ఉద్యోగాల పేరిట వ్యభిచార కూపంలోకి!
గుంటూరు, న్యూస్‌టుడే: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతులకు ఆశ చూపి సామాజిక మాధ్యమాల ద్వారా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు కోల్‌కత నుంచి యువతులను తీసుకొస్తున్నారు. వారి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు పరిష్కారామవుతాయని చెప్పి వ్యభిచారం చేయిస్తున్నారు. వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వాహకులు యువతుల ఫొటోలు, వీడియోలు పంపి విటులను ఆకట్టుకుంటున్నారు. బేరం కుదుర్చుకున్న మొత్తాన్ని ఆన్లైన్లో జమ చేయించుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంటిని ఖాళీ చేసి మరో చోటకు మకాం మార్చుతున్నారు. స్థానికుల ద్వారా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు సమాచారం తెలియడంతో పశ్చిమ డీఎస్పీ సుప్రజను అప్రమత్తం చేశారు. ఏటీ అగ్రహారంలో ఉన్నారని తెలుసుకుని నగరంపాలెం సీఐ హైమారావు సిబ్బందితో కలిసి ఒక ఇంట్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. కోల్‌కతకు చెందిన ఇద్దరు యువతులు, ఇద్దరు విటులను ఆదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ గుంటూరుకు చెందిన మరో ముగ్గురు మహిళలతో కలిసి ఇక్కడ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుంటూరులో ఉన్న ముగ్గురు మహిళా నిర్వాహకులు, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. కోల్‌కతకు చెందిన యువతులను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించారు. ఉద్యోగాల పేరిట యువతులను వ్యభిచార ఉచ్చులోకి దించుతున్న ప్రధాన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.