logo

71 వేల ఓట్ల తొలగింపునకు ఆమోదం

కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 71,078 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఆమోద ముద్రపడింది.

Published : 22 Sep 2023 04:01 IST

జాబితాలో కొత్తగా 40,512 మందికి చోటు
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 71,078 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఆమోద ముద్రపడింది. ఈ ఏడాది జనవరి 6 నుంచి ఆగస్టు 19 వరకు కొత్త ఓటు నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, బదిలీకి దాఖలైన ఫారం-6, 7, 8 దరఖాస్తులపై విచారణ పూర్తిచేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో దరఖాస్తులపై బూత్‌స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వీరి నివేదిక ఆధారంగా ఆయా నియోజకవర్గాల ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్వోలు) తుది నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం మరణించిన, నకిలీ, శాశ్వతంగా వలసవెళ్లిన 71,078 మంది పేర్ల తొలగింపునకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించారు. అలాగే కొత్తగా ఓటు హక్కు కల్పించాలని 40,512 మంది సమర్పించిన దరఖాస్తులను ఆమోదించారు. చేర్పులు, మార్పులు, బదిలీలకు దాఖలైన 1,09,749 దరఖాస్తులను పరిష్కరించారు. ఈ ఏడాది జనవరి 5న జిల్లాలో తుది ఓటర్ల జాబితా ప్రచురించారు. అప్పటికి ఏడు నియోజకవర్గాల పరిధిలో 15,98,684 మంది ఓటర్లు ఉన్నారు. జాబితాపై పునర్విచారణ తరువాత జిల్లాలో 15,91,534 మంది ఓటర్లు ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి 7,150 ఓట్లు తగ్గాయి. జిల్లాలో అక్టోబరు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఆ రోజున కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దారు, నగరపాలిక, పురపాలక, నగర పంచాయతీల కార్యాలయాల్లో జాబితాలను ప్రచురిస్తారు. అక్టోబర్‌ 17 నుంచి మరోమారు నెల రోజుల పాటు ఓటు నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, బదిలీలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత ఉండి, ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అలాగే 1 జనవరి 2024 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతీ ఒక్కరూ కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అవకాశం కల్పిసారు.

పోలింగ్‌ కేంద్రాల మార్పునకు ప్రతిపాదనలు..

జిల్లాలో మొత్తం 1,634 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో 115 పోలింగ్‌ కేంద్రాల స్థల మార్పునకు ప్రతిపాదించారు. 320 పోలింగ్‌ కేంద్రాల పేరు మార్పు, ఏడు కొత్త కేంద్రాల ఏర్పాటు, రెండు కేంద్రాల విలీనానికి ప్రతిపాదించారు. 47 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండటంతో మరో పోలింగ్‌ కేంద్రానికి కొంతమంది ఓటర్లు మార్పునకు ప్రతిపాదించారు. మొత్తం మీద 491 పోలింగ్‌ కేంద్రాల్లో మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు.


ఇంటింటా సర్వేలో గుర్తించిన అంశాలు..

జిల్లాలో శాసనసభా నియోజకవర్గాల పరిధిలో జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటా ఓటర్ల జాబితా సర్వే నిర్వహించారు. ఇందులో 21,927 మంది అర్హత ఉన్నా ఓటు నమోదు చేసుకోనట్లు గుర్తించారు. వారి నుంచి ఫారం-6 దరఖాస్తులు స్వీకరించారు. రెండు, మూడు చోట్ల ఓటున్న 9006 మందిని గుర్తించి వారితో ఒక చోటే ఓటు ఉండేలా దరఖాస్తు చేయించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన 14,697 మందిని గుర్తించి వారిలో 9,295 మంది నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని