వేధింపుల కేసులో యువకునికి జైలుశిక్ష, జరిమానా
గుంటూరు లీగల్, న్యూస్‌టుడే: యువతిని ప్రేమ పేరుతో వేధించిన యువకుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి ఆర్.శ్రీలత శనివారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన తూమాటి సురేష్‌బాబు విద్యుత్తు పనులు చేసేవాడు. అతను ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నట్లు వేధింపులకు గురిచేసేవాడు. యువతి అతడిని పట్టించుకోకపోవడంతో ఒకసారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. కొద్ది రోజుల తరువాత మళ్లీ ఆమె వెంటపడి ప్రేమిస్తున్నట్లు చెప్ఫి..కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో యువతి 2018 మే 15న అతని కోరిక మేరకు చందోలు వెళ్లింది. అక్కడ నుంచి అతను ఆమెను గుంటూరు తీసుకువెళ్లాడు. అక్కడ నుంచి ఇంటికి చేరుకున్న విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు జరిగిన సంగతి తెలపడంతో పొలీసులకు ఫిర్యాదు చేశారు. పొలీసులు కేసు నమోదు చేసి అతనిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నేరం రుజువు చేయడంతో మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జడ్జి శ్రీలత తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్యామల ప్రాసిక్యూషన్ నిర్వహించారు.