logo
Published : 01/12/2021 01:03 IST

మాటల్లోనేప్లాస్టిక్‌ నిషేధం


రోడ్డు పక్కన వ్యర్థాల గుట్ట

న్యూస్‌టుడే, నరసరావుపేట పట్టణం : జిల్లా వ్యాప్తంగా నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. పురపాలక సంఘాల్లో ప్లాస్టిక్‌ నిషేధం అమలు మూణ్ణాళ్ల ముచ్చటగా ఉంది. ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ప్రకటనలు ఆచరణకు నోచుకోవటంలేదు. మధ్య తరగతి వారి నుంచి ధనికులు సైతం ప్లాస్టిక్‌ కవర్‌ లేకుండా బజారు నుంచి ఇంటికి వెళ్లటం లేదు. అధికారులు సదస్సులు ఏర్పాటు చేసి వస్త్రం, జనపనార, పేపర్‌తో తయారు చేసిన సంచులు వాడాలని అవగాహన కల్పిస్తున్నా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను వ్యాపారులు బహిరంగంగా విక్రయిస్తున్నారు. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి నామమాత్రంగా జరిమానా విధించటంతో నిషేధం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. రాజకీయ నాయకులు ప్లాస్టిక్‌ నిషేధం అమలుకు తూట్లు పొడుస్తున్నారు. అధికారులు దాడులు చేసి వ్యాపారులను పట్టుకుంటే రాజకీయ నాయకులు వారికి సిఫార్సు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దుతామని పాలకులు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమతమవుతున్నాయి.

నరసరావుపేట పురపాలక సంఘంలో ప్రతిరోజూ 65 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు పోగవుతాయి. ఇందులో ఎనిమిది టన్నులు నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు ఉంటున్నాయి. అధికారులు 2019లోనే ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేయాలని సంకల్పించారు. ఏడాదిపాటు అమలు జరిగింది. ఈ క్రమంలోనే అధికారులపై రాజకీయ ఒత్తిడులు రావటంతో తనిఖీలు విరమించుకున్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు బహిరంగంగా విక్రయిస్తున్నా ఎలాంటి చర్యలు ఉండటం లేదు. కొందరు వ్యాపారులు ప్లాస్టిక్‌ సంచులను విక్రయిస్తుండగా అధికారులు దాడిచేసి నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యాపారులు ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి అధికారులపై ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ప్లాస్టిక్‌ నిషేధం అమలులో వెనకడుగు వేశారు. తోపుడుబండ్లు, కూరగాయల మార్కెట్‌, హోటళ్లు తదితర చోట్ల నిషేధిత కవర్లు, గ్లాసులు, సీసాలు బహిరంగంగా వినియోగిస్తున్నారు. మురుగు కాల్వల్లో రహదారుల పక్కన ప్లాస్టిక్‌ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి.

జిల్లా కేంద్రమైన గుంటూరును ప్లాస్టిక్‌ రహిత నగరంగా మార్చే క్రమంలో నవంబరు 10వ తేదీ నుంచి ప్లాస్టిక్‌ సంచులపై నిషేధం విధించారు. గతంలో పలుమార్లు ప్రకటనలు చేసినా అమలుకు నోచుకోలేదు. ఈ విషయంలో అధికారులు ఈ సారి కఠినంగా వ్యవహరించేలా రంగం సిద్ధం చేశారు. నగరపాలక, సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లతో కలిపి ప్రత్యేక బృందాలను నియమించారు. ఇవి ప్రతిరోజూ తనిఖీలు చేసి నిషేధిత వస్తువులు విక్రయించే వారిపై కేసులు నమోదు చేయటంతో పాటు జరిమానా వసూలు చేయనున్నాయి.

తెనాలి, బాపట్ల, చిలకలూరిపేట తదితర పట్టణాల్లో గతంలో ప్లాస్టిక్‌ నిషేధం విధించినా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. లక్షల నిధులు ఖర్చుచేసి ప్రజలకు అవగాహన కల్పించినా ఫలితం ఉండటం లేదు. ఔషధ దుకాణాల్లో తక్కువ మందం ఉన్న కవర్లు వినియోగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని ఉంటుందని తెలిసినా వ్యాపారులు వాటినే వినియోగిస్తున్నారు. మూగజీవాలకు ప్లాస్టిక్‌ కవర్లు ప్రాణసంకటంగా మారుతున్నాయి. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులను పూర్తిస్థాయిలో నిషేధించాల్సిన అవసరం ఉంది.

పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు

గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని అన్ని పట్టణాల్లో ప్లాస్టిక్‌ నిషేధం పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించకుండా నిరంతరం తనిఖీలు చేపట్టాం. ప్రజలు ప్రత్యామ్నాయ సంచులు వాడాలి. కొందరు వ్యాపారులు ప్లాస్టిక్‌ నిషేధం అమలుకు తూట్లు పొడుస్తున్నారని జిల్లాలోని పలు పట్టణాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తనిఖీలకు ప్రత్యేక బృందాలను నియమించాం. ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సచివాలయాల పరిధిలో సదస్సులు ఏర్పాటు చేశాం. -శ్రీనివాసరావు, మున్సిపల్‌ ఆర్డీ

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని