logo

విషజ్వరాల విజృంభణ

జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్‌, మలేరియాతోపాటు స్క్రబ్‌ టైఫస్‌, లెప్టోస్పైరా పంజా విసురుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి.

Updated : 18 Sep 2023 06:05 IST

జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న పీడితులు
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని జ్వరాల వార్డులో చికిత్స పొందుతున్న రోగులు

జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్‌, మలేరియాతోపాటు స్క్రబ్‌ టైఫస్‌, లెప్టోస్పైరా పంజా విసురుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. గతేడాది కంటే ఈసారి తీవ్రత ఎక్కువగా ఉండడంతోపాటు కొత్తరకాల జ్వరాలు కలవరం రేపుతున్నాయి. డెంగీ లేకపోయినా రెండు రోజుల జ్వరానికే ప్లేట్‌లెట్లు పడిపోవడం, పచ్చకామెర్లు తోడవడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మలేరియా కేసులు తగ్గినా డెంగీ బెంగ తప్పడం లేదు. ఎర్ర రక్తకణాలు (ప్లేట్‌లెట్లు) పడిపోవడం, జ్వరం, పొడి దగ్గు, జలుబు, విపరీతమైన ఒళ్లు నొప్పులు, తీవ్ర తలపోటు లక్షణాలతో రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో రోజూ అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. జీజీహెచ్‌లో రోజుకు సుమారు 100 వరకు మలేరియా, వంద టైఫాయిడ్‌తోపాటు రెండు రోజులకు 50 డెంగీ నమూనాలను పరీక్షిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 57 డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న 48 గ్రామాల్లో డెంగీ కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైనవి మాత్రమే. జిల్లాలోని ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకున్నవారు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారు దీనికి రెండింతల మంది ఉంటారని అంచనా.

కొత్త జ్వరాల కలకలం

ఈ ఏడాది జ్వరాల తీరు భిన్నంగా ఉంది. డెంగీ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినా ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గిపోతోంది. దాంతోపాటు స్క్రబ్‌ టైఫస్‌, లెప్టోస్పైరా అనే వైరస్‌లు విజృంభిస్తున్నాయి. స్రబ్‌టైఫస్‌ జ్వరాలు వచ్చిన వారికి శరీరంపై నల్లని కాలిన మచ్చలు మాదిరి వస్తాయని, లెఫ్టోస్పైరా జ్వరాల్లో పచ్చకామెర్లతోపాటు కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు రెండు రోజులకు మించి ఉంటే వైద్యుడిని సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. వీటికి సంబంధించి వంద కిట్లు మైక్రోబయాలజీ ల్యాబ్‌కు వచ్చాయి. బయట ప్రైవేటు ల్యాబుల్లో ఒక్కొక్క పరీక్ష సుమారు రూ.1,000-1,500 వరకు ఉంటుందని, జీజీహెచ్‌లో ఉచితంగా చేస్తున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.

కొవ్వూరు పట్టణం, గోపాలపురం: జిల్లా వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలో అనపర్తి ఏరియా ఆసుపత్రితో పాటు కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, కోరుకొండ, గోకవరాల్లో సీహెచ్‌సీలు ఉన్నాయి. జూన్‌ నుంచి ఈనెల 13 వరకు పైఆసుపత్రులకు వివిధ పరీక్షల నిమిత్తం 1,04,028 మంది వెళ్లారు. అందులో 6720 మంది ఇన్‌పేషెంట్లుగా చేరారు. 3,242 మందికి సాధారణ జ్వరాలు, 1,261 మందికి టైఫాయిడ్‌, నలుగురికి మలేరియా సోకాయి.


జీజీహెచ్‌లో ఇదీ పరిస్థితి..

రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో 20 పడకలు, 10 పడకల జ్వరాల వార్డులను ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా జ్వరాల రోగులతో నిండిపోయాయి. జీజీహెచ్‌లోని జనరల్‌ మెడిసిన్‌ ఓపీకి రోజుకు 200 నుంచి 250 మంది వరకు వస్తుంటే ఇందులో వంద వరకు విషజ్వరాల బారిన పడిన పీడితులే ఉంటున్నారు. ఇందులో రోజుకు 10-12 మంది ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. వాతావరణ మార్పులు, వర్షాలు, కలుషిత నీరు, జాగ్రత్తలు చేపట్టకపోవడం వంటి అంశాలు జ్వరాలకు కారణంగా వెల్లడిస్తున్నారు. మలేరియాకు సంబంధించి పాజిటివ్‌లు రాకపోయినా ఆయా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారు పదుల సంఖ్యలో ఉంటున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు లక్షకు పైగా మలేరియా నమూనాలు పరీక్షించినా ఆరు పాజిటివ్‌ కేసులే నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. మలేరియా లక్షణాలతో చికిత్స తీసుకునేవారు జిల్లావ్యాప్తంగా వందల్లో ఉంటున్నారు.


నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం
- డాక్టర్‌ శక్తి నరసింహ, ఎండీ(జనరల్‌ మెడిసిన్‌), రాజమహేంద్రవరం

ప్రస్తుతం టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి. ఈ రెండు విషజ్వరాల్లో అధిక ఉష్ణోగ్రతతో జ్వరం వస్తుంది. వెంటనే శరీరాన్ని హైడ్రేట్‌ చేయాలి. తగిన మోతాదులో నీరు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం, కొబ్బరి నీరు, పల్చటి మజ్జిగ, రాగి జావ వంటివి తాగాలి. డెంగీలో ప్లేట్‌లెట్లు పడిపోయి ఇబ్బంది ఏర్పడుతుంది. నిర్లక్ష్యం చేస్తే డెంగీ షాక్‌ సిండ్రోమ్‌(డీఎస్‌ఎస్‌) గురై ప్రాణాపాయం ఏర్పడుతుంది. డెంగీ జ్వరం ప్రబలిన వ్యక్తులు మలం, మూత్రం రంగును గమనించుకోవాలి. రెడ్‌ స్పాట్ల మాదిరి, నలుపు రంగులో అయితే ప్రమాదమని గుర్తించాలి. జ్వరం తగ్గిపోయినా నెల రోజుల వరకు రోగి పౌష్టికాహారం తీసుకుని హైడ్రేట్‌ అవుతూనే ఉండాలి. వ్యక్తిగత శుభ్రత, మాస్కు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కాచిచల్లార్చిన నీటిని తాగడం వంటివి చేయాలి.


అశ్రద్ధ చేయొద్దు..
- డాక్టర్‌ విజయబాబు, అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌, రాజమహేంద్రవరం జీజీహెచ్‌

రెండు రోజులకు మించి జ్వరం, జలుబు, పొడి దగ్గు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొందరిలో ఆయాసం కూడా వస్తుంది. కొందరిలో డెంగీ నెగిటివ్‌ వచ్చినా ప్లేట్‌లెట్లు తగ్గిపోయి ప్రాణాంతకమవుతుంది. జీజీహెచ్‌లో టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ, ప్లేట్‌లెట్‌ కౌంట్‌తోపాటు స్క్రబ్‌ టైఫస్‌, లెప్టోస్పైరా జ్వరాలకు సైతం పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని