logo

ఎలుకల మందుకూ ఎదురుచూపే!

అమలాపురానికి చెందిన వేణుగోపాలరావు పదెకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ప్రభుత్వం ఎలుకల నివారణ మందు ఈ ఏడాది ఇంకా పంపిణీ చేయకపోవడంతో వాటి ఉద్ధృతి పెరిగిపోతోందని భావించి సొంతంగా బుట్టలు పెట్టించుకున్నారు.

Updated : 22 Sep 2023 04:33 IST

న్యూస్‌టుడే, సీతానగరం

అమలాపురానికి చెందిన వేణుగోపాలరావు పదెకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ప్రభుత్వం ఎలుకల నివారణ మందు ఈ ఏడాది ఇంకా పంపిణీ చేయకపోవడంతో వాటి ఉద్ధృతి పెరిగిపోతోందని భావించి సొంతంగా బుట్టలు పెట్టించుకున్నారు. దీనికి ఇప్పటివరకు రూ.10 వేలు వెచ్చించినట్లు తెలిపారు. బ్రోమోడయాలిన్‌ మందు పంపిణీ చేసి ఉంటే ఈ ఖర్చు తగ్గేదని చెబుతున్నారు.

మ్మడి జిల్లాలో 2.15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరిసాగు చేస్తున్న సుమారు 3.50 లక్షల మంది రైతులకు ఎలుకల నివారణ మందుకు ఎదురుచూపులు తప్పడం లేదు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని కొన్నిచోట్ల అధికారులు నేడు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో రేపుమాపు అంటున్నారు.

పంపిణీలో జాప్యం

ఎలుకల నివారణకు ఖరీఫ్‌, రబీ పంటల్లో రెండు విడతలు పంపిణీ చేయాల్సిన బ్రోమోడయాలిన్‌ మందును ప్రభుత్వం ఈ ఏడాది నేటికీ అందించలేదు. వాస్తవానికి సెప్టెంబరు రెండోవారం నాటికే ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా రైతు చేతికి అందలేదు. చేలపై మూషికాలు మూకుమ్మడిగా చేస్తున్న దాడితో అదనపు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఎకరాకు 5 బస్తాల దిగుబడి కోల్పోతున్నామని దిగులు చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎలుకల వల్ల కలిగే నష్టం 10 నుంచి 45 శాతం వరకు ఉన్నట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి.  

ఒక్కో ఎలుకకు రూ.80..

రైతులు ఒక్కో ఎలుక పట్టివేతకు సరాసరి రూ.80 చెల్లించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అయితే ఎకరాకు రెండేసి ధాన్యం బస్తాలు చొప్పున ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎలుకల ఉద్ధృతి బట్టి ఎకరాకు రూ.4 వేలు నగదు ఇచ్చేలా కూడా ముందుకొస్తున్నారు. నారుమళ్లు పోసే సమయంలోనే ఎలుకల బొరియలను గమనించి పొగబెట్టి వాటిలో మందు పెట్టినా వాటిసంఖ్య పెద్దగా తగ్గలేదని పలువురు చెబుతున్నారు.

సకాలంలో వరి నాట్లు

ఈ ఏడాది సకాలంలోనే 80 శాతం వరినాట్లు పూర్తిచేశారు. మెట్టలోనే సాగునీరు ఆలస్యం కావడంతో జాప్యం జరిగింది. హెక్టారుకు 10 గ్రాముల బ్రోమోడయాలిన్‌ మందు వాడాలి. ఉమ్మడి జిల్లాకు దాదాపు 2,350 కిలోలు అవసరం. జిల్లా కేంద్రాలకు వచ్చిన ఈ మందును మండలాల వారీగా పంపించడం, అక్కడి నుంచి ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి పంపిణీ చేయాల్సి ఉంది.


పంపిణీ చేస్తాం

- ఎస్‌.మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి

ఖరీఫ్‌లో సామూహిక ఎలుకల నిర్మూలనకు సంబంధించిన బ్రోమోడయాలిన్‌ మందు వచ్చింది. దీనిని ల్యాబ్‌ టెస్ట్‌కు పంపించాం. ఈ నెల 25, 26 తేదీల్లో ఉచితంగా పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలుకలను సమర్థంగా అరికట్టేందుకు ప్రతి ఆర్బీకే పరిధిలో మందు అందుబాటులో ఉంచుతాం. 100 గ్రాముల విషపు ఎర తయారీకి రెండు గ్రాముల బ్రోమోడయాలిన్‌ మందు, 96 గ్రాముల నూకలు, రెండు గ్రాముల నూనె కలిపి 10 గ్రాముల చొప్పున పొట్లాలు కట్టి బొరియలు వద్ద ఉంచాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని