logo

చంద్రబాబు వెంటే మేమంతా..!

తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేయడం ముమ్మాటికీ అన్యాయమేనని కాకినాడ నగరానికి చెందిన బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల నాయకులు పేర్కొన్నారు.

Updated : 24 Sep 2023 06:30 IST

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేయడం ముమ్మాటికీ అన్యాయమేనని కాకినాడ నగరానికి చెందిన బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల నాయకులు పేర్కొన్నారు. రాజకీయంగా ఆయన అనుభవానికి, వయస్సుకు తగిన గౌరవం ఇవ్వకుండా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందిపెట్టటం దారుణమని వ్యాఖ్యానించారు. నిర్దోషిగా ఆయన కచ్చితంగా బయటకు వస్తారని, ఆయన వెంటే తామంతా ఉంటామని ప్రతిన బూనారు. బాలాజీచెరువు కూడలిలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలలో 10వ రోజు శనివారం చంద్రబాబుకు మద్దతుగా నగరానికి చెందిన ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీక్షను మాజీ ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించగా పరిశీలకుడిగా నాగిడి నాగేశ్వరరావు హాజరయ్యారు. దీక్షలలో గ్రంధి బాబ్జి, బచ్చు శేఖర్‌, భమిడిపాటి శ్రీకృష్ణ, హోతా రవి, దంగేటి సతీష్‌, మేడిశెట్టి బుజ్జి, పేకేటి సూర్యభాస్కరరావు, మాతంశెట్టి నరేష్‌, ఉప్పులూరి వీరభద్రరావు, ఎడ్లపల్లి కొండలరావు, అద్దేపల్లి గంగరాజు, కానుకూరి వైకుంఠరావు, బచ్చు మురళి, వంకాయల కృష్ణ, బచ్చు శివ, పున్నయ్య, గరిమెళ్ల సుబ్రహ్మణ్యం, అజ్జరపు వెంకటేశ్వరరావు, హోతా శాండ్రియ, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. వారికి మద్దతుగా ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు.


ముమ్మాటికీ అక్రమ కేసు..

వైకాపా అధికారంలోకి వచ్చాక అక్రమ కేసుల బనాయింపు పరిపాటిగా మారింది. చంద్రబాబు అరెస్ట్‌తో అది పరాకాష్ఠకు చేరింది. రాష్ట్ర ప్రజలెరూ ఈ అరెస్ట్‌ను సమ్మతించడం లేదు. పొరుగు రాష్ట్రాల్లోనే కాదు.. పొరుగు దేశాల్లోనూ చంద్రబాబుకు ప్రస్తుతం సానుభూతి పెరిగింది. మంచి చేసినవారికి ఇలాంటి శిక్ష ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుపై బనాయించిన కేసు ముమ్మాటికీ అవాస్తవమే. ఆయన నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కేసును కచ్చితంగా కొట్టివేస్తారు. అంతిమ విజయం చంద్రబాబుదే.

హోతా రవి, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్‌


మంచి చేస్తే ఫలితం ఇదా..?

విద్యార్థులలో నైపుణ్యాలు పెంపొందిస్తే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు భావించారు. ఎందరో విద్యార్థులు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందారు. కొందరికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇంతమంచి పనిచేసిన చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించడం దారుణం. మంచి చేస్తే ఫలితం ఇదా..? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకతీతంగా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి దారుణాలు లేవు. ప్రతిపక్షాల నోరు నొక్కడం అప్రజాస్వామికం. ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే పాలక పక్షం సక్రమంగా పనిచేస్తుంది.
బచ్చు శేఖర్‌, తెదేపా వాణిజ్య విభాగం


అండగా నిలవాలి..

చంద్రబాబు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి. ఆయన పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. అందరికీ అవకాశాలు కల్పించారు. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవాల్సింది పోయి అక్రమంగా అరెస్ట్‌ చేయటం దారుణం. ఈ చర్యను పొరుగు రాష్ట్రాలు సైతం ఖండిస్తున్నాయి. కక్ష సాధింపు దోరణలు ప్రజాస్వామ్యంలో సరికాదు. రాజకీయాలంటే యావగించుకునే పరిస్థితి వస్తోంది. రాష్ట్రంలోని అరాచక పాలనపై కేంద్రం దృష్టి సారించాలి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముందుకొచ్చి చంద్రబాబు మద్దతుగా నిలవాలి.
మేడిశెట్టి వీరభద్రరావు (బుజ్జి), ఆర్యవైశ్య సంఘం నాయకుడు


అక్రమ అరెస్ట్‌ బాధిస్తోంది..

ఏ తప్పూ చేయని చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడం బాధిస్తోంది. ఆయన హయాంలోనే సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధి చెందింది. రాష్ట్రానికి చెందిన ఎందరో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు. సాధారణ విద్యార్థులు కూడా నైపుణ్యం పెంపొందించుకుని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని చంద్రబాబు తలచారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా మెరుగైన శిక్షణ ఇప్పించారు. లక్షల మంది శిక్షణ పొందితే అవినీతి ఎక్కడ జరిగింది? చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు ఆధారాలున్నాయా? ఇలాంటి అరాచక చర్యలతో రాష్ట్రం ఎటు పోతోందో తెలియటం లేదు.
 హోతా శాండిల్య, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని