logo

పారిశ్రామిక క్లస్టర్లకు ప్రాధాన్యం

పారిశ్రామిక వాడల అభివృద్ధితోపాటు.. క్లస్టర్ల వారీగా సూక్ష్మ- చిన్న- మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.

Published : 10 Jun 2023 04:14 IST

ప్లాస్టిక్‌, ఇంజినీరింగ్‌, టెక్స్‌టైల్‌ సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు
‘ఈనాడు’తో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ హరిధరరావు
కాకినాడ, ఈనాడు

పారిశ్రామిక వాడల అభివృద్ధితోపాటు.. క్లస్టర్ల వారీగా సూక్ష్మ- చిన్న- మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకువచ్చి అనుమతుల విషయంలోనూ శాఖాపరమైన ప్రోత్సాహం అందిస్తా’మని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) జోనల్‌మేనేజర్‌ బి.హరిధరరావు తెలిపారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల పరిధిలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ప్రణాళిక.. భూ నిధి తదితర అంశాలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు.

ఫుడ్‌పార్కు ఏర్పాటుచేసి ఏడాది దాటినా పరిశ్రమలు లేవు..

పెద్దాపురం ఫుడ్‌ పార్కును  23.45 ఎకరాల్లో ఏర్పాటుచేసి 111 ప్లాట్లు సిద్ధంచేశాం. ఇప్పటివరకు 25 కేటాయించాం. పచ్చళ్లు, నీటి ప్లాంట్లు, మ్యాంగో పల్ప్‌, ఇతర ఫుడ్‌ ప్రాసెస్‌ యూనిట్లకు స్థలాలు కేటాయిస్తాం. 300 చ.మీ. చొప్పున బిట్లు కేటాయించాం. చదరపు మీటరు రూ.3 వేల చొప్పన అందిస్తున్నాం. వివిధ రకాల ఆహార ఉత్పత్తులు- అనుబంధ పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రోత్సహిస్తున్నాం.

కాకినాడ తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న ఊతం..?

కేజీపీఎల్‌ పోర్టు ఏర్పాటుకు 1,580 ఎకరాల అభివృద్ధి చేయని భూమి ఏపీఐఐసీ ద్వారా కేటాయించాం. సమీకృత బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు దివిస్‌ సంస్థకు 505 ఎకరాలు ఇచ్చాం. ఏపీఐఐసీ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది.

జిల్లాల విభజన జరిగి ఏడాదైనా.. ఏపీఐఐసీ కాకినాడ జోన్‌ విభజన కొలిక్కిరాలేదు.. సమర్థ సేవలందేదెలా?

కాకినాడ జోన్‌ కేంద్రంగానే మూడు జిల్లాల్లో పారిశ్రామిక వాడల అభివృద్ధిపై దృష్టిసారించాం. 2020- 23 నాటి ఇండస్ట్రియల్‌ లీజు పాలసీ 2023-27కి కొనసాగించారు. ఉన్న సిబ్బందితో సమర్థ సేవలు అందిస్తున్నాం.

ఏపీఐఐసీకి గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వెనక్కి తీసుకున్నారు. భూ సేకరణ, సదుపాయాల కల్పనకు మీ చర్యలేమిటి..?

ఏపీఐఐసీ ద్వారా ఉమ్మడి జిల్లాలో 3,130 ఎకరాల్లో 2,076 ప్లాట్లు కేటాయిస్తే.. అందులో 126 ఖాళీగా ఉన్నాయి. భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాలకు ఏపీఐఐసీకి భూములు కేటాయించాలని కోరుతూ మూడు జిల్లాల కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపాం. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి సమీపంలో జాతీయ రహదారి పక్కన 325 ఎకరాలు, తుని మండలం ఎల్‌.కొత్తూరు వద్ద 250 ఎకరాలు అడిగాం. అమలాపురంలో ఆటోనగర్‌ ఏర్పాటుకు భూమి కోరాం. గతంలో ఏడీబీ రోడ్డు విస్తరణలో వాకలపూడి ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని కొంత భూమి పోయింది. జేగురుపాడులో 38.64 ఎకరాలు, వేములపల్లిలో 30.45 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు గతంలో 250 మందికి కేటాయించాం. పేదలకు ఇంటి స్థలాలను కేటాయించడానికి వాటిని ప్రభుత్వం తీసుకుంది. స్థలాలు కోల్పోయిన పారిశ్రామికవేత్తలకు రాజానగరం మండలం కల్వచర్లలోని 104.23 ఎకరాల్లో పారిశ్రామిక వాడ అభివృద్ధి చేసి కేటాయించాలని నిర్ణయించాం.

కల్వచర్లలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు 2020లో భూమి కేటాయించినా నేటికీ అభివృద్ధి చేయలేదు..

రాజానగరం మండలం కల్వచర్ల పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి రూ.20 కోట్లతో ప్రణాళిక ఉంది. 70 శాతం కేంద్రం.. 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సదుపాయాలు కల్పించాలి. మైక్రో- స్మాల్‌ ఎంటర్‌ప్రైజస్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎంఎస్‌ఈసీపీ) కింద ఈ పనులకు రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీ ప్రాథమిక అనుమతి దక్కింది. కేంద్రం అనుమతి రావాల్సిఉంది. డిలైట్‌ కన్సల్టెన్సీ పర్యవేక్షిస్తుంది. వేములపల్లి, జేగురుడుపాడులో స్థలాలు కోల్పోయిన 250 మంది పారిశ్రామికవేత్తలకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ 280 స్థలాలు చూపించాల్సి ఉంది. వీరికి ఒక్కొక్కరికి 300 చ.మీ. చొప్పున ఇస్తాం. ఇవి కాకుండా ఎకరం చొప్పున విస్తీర్ణంతో 25 బిట్లు.. మరో 70 వరకు చిన్న బిట్లు సిద్ధంచేస్తాం. ఇక్కడ ప్లాస్టిక్‌, ఇంజినీరింగ్‌, సిరామిక్‌, టెక్స్‌టైల్‌, జనరల్‌ క్లస్టర్లు ఏర్పాటుచేయాలన్నది ప్రతిపాదన. అన్ని హంగులతో అభివృద్ధి  చేసిన భూమి చ.మీ. రూ.2,100కే ఇస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని