logo

అంతర్‌ జిల్లాల దొంగల ముఠా అరెస్టు

చెడు వ్యసనాలకు అలవాటుపడిన యువకులు, జల్సా జీవితం గడుపుదామనే అత్యాశతో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడి తిరిగి కటకటాల పాలయ్యారు.

Updated : 18 Sep 2023 06:05 IST

586 గ్రాముల బంగారం, రూ.4.30 లక్షల వస్తువుల రికవరీ

చోరీల వివరాలు తెలుపుతున్న ఎస్పీ శ్రీధర్‌

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: చెడు వ్యసనాలకు అలవాటుపడిన యువకులు, జల్సా జీవితం గడుపుదామనే అత్యాశతో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడి తిరిగి కటకటాల పాలయ్యారు. చేసిన నేరాలు మళ్లీ చేయకుండా వీరిని శిక్షించేలా సెక్షన్‌-75 ఉపయోగించి తీవ్ర శిక్ష కేసు నమోదు చేసినట్లు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ సుసారపు శ్రీధర్‌ తెలిపారు. రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడే అంతర్‌ జిల్లాల చోరీల ముఠాకు చెందిన ముగ్గురు పి.గన్నవరం పోలీసులకు చిక్కారు. అమలాపురంలోని కార్యాలయంలో ఎస్పీ సుసారపు శ్రీధర్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాకినాడ కొత్త గైగోలుపాడు అంబేడ్కర్‌కాలనీకి చెందిన పిల్లి సింహాచలం అలియాస్‌ నాని(25), కాకినాడ రూరల్‌ మండలం గొడారిగుంట వాసి ముల్కీ మారుతిశ్రీసాయిరామ్‌(19), కిర్లంపూడి ఓసీకాలనీ వాసి వలపుశెట్టి వీరబాబు(25)లను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి సుమారు రూ.33 లక్షల విలువైన 586.70 గ్రాముల బంగారం, రూ.4.30 లక్షల విలువైన నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక హోం థియేటర్‌, వీడియో కెమెరా, ఫ్లాష్‌లైట్‌, సౌండ్‌ సిస్టం, మ్యూజికల్‌ గిటార్‌, మూడు టీవీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో పిల్లి సింహాచలం పలు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఆరు చోరీల కేసుల్లో పట్టుబడి రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో రెండేళ్లకుపైగా జైలు జీవితం గడిపివచ్చాడన్నారు. అతనికి బైక్‌ల చోరీ కేసులో జైలుపాలైన మారుతిశ్రీసాయిరామ్‌ తోడయ్యాడన్నారు. వీరు చోరీ చేసిన వస్తువులను వలపుశెట్టి వీరబాబు కొనుగోలు చేస్తాడని ఎస్పీ వివరించారు. కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మొత్తం 32 నేరాలు చేశారన్నారు. వీరిని పలివెల వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు.

పలు స్టేషన్ల పరిధిలో కేసులు..: వీరిపై అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం టౌన్‌-3, రూరల్‌-2, పి.గన్నవరం-2, రామచంద్రపురం-3, రావులపాలెం-1, ఉప్పలగుప్తం-1, కాకినాడ జిల్లాలో సర్పవరం-2, ఇంద్రపాలెం-1, తిమ్మాపురం-3, ఏలేశ్వరం-1, తూర్పుగోదావరి జిల్లాలో ధవళేశ్వరం-3, కడియం-2, బికక్కవోలు-1, రంగంపేట-1, పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు-1, ఏలూరు జిల్లాలో ఏలూరు టౌన్‌1-1, ఏలూరు టౌన్‌ 2- 1, అనకాపల్లి జిల్లాలో ఎస్‌.రాయవరం-1, నక్కపల్లి-1, పాయకరావుపేట-1 స్టేషన్‌లలో కేసులున్నాయి. డీఎస్పీ రమణ, సీఐ ప్రశాంత్‌, ఎస్‌ఐ హరికోటిశాస్త్రి క్రైం సీఐ డి.గోవిందరావు, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌, ఏఎస్‌ఐ బాలకృష్ణ, సీహెచ్‌.శేఖర్‌రాజు, కె.నాగేశ్వరరావు, బి.శ్రీను, కేవీ రమణ, బీడీవీ ప్రసాద్‌, జి.కృష్ణసాయి, ఎ.సుధాకర్‌, డి.అర్జునరావు, ఆర్‌ఎస్‌ ప్రసాద్‌, ఎం.హరిబాబు, ఎల్‌.శ్రీను, కె.సతీష్‌, డి.చిరంజీవులను ఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని