logo

ఏళ్లు గడుస్తున్నా.. జగనన్న ఇళ్లు లేవు..

జగనన్న కాలనీల్లో ఏళ్లుగా ఇళ్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. గృహప్రవేశాలకు పెడుతున్న ముహూర్తాలు దాటిపోతున్నాయి. వసతుల కల్పన పూర్తిస్థాయిలో జరగడం లేదు.

Published : 22 Sep 2023 04:01 IST

సీతానగరం, న్యూస్‌టుడే

గనన్న కాలనీల్లో ఏళ్లుగా ఇళ్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. గృహప్రవేశాలకు పెడుతున్న ముహూర్తాలు దాటిపోతున్నాయి. వసతుల కల్పన పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో వినాయక చవితికి కొందరు లబ్ధిదారులకు గృహప్రవేశం కల్పిస్తామని లక్ష్యం నిర్దేశించినా అదీ పూర్తికాని పరిస్థితి.

ఎప్పుడో మొదలు..

ఇళ్ల నిర్మాణాలను 2022 మార్చినాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఆశించిన స్థాయిలో నిర్మాణాలు పూర్తికాకపోవడంతో గడువు పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు ఆరుసార్లు గృహప్రవేశాలు వాయిదా పడ్డాయి. ఈ నెలలోనూ గృహప్రవేశాలు లేవని ఇప్పటికే గృహనిర్మాణశాఖ అధికారులు లబ్ధిదారులకు సమాచారమిచ్చారు. వీటిని పూర్తిచేయించేలా ఆయా మండలాల అధికారులకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించి సుమారు ఏడాదిన్నర కాలం అయ్యింది. వీటిలో గ్రామసచివాలయం, మండల పరిషత్‌ కార్యాలయ ఉద్యోగులను భాగస్వామ్యం చేసి వారిపై ఒత్తిడి పెంచారు. నెలవారీ లక్ష్యాలు వెనకబడిన ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ సహాయకులు, గృహనిర్మాణశాఖ సిబ్బందికి మెమోలు ఇచ్చారు. అవగాహన కల్పించడానికి వస్తున్న అధికారులకు లబ్ధిదారులు సమస్యలు ఏకరువు పెట్టడంతో లక్ష్యాలను పూర్తిచేయలేకపోతున్నామని పలువురు అధికారులు ఆవేదన చెందుతున్నారు.

అననుకూలంగా లేఔట్లు..

జిల్లాలో 418 లేఔట్ల వద్ద ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన భూములను కొనుగోలు చేశారు. సీతానగరం మండలం వంగలపూడి లేఔట్‌ గ్రామానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో వ్యవసాయ భూముల్లో ఉంది. అందులో ఇళ్లు నిర్మాణానికి పునాదులు తీస్తుంటే ఊటనీరు చేరుతోందని 150 మంది లబ్ధిదారులు ఆ స్థలాలు మాకొద్దు అంటూ ఇప్పటికే పట్టాలు వెనక్కి ఇచ్చేశారు. రెండేళ్లు క్రితం కూనవరంలో 1400 మందికి పట్టాలిచ్చారే తప్ప ఇప్పటికీ స్థలాలు ఎక్కడున్నాయో చూపలేదు. రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల పరిధిలో 208 తాగునీటి పథకాలు పూర్తిచేయించేలా సుమారుగా రూ.7వేల కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 20 వేల నుంచి 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకులతోపాటు పైపులైన్‌ పనులు పూర్తిచేయాలి. ఇప్పటికి మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రావడం లేదని సమాచారం.

సొంత స్థలాల్లో..

కొందరు లబ్ధిదారులు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మాణం చేసుకుంటామని గత నాలుగేళ్లుగా వినతులు అందిస్తూనే ఉన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు గ్రామాల వారీగా జాబితాలు తీసుకున్నారు. అవసరమైన మంజూరు పత్రాలు ఇస్తామని చెప్తూ వస్తున్నారు. జిల్లాలో సుమారుగా 11,500 ఇళ్లు సొంత స్థలాల్లో ఉన్నవారికి ఇచ్చేలా జాబితాలు సిద్ధం చేశారే తప్ప ఇప్పటివరకు ఒక్క ఇంటిని కూడా కేటాయించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


లక్ష్యాలను పూర్తిచేసేలా..

- పరశురామ్‌, జిల్లా గృహనిర్మాణశాఖ, పథక సంచాలకుడు

ఇంటి నిర్మాణాల్లో ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయించేలా అంతా కలిసి పనిచేస్తున్నాం. నిర్మాణాలకు అవసరమైన సామాగ్రి కూడా అందుబాటులో ఉంచాం. జిల్లాలో ప్రస్తుతం రూప్‌లెవెల్‌లో 1,811 ఉన్నాయి. వీటిని పూర్తిచేసేలా కొన్ని పనులు చేపడితే సరిపోతోంది. ఈ నెలలో గృహప్రవేశాలు వాయిదా పడ్డాయి. సొంత స్థలాలు కలిగిన వారికి ఇళ్లు కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అనుమతి రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని