logo

ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు వేగవంతం

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె వైద్యాధికారులతో సమీక్షించారు.

Published : 10 Jun 2023 04:14 IST

సమీక్షిస్తున్న కలెక్టర్‌ కృతికాశుక్లా

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె వైద్యాధికారులతో సమీక్షించారు. వివిధ ఆసుపత్రుల్లో ప్రతిపాదించిన పనులను త్వరితగతిన రోగులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, ఏపీవీవీపీ, వైద్య విద్య, కాకినాడ జీజీహెచ్‌ పరిధిలోని ఖాళీ పోస్టుల భర్తీకి తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. వైద్యులతో పాటు పారామెడికల్‌, టెక్నికల్‌ సిబ్బంది కొరత లేకుండా రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. వైద్యాధికారులు, నర్సులు, క్లినికల్‌ సైకాలజిస్టు, స్పీచ్‌ థెరపిస్టు పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో రమేశ్‌, జీజీహెచ్‌ పర్యవేక్షకులు హేమలతాదేవి, ఉమ్మడి జిల్లా డీసీహెచ్‌ఎస్‌ సనత్‌కుమారి, డీఐవో ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐఐఎఫ్‌టీకి శాశ్వత క్యాంపస్‌..

యు.కొత్తపల్లి మండలం పొన్నాడలో కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన భారతీయ విదేశీ వాణిజ్య సంస్థ (ఐఐఎఫ్‌టీ)కి శాశ్వత క్యాంపస్‌ త్వరగా ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లో రెవెన్యూ, కుడా, పంచాయతీ, విద్యుత్తు, అగ్నిమాపక, భూగర్భ జలాలు, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి, కేఎస్‌ఈజడ్‌ అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ఐఐఎఫ్‌టీకి కాకినాడ జేఎన్‌టీయూలో తాత్కాలికంగా క్యాంపస్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. శాశ్వత భవన నిర్మాణాలను అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్నామని, దీనికి అవసరమైన అనుమతులు త్వరగా జారీచేయాలన్నారు. ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఓఎస్డీ డాక్టర్‌ బాబూరావునాయుడు, కాకినాడ ఐఐఎఫ్‌టీ సెంటర్‌ హెడ్‌ వి.రవీంద్రసారథి, కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ పర్యావరణ ఇంజినీరు ఆర్‌.లావణ్య, డీపీవో విక్టర్‌, ఏపీఈపీడీసీఎల్‌ ఈఈ జి.ప్రసాద్‌, తహసీల్దారు జీవీఎస్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు