logo

జీవజలాలు.. సంద్రంపాలు

దేశంలోని ప్రముఖ నదుల్లో గోదావరి ఒకటి. మహారాష్ట్రలోని నాసిక్‌ వద్ద పుట్టి 1500 కిలోమీటర్ల మేర ప్రయాణించి పోలవరం వద్ద డెల్టా ప్రాంతంలోకి ప్రవేశించింది

Published : 24 Sep 2023 06:12 IST

గోదావరి పరిరక్షణకు చిత్తశుద్ధి కరవు
నేడు నదుల దినోత్సవం

ఈ ఏడాది జులైలో వరదలకు పి.గన్నవరం వైనతేయ గోదావరి నుంచి సముద్రం వైపు ప్రవాహం

న్యూస్‌టుడే, పి.గన్నవరం, ముమ్మిడివరం: దేశంలోని ప్రముఖ నదుల్లో గోదావరి ఒకటి. మహారాష్ట్రలోని నాసిక్‌ వద్ద పుట్టి 1500 కిలోమీటర్ల మేర ప్రయాణించి పోలవరం వద్ద డెల్టా ప్రాంతంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు 41.80 కిలోమీటర్ల మేర అఖండ గోదావరిగా ఏర్పడింది. బ్యారేజీ దిగువకు వచ్చేసరికి గౌతమి, వృద్ధగౌతమి, కోరింగ, వశిష్ఠ, వైనతేయ పాయలుగా చీలి కోనసీమ ప్రాంతంలో సాగరంలో కలుస్తున్నాయి. బ్యారేజీ దిగువన ఆయా నదీ పాయలు సుమారు 220 కిలోమీటర్ల మేర విస్తరించిఉన్నాయి. ఈ పాయల్లో జూన్‌ నుంచి డిసెంబరు వరకు వరద జలాలు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదల సీజన్‌గా భావిస్తారు. ఈ మూడు నెలల్లో వరద నీరు ఎక్కువగా సముద్రం పాలవుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో 9.50లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతుంది. దీనికి గోదావరి జలాలే ఆధారం. లక్షలాది మందికి, వేలాది పశువులకు తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. పరిశ్రమలకుసైతం ఇవే కీలకం. ఇంతటి ప్రాధాన్యం గల గోదావరిని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతను అందరూ విస్మరిస్తున్నారు. ఒక టీఎంసీ అంటే 11,500 క్యూసెక్కుల నీరు. ఈ నీటితో సుమారు 11 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయొచ్చు. ఏటా గోదావరి వరదల సమయంలో వేలాది టీఎంసీల గోదావరి జీవ జలాలు ఉప్పునీటి పాలవుతున్నాయి. వాటన్నింటినీ నిల్వ చేసుకోగలిగితే మొదటి పంటైన ఖరీఫ్‌కు నీటి  ఎద్దడి ఉండదు. ఇక రబీ సాగుకు నీరందక యాతనపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గోదావరిలో స్వయం జలవృద్ధి పడిపోతున్న పరిస్థితుల్లో రబీ సాగుకు ఎక్కువగా సీలేరు జలాలపై ఆధారపడాల్సివస్తోంది. సముద్రంలో కలిసిపోతున్న జీవజలాలను ఒడిసిపట్టుకునేలా ప్రాజెక్టులు అందుబాటులో లేకపోవటంతో ఏటా రెండో పంటకు సాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది.  పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తిచేస్తే జలాలను రాష్ట్రమంతా సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది.

పాయలవెంట అక్రమ ఆక్వా సాగు

నదీ జలాలను కలుషితం చేస్తున్నవాటిలో అక్రమ ఆక్వా సాగు ఒకటి. ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలోని వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి గోదావరి నదీపాయల చెంతన ఈ సాగు యథేచ్ఛగా సాగిపోతోంది. ఆక్వా చెరువుల నుంచి వ్యర్థ జలాలను నేరుగా నదిలోకి మళ్లించకుండా అధికార యంత్రాంగం అరికట్టాల్సిఉంది. కోనసీమ ప్రాంతంలో 35 వేల ఎకరాల్లో ఆక్వా సాగుంటే. దీంట్లో నదీ పాయలను ఆనుకుని సుమారు అయిదు వేల ఎకరాల్లో సాగవుతోంది. లంకా ఆఫ్‌ గేదెల్లంక, అన్నంపల్లి, మురమళ్ల, పల్లంకుర్రు, కేశనకుర్రు, సఖినేటిపల్లి, అంతర్వేది, ఎదుర్లంక, జి.మూలపొలం, బోడసకుర్రు తదితర ప్రాంతాల్లో గోదావరి పాయల వెంట అక్రమ ఆక్వా సాగు జలాలను కలుషితం చేస్తోంది. దానికి తోడు నదిని ఆనుకునే చెత్త వేయడమూ కాలుష్యానికి కారణమవుతోంది.

భారీగా తరలుతున్న ఇసుకతో..

లంక భూములు, తీర ప్రాంతాల్లో ఇసుక, లంకమట్టి తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తుండడం నదిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. పాయల్లో ఏకంగా రహదారులు ఏర్పాటుచేసి మరీ భారీ లారీలతో తరలిస్తున్నారు. యంత్రాలతో తోడకంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడుతోంది. నది స్వరూపం మారుతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్రాస్‌ రివర్స్‌ కన్జర్వెన్సీ యాక్ట్‌ ప్రకారం గోదావరి జలాలను కలుషితం చేయకూడదు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. కానీ చాలా సంవత్సరాలుగా ఈ యాక్ట్‌ను పక్కాగా అమలు చేస్తున్న పరిస్థితులు లేకపోవడం దయనీయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని