logo

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో

కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని బంధనపూడి వీఆర్వో పామర్తి వెంకట సూర్యనారాయణ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులు శనివారం వలపన్ని పట్టుకున్నారు

Published : 24 Sep 2023 06:09 IST

వీఆర్వో పామర్తి వెంకట సూర్యనారాయణ

కాజులూరు: కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని బంధనపూడి వీఆర్వో పామర్తి వెంకట సూర్యనారాయణ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులు శనివారం వలపన్ని పట్టుకున్నారు. అనిశా అదనపు ఎస్పీ సౌజన్య, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరుకు చెందిన తలాటం వెంకటేష్‌ ఈ ఏడాది ఆగస్టు 8న బంధనపూడిలో 30 సెంట్ల భూమి కొనుగోలుచేసి పాసు పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు రూ. 5వేలు లంచం ఇవ్వాలని వీఆర్వో పామర్తి వెంకట సూర్యనారాయణ డిమాండ్‌ చేశాడు.  తనవద్ద డబ్బుల్లేవని చెప్పగా ఫోన్‌ పే చేయాలన్నాడు. మధ్యలో మళ్లీ ఫోన్‌చేసి రూ. 6 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. విషయాన్ని వెంకటేష్‌ తహసీల్దారు కార్యాలయానికి ఫోన్‌చేసి చెప్పగా మీరూమీరూ తేల్చుకోండని అక్కడి సిబ్బంది వ్యంగ్యంగా సమాధానం చెప్పడంతో అనిశా అధికారులను ఆశ్రయించారు. వారు వెంకటేష్‌కు నగదు ఇచ్చి, కాజులూరు మండలం ఆర్యవటం కోళ్లుతూముసెంటర్‌లో శనివారం వీఆర్వోకు ఇస్తుండగా స్వయంగా పట్టుకుని తహసీల్దారు కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని సౌజన్య తెలిపారు. దాడిలో అనిశా ఇన్‌స్పెక్టర్లు డి.వాసుకృష్ణ, బి.శ్రీనివాసరావు, వై.సతీష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని