logo

ఒకే చోట ఆటలు.. పాఠాలు

క్రీడల్లో తర్ఫీదు పొందేందుకూ ఓ పాఠశాల ఉందని మీకు తెలుసా.. నచ్చిన క్రీడాంశంలో తర్ఫీదు పొందుతూనే చదువుకోవాలనుకునేవారికి శాయ్‌, శాప్‌ ఆధ్వర్యంలో ఏటా ఎంపికలు నిర్వహిస్తారు.

Published : 10 Jun 2023 04:14 IST

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపికలు
న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్‌

వివిధ క్రీడాంశాల్లో సాధన

క్రీడల్లో తర్ఫీదు పొందేందుకూ ఓ పాఠశాల ఉందని మీకు తెలుసా.. నచ్చిన క్రీడాంశంలో తర్ఫీదు పొందుతూనే చదువుకోవాలనుకునేవారికి శాయ్‌, శాప్‌ ఆధ్వర్యంలో ఏటా ఎంపికలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 66 చోట్ల పలు క్రీడాంశాల్లో తర్ఫీదు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ఎస్‌టీసీలో వాలీబాల్‌, బాక్సింగ్‌లో శిక్షణ కోసం ఈ నెల 11 నుంచి 13 వరకు ఎంపికలు నిర్వహిస్తారు. ఇక్కడ బాలబాలికలకు 40 సీట్ల చొప్పున కేటాయించారు. ఎంపికైనవారికి ఉచిత భోజన, వసతి, చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారు. దేశ, ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన అత్యుత్తమ శిక్షణ ఇక్కడ లభిస్తుంది. బాక్సింగ్‌ (బాలబాలికలు)కు 12 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. వాలీబాల్‌కు 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. బాలికలకు 170 సెం.మీ., బాలురకు 185 సెం.మీ. ఎత్తు ఉండాలి.

ఎంపికలకు వెళ్లేటప్పుడు..

శాయ్‌ స్పోర్ట్సు ట్రైనింగ్‌ సెంటర్‌, విశాఖపట్నం పోర్టు స్టేడియం, అక్కయ్యపాలెంలో హాజరయ్యే అభ్యర్థులు తమ పేర్లను ఈ నెల 11న ఉదయం 6.30 నుంచి నమోదు చేసుకోవాలి. 11 నుంచి 13 వరకు బ్యాటరీ మోటారు టెస్ట్‌లు నిర్వహిస్తారు. జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ప్రాధాన్యం ఉంటుంది. ఆధార్‌, జనన తేదీ ధ్రువపత్రం, 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, చదువుతున్న పాఠశాల స్టడీ సర్టిఫికెట్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకెళ్లాలి.

వైఎస్సార్‌ కడప స్పోర్ట్సు స్కూలు

వైఎస్సార్‌ కడపలోని స్పోర్ట్సు పాఠశాలలో ప్రవేశాలకు స్పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఏటా మే, జూన్‌ నెలల్లో ఎంపికలు నిర్వహిస్తుంది. ఇక్కడ పది క్రీడాంశాల్లో 20 మంది బాలికలు, 20 మంది బాలురను ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి ఉచిత భోజన, వసతి, చదువు, క్రీడాంశంలో తర్ఫీదు ఇస్తారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి శిక్షణ ఉంటుంది.  

క్రీడాంశాలు, అర్హతలు

విలువిద్య, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, హాకీ, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌, తైక్వాండో, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌. మూడోతరగతి చదివి ఉండాలి. 8 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసువారై ఉండాలి. మూడంచెల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 30 మీటర్ల ఫ్లైయింగ్‌స్టార్ట్‌, స్టాండింగ్‌బ్రాడ్‌ జంప్‌, 6్ల10 షటిల్‌ రన్‌, స్టాండింగ్‌ వెర్టికల్‌ జంప్‌, ఫ్లెక్సిబిలిటీ, కేజీ మెడిసిన్‌బాల్‌ విసరటం, 800 మీటర్ల పరుగు

వైద్యపరీక్షలు

వయసు నిర్ధరణకు ఎముకల స్థితి, ఫ్లాట్‌ఫీట్‌, గుండె పనితీరు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు.

ఎంపికలు ఎప్పుడంటే..?

మండలస్థాయిలో ఈ నెల 10 నుంచి, జిల్లాస్థాయి 20 నుంచి, రాష్ట్రస్థాయి ఎంపికలు 29, 30 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులను కడపలోని స్పోర్ట్సు స్కూలుకు పంపిస్తారు.

సద్వినియోగం చేసుకోండి

శాయ్‌ లేదా శాప్‌ నిర్వహించే శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ ప్రవేశానికి ఎంపిక కావాలంటే దేశానికి పతకం సాధించాలనే తపన ఉన్నవారికి మంచి అవకాశం. అత్యున్నత క్రీడా శిక్షకులతో తర్ఫీదు ఇస్తారు.

డి.శేషగిరి, జిల్లా ముఖ్య క్రీడా శిక్షకుడు, తూర్పుగోదావరి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని