logo
Updated : 26 May 2022 06:22 IST

పెళ్లి పీటలపై చిన్నారులు

మారుమూల ప్రాంతాల్లో కొనసాగుతున్న బాల్య వివాహాలు

కలిదిండి, మండవల్లి, న్యూస్‌టుడే: మూఢ నమ్మకాలు.. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు.. కారణాలేమైతేనేం.. ముక్కుపచ్చలారని చిన్నారులను పెళ్లి పీటలవైపునకు తోసేస్తున్నాయి. బాల్య వివాహాలు నేరమని అధికారులు, న్యాయస్థానాలు, చట్టసభలు, సంఘ సంస్కర్తలు, స్వచ్ఛంద సంస్థలు ఘోషిస్తున్నా.. వాటిని నిరోధించడం అధికార యంత్రాంగానికి కత్తిమీద సాములా తయారైంది. ప్రధానంగా కొల్లేరు, ఉప్పుటేరు తీర ప్రాంతాలతోపాటు మారుమూల గ్రామాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ దుస్సంప్రదాయాన్ని కొనసాగించడంలో దక్షిణ భారతదేశంలోనే మన రాష్ట్రం 29.22 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. అందులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 22 శాతం నమోదు కావడం గమనార్హం.●

కలిదిండి మండలంలోని ఉప్పుటేరు తీర గ్రామంలో కొన్నాళ్ల కిందట బాలికకు వివాహం చేస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. అధికారులు ఆ గ్రామానికి చేరుకునేటప్పటికి పెళ్లికి వచ్చిన వారంతా భోజనాలు చేశారు. ఇంకా వివాహ తంతు మిగిలింది. అధికారులను చూసి ‘ఊర్లోనే పదో తరగతి వరకు చదివిద్దామంటే అవకాశం లేదు. దూర ప్రాంతాలకు పంపిద్దామంటే భద్రత లేదు. అన్నింటికీ మించి ఆర్థిక భరోసా లేదు. మా బాధ మమ్మల్ని పడనీయండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టప్రకారం బాల్య వివాహం నేరమంటూ అధికారులు వారికి నచ్చజెప్పారు.●

ఈ నెల 12న మండవల్లి మండలం పులపర్రు గ్రామంలో పదమూడేళ్ల బాలిక వివాహాన్ని ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్నారు. ఇంత చిన్న పాపకు అప్పుడే ఎందుకు వివాహం చేస్తున్నారని ప్రశ్నిస్తే బాలిక అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని, మనవరాలి పెళ్లి చూసి చనిపోతానని ఆమె చెప్పినట్లు బంధువులు బదులిచ్చారు.●

గత నెలలో మండవల్లి మండలం గన్నవరంలో పదహారేళ్ల బాలికకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవ్వగా స్థానికుల సమాచారంతో అధికారులు పెళ్లి నిలుపుదల చేశారు. చిన్నారి తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నారని, ఈ దశలో బంధువుల్లో ఒకరు ముందుకురావడంతో పెళ్లి చేస్తున్నామని ఆమె తల్లి చెప్పడంతో అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు.●

మండవల్లి మండలం ఇంగిలిపాకలంకలో పదిహేనేళ్ల బాలికకు గుడిలో పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చారు. పెద్దఎత్తున విందు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అధికారులు వెళ్లడంతో పెళ్లి చేయలేదని, నిశ్చితార్థం చేసుకుంటున్నామని చెప్పారు. 21 ఏళ్లు వచ్చేవరకు పెళ్లి చేయకూడదని అధికారులు అవగాహన కల్పించినా ప్రయోజనం లేదు. ఆ తర్వాత అన్ని తంతులు జరిగిపోయాయి.

రెండేళ్ల జైలు..

బాల్య వివాహాలు చేసినా, పోత్సహించినా రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. తల్లిదండ్రులు, పురోహితులు, పెళ్లికి హాజరైనవారూ నిందితులే. ఈ అంశంపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. వీటి నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటాం.’ అని మండవల్లి ఇన్‌ఛార్జి ప్రాజెక్టు అధికారిణి, ధనలక్ష్మి తెలిపారు.

Read latest Eluru News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని