logo

స్థాయీ సంఘ సమావేశాల్లో సమస్యల ఏకరువు

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు కోరారు

Published : 24 Sep 2023 06:28 IST

మాట్లాడుతున్న ఛైర్మన్‌ వేణుగోపాలరావు, చిత్రంలో వైస్‌ఛైర్మన్లు, సీఈవో

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఏడు స్థాయీ సంఘాల సమావేశాలకు జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు, వైస్‌ఛైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, జడ్పీటీసీ సభ్యురాలు రొంగలి పద్మావతి అధ్యక్షత వహించారు. సమావేశంలో ఉపాధి హామీ, విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు, భవనాలు తదితర శాఖలపై సభ్యులు చర్చించారు. ఉపాధి హామీ, నాడు-నేడు పనుల్లో మండల అధికారులు ప్రొటోకాల్‌ పాటించడంలేదని రావుపాలెం, ఉప్పలగుప్తం సభ్యులు కుడిపూడి శ్రీనివాస్‌, గెడ్డం సంపదరావు సభ దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని అయినవిల్లి సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు తదితరులు అధికారులను కోరారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయని రాజోలు సభ్యురాలు మట్టా శైలజ చెప్పారు. జగ్గంపేట సీహెచ్‌సీలో స్కానింగ్‌ మిషన్‌ పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని సభ్యురాలు ఒమ్మి బింధుమాధవి ప్రస్తావించారు. ఆర్‌బీకే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సమయాల్లో తేమ పేరుతో రైతులను ఇబ్బందిపెడుతున్నారని పలువురు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎలుకల మందు సకాలంలో పంపిణీ చేసి పంట నష్టాన్ని నివారించాలని కోరారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పెండింగ్‌ పనులను పూర్తిచేయాలని విన్నవించారు. సభ్యులు లేవనెత్తిన ఆయా అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

మహిళా బిల్లుపై అభినందన తీర్మానం..

పార్లమెంట్‌ ఉభయ సభల్లో మహిళా బిల్లు ఆమోదంపై జడ్పీ తరఫున అభినందన తీర్మానాన్ని ఆమోదించారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేన్లు కల్పించేలా బిల్లు ఆమోదానికి కృషిచేసిన ప్రధాని మోదీ, సీఎం జగన్‌లకు ధన్యవాదాలు తెలిపారు. తీర్మానాన్ని జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎ.రమణారెడ్డి, డీఈవో జి.నాగమణి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ సుబ్బలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రమణమూర్తి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి ఎస్‌.సూర్యప్రకాశరావు, ఐసీడీఎస్‌ పీడీ కె.ప్రవీణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని