logo
Published : 03/12/2021 02:55 IST

పరీక్షలకు రసాయనాల్లేవ్‌..!

ప్రైవేటు ప్రయోగశాలకు నమూనాలు

సర్వజనాసుపత్రిలో వ్యాధి నిర్ధరణలో జాప్యం


ల్యాబ్‌లో నిరూపయోగంగా యంత్రాలు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే సర్వజనాసుపత్రిలో వ్యాధి నిర్ధా.రణకు అవసరమయ్యే పరీక్షలు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల వ్యాధి నిర్ధరణలో జాప్యం జరుగుతోందని పలువురు తెలుపుతున్నారు. రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు సర్వజనాసుపత్రిలో రసాయనాల కొరత ఏర్పడింది. బయోకెమిస్ట్రీ ప్రయోగశాలలో మధుమేహ పరీక్ష మాత్రమే చేయగలుగుతున్నారు. 24 గంటల ప్రయోగశాలలో కొవిడ్‌ రోగులకు సీఆర్‌పీ, డీడైమర్‌, ఫెరిటిన్‌ పరీక్షలు చేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో అత్యవసర విభాగానికి వచ్చిన రోగులకు అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలను కూడా ప్రైవేటు ప్రయోగశాలకు రక్తనమూనాలు పంపి చేయిస్తున్నారు. రాత్రి సమయాల్లో వీటి ఫలితాల కోసం వైద్యులు నిరీక్షించాల్సి వస్తోంది. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన పరీక్షలకు కూడా ప్రైవేటు ప్రయోగశాలకే పంపుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికీ ఉచితంగానే చేస్తున్నప్పటికీ ఆ ఫలితాలు వెల్లడి కావడానికి జాప్యం చోటుచేసుకుంటోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసర విభాగం సమీపంలో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రయోగశాలలో రోగులకు అవసరమైన పరీక్షలన్నీ కేవలం అరగంటలోనే చేసి ఇచ్చేవారు. అక్కడ రసాయనాలు లేవని నిలిపివేశారు. అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వస్తే కాలేయ(ఎల్‌ఎఫ్‌టీ), సీరం క్రియాటినైన్‌ వంటివి తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నట్లు రోగుల బంధువలు తెలుపుతున్నారు. వీటిని చేయించుకున్న తర్వాత రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి సర్జరీ ప్రారంభిస్తామని వివరిస్తున్నారు. ప్రస్తుతం వీటిని చేసేందుకు అవసరమైన కిట్ల కొరత ఏర్పడింది. థైరాయిడ్‌ పరీక్షలు నిలిచిపోయాయి. ఎప్పుడు ఏ పరీక్షలు అందుబాటులో ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య ఇటీవల తరచుగా ఉంటోందని వైద్యులు తెలుపుతున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి ఎక్కువ రోజులు ఆగిపోయాయని తెలుపుతున్నారు. ప్రైవేటు ప్రయోగశాలలో చేయిస్తున్నప్పటికీ వాటికి తర్వాత జీజీహెచ్‌ నుంచే చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని వైద్యులు గుర్తు చేస్తున్నారు.

బిల్లులు చెల్లించకే...

సర్వజనాసుపత్రికి రసాయనాలు సరఫరా చేసే గుత్తేదార్లకు కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికే సుమారు రూ.60 లక్షలకు పైగా బకాయిలున్నట్లు సరఫరాదార్లు తెలుపుతున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద నిధులు విడుదలైతే ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లించేవారు. ఆ ట్రస్టు నుంచి నిధుల విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులు తెలుపుతున్నారు. దీంతో జీజీహెచ్‌లో నిధుల కొరత ఏర్పడింది. దీనివల్ల సకాలంలో బిల్లులు చెల్లింపులు చేయలేకపోతున్నారు. ఈ సమస్యను జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద నిలిచిపోయిన నిధులను వెంటనే విడుదలయ్యేలా చూడాలని పలువురు సూచిస్తున్నారు. అవసరమైతే కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఆరోగ్య పరీక్షలకు అవసరమైన అన్ని రకాల కిట్లు అన్ని వేళలా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

బయోకెమిస్ట్రీ ప్రయోగశాలలో..

బయోకెమిస్ట్రీ ప్రయోగశాలలో రెండు నెలల నుంచి పరీక్షలన్నీ నిలిచిపోయాయి. ఒక చిన్న యంత్ర పరికరం సాయంతో కేవలం మధుమేహం పరీక్షలు చేస్తున్నారు. గతంలో రోజుకి వివిధ రకాల పరీక్షలు 1,200 వరకు చేసేవారు. ప్రస్తుతం కేవలం వందే చేయగలుగుతున్నారు. ఇక్కడ నిపుణులైన వైద్యులు, సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ రసాయనాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. వెల్లూరులోని వైద్యశాల నిపుణులు ఈ ప్రయోగశాలలో నిర్వహించే పరీక్షల నాణ్యతను గుర్తించి సక్రమంగా ఉంటే ప్రతి నెలా సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. రెండు నెలల నుంచి రసాయనాలు లేక పరీక్షలు చేయకపోవడంతో ఈ సర్టిఫికెట్‌ కూడా రాదని వైద్యులు తెలుపుతున్నారు.

త్వరలోనే రప్పిస్తాం

రసాయనాలు సరఫరా చేసే గుత్తేదార్లకు బకాయిలున్నాయి. అందువల్లే వారు సరఫరా చేయడం నిలిపివేశారు. అందుబాటులో ఉన్న నిధులను వారికి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే తిరిగి రసాయనాలు రప్పించి ప్రయోగశాలలకు అందజేస్తాం - ప్రభావతి, సూపరింటెండెంట్‌

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని