logo

ప్రైవేటు బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం

అతి వేగంగా, నిర్లక్ష్యంగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఆ రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Published : 22 Sep 2023 04:01 IST

ముగ్గురికి గాయాలు

దేవరపల్లి, న్యూస్‌టుడే: అతి వేగంగా, నిర్లక్ష్యంగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఆ రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దేవరపల్లి మండలంలోని జాతీయ రహదారి నుంచి యర్నగూడెం గ్రామంలోకి వెళ్తుంది.

అదే సమయంలో యర్నగూడెం నుంచి నల్లజర్ల వెళ్తున్న కోళ్లను సరఫరా చేసే బొలెరోను, దాని వెనుక ద్విచక్రవాహనాన్ని.. ట్రావెల్‌ బస్సు బలంగా ఢీకొనడంతో బొలెరో డ్రైవర్‌ కనక పెద్దిరాజు(33), క్లీనర్‌ కె.యశ్వంత్‌కు తీవ్రగాయాలు కాగా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కనక పెద్దిరాజు మృతిచెందారు. ద్విచక్ర వాహనంపై ఉన్న బొడ్డు చంటి, జెర్రి నాగేంద్రకు గాయాలవ్వడంతో గోపాలపురం సీహెచ్‌సీకి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు.

అందరూ యర్నగూడెం గ్రామస్థులే..

బాధితులు అందరూ యర్నగూడెం గ్రామానికి చెందిన వారే. మృతుడు కనక పెద్దిరాజు చికెన్‌ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోళ్ల లోడు కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నాన్న ఎక్కడని.. పిల్లలు అడిగితే ఏం చెప్పాలని మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. చంటి, నాగేంద్ర పెయింటింగ్‌ పనులు చేస్తుంటారు. నల్లజర్ల వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని