logo

మందగమనంలో ‘ఈ పంట’...

రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట నమోదు(ఈ-క్రాప్‌) తప్పనిసరి. విపత్తుల సమయంలో పెట్టుబడి రాయితీ నుంచి పంటల బీమా, రైతుభరోసా వరకు, పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఈ-క్రాప్‌ పోర్టల్‌లో నమోదు కావాల్సిందే.

Published : 22 Sep 2023 04:01 IST

న్యూస్‌టుడే, ముమ్మిడివరం

రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట నమోదు(ఈ-క్రాప్‌) తప్పనిసరి. విపత్తుల సమయంలో పెట్టుబడి రాయితీ నుంచి పంటల బీమా, రైతుభరోసా వరకు, పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఈ-క్రాప్‌ పోర్టల్‌లో నమోదు కావాల్సిందే. మూడేళ్లుగా ప్రతి సీజన్‌లోనూ ఈ-క్రాప్‌ నమోదు ప్రక్రియ సాగుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌-2023 సీజన్‌కు సంబంధించి నమోదు నత్తనడకన సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాప్‌లో సాంకేతిక ఇక్కట్లు, ఇతరత్రా కారణాలతో మొదట ఈ నెల 15వరకు గడువు సమయానికి నిర్దేశిత లక్ష్యం  పూర్తికాలేదు. దాంతో గడువు పొడిగించి రైతులకు అవకాశం కల్పించారు. రైతులు తమ పంటలను పోర్టల్‌లో నమోదు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1,74,271 ఎకరాల్లో ఖరీఫ్‌ సాగవుతోంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన ఈ-క్రాప్‌ నమోదు ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని సిబ్బందికి లక్ష్యం విధించారు. అప్పటికి 60 శాతం కూడా పూర్తికాకపోవడంతో ఈ నెలాఖరు వరకు ఈ క్రాప్‌ నమోదుకు అవకాశం కల్పించారు. జిల్లాలో ఇప్పటివరకు 1.30 లక్షల ఎకరాల్లో ఈ-క్రాప్‌ నమోదు చేశారు. అంటే 75 శాతం పూర్తయింది. పంట నమోదుకు మరో తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రక్రియ వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

నమోదు చేయకపోతే  రైతులకు నష్టమే..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ-క్రాప్‌ నమోదు విధిగా చేయించాల్సిఉంది. ప్రధానంగా ఖరీఫ్‌ సీజన్‌కు భారీ వర్షాలు, తుపానుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే.. రైతులకు పరిహారం పంపిణీలో ఈ-క్రాప్‌ వివరాలనే ప్రాతిపదికగా తీసుకుంటారు. పెట్టుబడి రాయితీ, పంటల బీమా, ధాన్యం విక్రయాలకు ఈ-క్రాప్‌ నమోదు తప్పనిసరి కావడంతో రైతులు తమ పంటల వివరాల నమోదుకు ముందుకు రావాల్సిఉంది. ఈ ఏడాది నుంచి డిజిటల్‌ ఈ-క్రాప్‌ బుకింగ్‌ చేస్తున్న క్రమంలో యాప్‌లో పలు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. సర్వే నంబర్ల ఆధారంగా ఈ-క్రాప్‌ నమోదు జరుగుతున్న క్రమంలో క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు 10-200 మీటర్ల దూరంలో ఫొటోలు తీసి యాప్‌లో నమోదు చేయడానికి అవకాశం కల్పించడంతో కొంతవరకు వెసులుబాటు కలిగింది. ఈ క్రమంలో ఖరీఫ్‌లో ప్రతి రైతు సాగుచేసిన పంటను నమోదు చేయడానికి సిబ్బంది చర్యలు చేపట్టాల్సిఉంది.

ఉద్యాన పంటలకూ అవకాశం..

వరి సాగుకే కాకుండా ఉద్యాన పంటలకు కూడా ఈ-క్రాప్‌ నమోదు చేయాల్సిఉంది. వాతావరణ, దిగుబడి ఆధారిత బీమా సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ-క్రాప్‌ నమోదు ఆధారంగానే బీమా పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి పంట నమోదు పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొబ్బరి, కోకో, పసుపు, తమలపాకులు, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేశారు. దీనికి ఈ నెల 15తో గడువు ముగియడంతో.. తొలుత గడువు పెంచలేదు. మళ్లీ ఇటీవల ఉద్యానపంటలకూ ఈ నెలాఖరు వరకు ఈ-క్రాప్‌ నమోదుకు అవకాశం కల్పించారు.


ఈ నెలాఖరుకు పూర్తి చేయించుకోండి

- వి.బోసుబాబు, జిల్లా వ్యవసాయాధికారి

వరి సాగు ఈ-క్రాప్‌ నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీనాటికే గడువు పూర్తయినా.. సాంకేతిక లోపాలు, వివిధ కారణాలతో పంట నమోదు పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రస్తుతం 75 శాతం అయ్యింది. రైతుభరోసా కేంద్రాల పరిధిలోని వరి విస్తీర్ణం ఆధారంగా అక్కడ పనిచేసే వ్యవసాయ సహాయకులు ప్రణాళిక ప్రకారం.. ప్రతి రైతు సాగుచేసిన పంటను పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం. ఒక్క రైతుకు కూడా నష్టం కలగకుండా 100శాతం ఈ-క్రాప్‌ నమోదు చేయించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని