పింఛను ఇప్పిస్తామని.. గొలుసు లాగేసుకున్నారు
గణపవరం (నాదెండ్ల), న్యూస్టుడే: నాదెండ్ల మండలం పారిశ్రామికవాడ గణపవరంలో ఓ మహిళకు పింఛను ఆశ చూపించి బంగారు గొలుసు అపహరించుకెళ్లిన సంఘటన శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం పద్మశాలి వీధికి చెందిన పుట్టా ఓబయ్య, సామ్రాజ్యం దంపతులు బొడ్డురాయి కూడలిలో కిళ్లీ దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం సామ్రాజ్యం దుకాణం తెరవగా ఇద్దరు యువకులు సిగరెట్లు కొనుగోలు చేశారు. చిలకలూరిపేట నుంచి సరకులు తీసుకొని భర్త రావడంతో ఆమె ఇంటికి బయల్దేరింది. వెనుకనే వెంబడించిన ఇద్దరు యువకులు ఆ మహిళ ఇంటికి చేరుకోగానే సచివాలయం నుంచి వచ్చామని, పింఛన్ ఇప్పిస్తామంటూ మభ్యపెట్టారు. ఆధార్ కార్డు తీసుకొని వివరాలు వాకబు చేస్తున్నట్లు నటించి ఒక్కసారిగా తోసేశారు. కిందపడిన ఆమె తలకు గాయమైంది. అప్పటికే మెడలోని బంగారు తాళిబొట్టు గొలుసు లాగేసుకొని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. క్షతగాత్రురాలిని చిలకలూరిపేట ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. రెండ్రోజుల క్రితం ఇదే విధంగా ఒక మహిళ మెడలో సాధారణ గొలుసు అపహరించారు. మరో వృద్ధురాలిని దోచుకునే ప్రయత్నం విఫలమైంది. వరుస సంఘటనలతో పారిశ్రామికవాడ మహిళలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.