇదే ఇబ్బంది. కొవ్వూరు మండలంలోని పంగిడి, దొమ్మేరు గ్రామాల్లో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దుకాణాల వద్ద లారీలు నిలపడం ప్రమాదాలకు తావిస్తోంది.

యర్నగూడెంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలు

అవగాహన కల్పిస్తాం..

అతివేగం, మద్యం మత్తుతో వాహనాలు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిలోనే పెద్ద వాహనాలు వెళ్లాలి. సర్వీస్‌ రహదారిలో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అండర్‌ పాస్‌ల వద్ద వాహనాలు మలుపు తిరగడం మానేసి, ఎదురుగా అతివేగంగా వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. సర్వీస్‌ రహదారిలో వేగ నిరోధకాలు ఏర్పాటు చేశాం. రహదారిని పూర్తిగా పరిశీలించి హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం.

సురేంద్రనాథ్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌, రాజమహేంద్రవరం

ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తాం..

రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రదేశాలు, కారణాలు గుర్తించాం. రహదారిపై అతివేగం, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయకపోవడం, సర్వీస్‌ రోడ్లు పూర్తి చేయకపోవడం కారణాలుగా గుర్తించాం. ప్రమాదాల నివారణకు డీఐజీ, ఎస్పీ సూచనలిచ్చారు. వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తాం.

వీఎస్‌ఎన్‌ వర్మ, కొవ్వూరు డీఎస్పీ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని