పేటలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
జ్యోతి వెలిగిస్తున్న ఏబీవీపీ నేతలు
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే: విద్యార్థి పరిషత్ నేతలు విద్యారంగ సమస్యలపై ఉద్యమించడంతో పాటు మాదకద్రవ్యాల బారినపడకుండా విద్యార్థులను చైతన్యపరచాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆంధ్రా, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల సంఘటనా కార్యదర్శి బాలకృష్ణ సూచించారు. పట్టణంలోని గీతా మందిరంలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆజాది కా అమృతోత్సవం నిర్వహిస్తున్న సందర్భంలో స్వాతంత్య్ర సమర వీరుల గురించి మరింత సమాచారాన్ని సమాజానికి అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగఫణిశాస్త్రి మాట్లాడుతూ శాసనసభ నిర్వహణ తీరుపై సైతం చర్చ చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కౌశిక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకూ చదువుతున్న విద్యార్థులు సమస్యల్లో కొట్టు మిట్టాడుతున్నారన్నారు. విద్యారంగ సమస్యలపై ఉద్యమించేందుకు కార్యచరణ రూపకల్పనపై సమావేశాల్లో చర్చించాలన్నారు. కార్యక్రమంలో నేతలు శివకుమార్, సుమన్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.