logo

కన్నేశారు.. కొట్టేశారు

దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మహోన్నత లక్ష్యంతో ఏర్పాటైన సంఘమది. రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు దాని సొంతం. లీజుల పేరిట కొందరు పాగా వేస్తే ఏకంగా స్థలాలు ఆక్రమించేసినవారు మరికొందరు.. రాజమహేంద్రవరంలోని జీవకారుణ్య సంఘం ప్రస్తుత దుస్థితి ఇది.

Updated : 10 Jun 2023 05:17 IST

అక్రమార్కుల చెరలో జీవ కారుణ్య సంఘ భూములు
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, టి.నగర్‌

రాజమహేంద్రవరంలో అద్దె చెల్లించకుండా నిర్వహిస్తున్న దుకాణాలు

దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మహోన్నత లక్ష్యంతో ఏర్పాటైన సంఘమది. రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు దాని సొంతం. లీజుల పేరిట కొందరు పాగా వేస్తే ఏకంగా స్థలాలు ఆక్రమించేసినవారు మరికొందరు.. రాజమహేంద్రవరంలోని జీవకారుణ్య సంఘం ప్రస్తుత దుస్థితి ఇది. ఆక్రమణదారుల నుంచి తమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, పరిరక్షణలో ఆ శాఖ విఫలమవుతోంది.

రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు సమీపంలో ఉన్న జీవకారుణ్య సంఘానికి ఇక్కడే గాక గోకవరం, ఆత్రేయపురం తదితర ప్రాంతాల్లో 81.97 ఎకరాల మేర స్థిరాస్తులున్నాయి. వీటి విలువ దాదాపు రూ.300 కోట్లు. 68.60 ఎకరాల వ్యవసాయ భూముల నుంచి ఏడాదికి లీజు రూపంలో రూ.10.72 లక్షలు... దుకాణాలు, భవనాలు, ఇతర వాణిజ్య ఆస్తుల నుంచి రూ.29.59 లక్షల మేర ఆదాయం రావాలి. ఇవి సక్రమంగా వసూలు కావడంలేదు. గతంలో ఈ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరించి ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఓ నాయకుడి ప్రోద్బలంతో కొన్ని ఆస్తులను లీజు పేరిట ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారు. వాటిని కొందరు సొంత ఆస్తిగా భావిస్తూ అనుభవిస్తున్నారు. ఇంకొందరు నామమాత్రంగా అద్దె చెల్లిస్తుండగా.. పలువురు అదీ కట్టడంలేదు. జిల్లా కేంద్రంలో సంస్థకు ఆనుకుని ఉన్న రెండు దుకాణాలు సైతం ఇతరుల చేతుల్లో ఉన్నా స్వాధీనానికి అధికారులు సాహసించడం లేదు.

ఎక్కడెక్కడ ఎలా అంటే..

* రాజమహేంద్రవరం గోరక్షణపేటలో జీవకారుణ్య సంఘానికి సంబంధించిన 250 చదరపు గజాల స్థలం మూడు దశాబ్దాలుగా ఆక్రమణల్లో ఉంది.  

* జీవకారుణ్య సంఘం ప్రధాన గేటుకు ఆనుకుని రెండు వాణిజ్య దుకాణాలున్నాయి. ఆక్రమణదారులు ఇందులో వ్యాపారాలు నిర్వహిస్తూ ఏళ్లతరబడి అద్దె చెల్లించడంలేదు. వీటిని స్వాధీనం చేసుకోవాలని జనవరిలో న్యాయస్థానం ఆదేశాలిచ్చినట్లు అధికారులు చెబుతున్నా ఆ దిశగా చర్యలు లేవు. ఎనిమిదేళ్లుగా అద్దె బకాయి నెలకు రూ.5,400 చొప్పున వడ్డీతో కలిపి రావాల్సి ఉంది.

* లాలాచెరువు సమీపంలోని ఎకరా స్థలంలో ఓ వ్యక్తి టేకు, చందనం మొక్కలు పెంచి నర్సరీ వ్యాపారం చేస్తున్నారు. లీజు ఒప్పందం 2019లోనే పూర్తయిందని, ఆ భూమిని దేవాదాయ శాఖకు అప్పగించాలని నోటీసులిచ్చినా స్పందన లేదు. నెలకు కేవలం రూ.3,750 మాత్రం అద్దె కడుతున్నారు. ఈ వివాదాన్ని ట్రైబ్యునల్‌ ముందుంచారు.

* జీవకారణ్య సంఘానికి తూర్పు వైపు సుమారు 3.5 ఎకరాల స్థలం దాదాపు 15 ఏళ్లుగా ఆక్రమణల్లో ఉంది. న్యాయస్థానం ఆదేశించడంతో ఈ నెల మొదటి వారంలో స్వాధీనం చేసుకున్నారు.

* రాజమహేంద్రవరంలోని వంకాయలవారి వీధి, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలను కొందరు లీజుకు తీసుకుని సొమ్ము కట్టడమే మానేశారు. క్రమంగా వాటిలో తిష్ఠ వేసేశారు.

లీజు పూర్తయినా కొనసాగుతున్న నర్సరీ

సేవల తీరుపై ఆవేదన

పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జీవకారుణ్య సంఘంలో వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. వారిలో మహిళలు 44 మంది, పురుషులు 22 మంది. వీరిలో నలుగురు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుండగా, మరో 15 మంది మంచం పట్టారు. వీరికి సేవలతోపాటు, దుస్తులు ఉతకడం తదితర పనులు చేసే బాధ్యత ఈ సంస్థదే. ఆ సేవలు సక్రమంగా జరగడం లేదన్న ఆవేదన ఉంది.. గతంలో దాతలు వచ్చి ఆహార పదార్థాలతోపాటు, సబ్బులు, పేస్టులు ఇచ్చేవారు. ఇప్పుడు వారి సంఖ్య తగ్గింది.

గోరక్షణపేటలో ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలిస్తున్న దేవాదాయశాఖ అధికారులు

స్థలాలు స్వాధీనం చేసుకుంటాం

జీవకారుణ్య సంఘ ఆస్తుల్లో కొన్ని ఆక్రమణలో ఉన్నమాట వాస్తవమే. వీటిలో నారాయణపురంలోని 3.5 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ, పోలీసు అధికారుల సాయంతో ఇటీవల స్వాధీనం చేసుకున్నాం. నర్సరీ ఉన్న ఎకరా స్థలానికి సంబంధించిన అంశం ట్రైబ్యునల్‌లో ఉంది. రెండు దుకాణాలతో పాటు ..ఇతర ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన స్థలాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటాం. సంఘంలో మంచానికే పరిమితమైన వారి సేవలకు సంబంధించి సమస్య పరిష్కరిస్తాం. దాతలు వస్తే అనుమతించడంలేదని, వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. వృద్ధులకు సహాయం చేసేందుకు వచ్చినవారిని ఆహ్వానిస్తున్నాం.

విజయలక్ష్మి, సహాయ కమిషనర్‌, దేవాదాయ శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని