logo

సత్యవతికి కన్నీటి వీడ్కోలు..!

తెదేపా అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ కాకినాడలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో బుధవారం ఉద్వేగంగా ప్రసంగించి ఆకస్మికంగా మృతిచెందిన కాకినాడ నగర తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి అంత్యక్రియలు గురువారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు.

Updated : 22 Sep 2023 04:21 IST

అంతిమయాత్రలో తెదేపా శ్రేణులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ కాకినాడలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో బుధవారం ఉద్వేగంగా ప్రసంగించి ఆకస్మికంగా మృతిచెందిన కాకినాడ నగర తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి అంత్యక్రియలు గురువారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. తూరంగిలోని కైలాసభూమిలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా జగన్నాథపురం నాగరాజుపేటలోని ఆమె స్వగృహం వద్ద మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగర తెదేపా అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పార్టీ పతాకాన్ని మృతదేహంపై కప్పి నివాళులు అర్పించారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, తెదేపా వైద్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ చప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం ఊరేగింపుగా భౌతికకాయాన్ని తరలించారు. అందరితోనూ సఖ్యంగా మెలిగే సత్యవతిని కడసారి చూసేందుకు బంధువులు, తెదేపా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. తూరంగిలోని కైలాసభూమి వరకు అంతిమయాత్ర సాగింది. మాజీ ఎమ్మెల్యే కొండబాబుతో పాటు నగర తెదేపా అధ్యక్షుడు వీరు కొద్దిసేపు పాడె మోసారు. అదే సమయంలో భారీ వర్షం కురవడంతో తడుస్తూనే అంతిమయాత్రలో పాల్గొన్నారు. మృతురాలి భర్త రామచంద్రరావు, కుమారుడు మనోజ్‌కుమార్‌, కుమార్తె సాయిని ఓదార్చారు. తెదేపా నాయకులు కొల్లాబత్తుల అప్పారావు, సీకోటి అప్పలకొండ, పలివెల రవి, బంగారు సత్యనారాయణ, పసుపులేటి వెంకటేశ్వరరావు, జొన్నాడ వెంకటరమణ, చొక్కా గిరి, కోడూరి పెద్ద, పంతాడి రాజు, గదుల సాయిబాబు, ఎంఏసయ్యద్‌, అన్సర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని