logo

ఇంటింటికీ వెళ్తాం.. అక్రమాన్ని వివరిస్తాం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాటిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని త్వరలోనే రాష్ట్రం నుంచి తరిమికొట్టి దళితుల తడాఖా చూపిస్తామని తెదేపా ఎస్సీ, ఎస్టీ సెల్‌ నాయకులు హెచ్చరించారు.

Published : 22 Sep 2023 04:01 IST

చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న ఎస్సీ, ఎస్టీ నాయకులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాటిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని త్వరలోనే రాష్ట్రం నుంచి తరిమికొట్టి దళితుల తడాఖా చూపిస్తామని తెదేపా ఎస్సీ, ఎస్టీ సెల్‌ నాయకులు హెచ్చరించారు. అమలాపురôలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు అధ్యక్షతన తెదేపా శ్రేణులు తొమ్మిదోరోజు రిలే దీక్షలను గురువారం కొనసాగించారు. నాయకులు నల్ల, నీలం కండువాలు ధరించి నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఇంటింటికీ వెళ్తాం.. చంద్రబాబు అక్రమ అరెస్టును వివరిస్తాం.. అంటూ తెదేపా శ్రేణులు పేర్కొన్నారు. ర్యాలీ చేశారు. సీఎం డౌన్‌ డౌన్‌, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ఆనందరావు మాట్లాడుతూ సైకో జగన్‌ పాలనలో ఎన్నడూ లేనివిధంగా దళితులపై దాడులు పెరిగాయన్నారు. దళితులను చంపి డోర్‌ డెలివరీ చేసిన దుర్మార్గ ప్రభుత్వమిదని, నేరస్థులను జగన్‌ ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కేసులు నమోదుచేసి జైలులో పెట్టారని ఆరోపించారు. అనంతరం బోర్డుపై సంతకాలు చేశారు. జగదీశ్వరి, సుభాష్‌చంద్రబోస్‌, శ్యామ్‌, నాగేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీను, తారక్‌ తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలకు ఎస్సీ, మైనారిటీ సెల్‌ నాయకులు తరలివచ్చారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మద్దతు తెలిపి మాట్లాడారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఏవిధమైన అవినీతి జరక్కపోయినా అధికార బలంతో సీఐడీని అడ్డంపెట్టుకుని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు.


వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం..

ముమ్మిడివరం: జనసేనాని నిర్ణయాలను నాయకులు, కార్యకర్తలం తప్పక పాటిద్దామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పితాని బాలకృష్ణ అన్నారు. ముమ్మిడివరంలో గురువారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పరిణామాలు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు వంటి పరిస్థితుల నేపథ్యంలో అరాచక వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెదేపా, జనసేన కలిసి సాగాలని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తెదేపా దీక్ష లకు మద్దతు తెలిపారు. జక్కంశెట్టి పండు, ముత్యాల జయలక్ష్మి, గొలకోటి వెంకటేశ్వరరావు, మోకా బాలప్రసాద్‌, మద్దింశెట్టి పురుషోత్తం, అత్తిలి బాబూరావు, కడలి వెంకటేశ్వరరావు, జమ్మి, పుండరీష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని