logo
Published : 03/12/2021 02:55 IST

హద్దులు దాటిన అక్రమ రవాణా 

మద్యం.. గుట్కా.. జాబితాలో కొత్తగా ఎర్ర చందనం

నాగార్జునసాగర్‌లో సరిహద్దు తనిఖీ కేంద్రం

మాచర్ల, న్యూస్‌టుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులోనున్న నాగార్జునసాగర్‌లో రాష్ట్ర విభజన తరువాత సరిహద్దు తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసు బృందం ప్రతివాహన కదలికపై నిఘా వేసి తనిఖీలు చేయాల్సిందే. ఇటీవల కాలంలో అక్రమ రవాణా జోరుగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీలోకి ప్రవేశించేందుకు గుంటూరు జిల్లాలో రెండు రహదారులు పల్నాడు ప్రాంతంలోనే ఉన్నాయి. ఒకటి నాగార్జునసాగర్‌ కాగా, మరొకటి పొందుగల(దాచేపల్లి). పొందుగల వద్ద భారీఎత్తున మద్యంతో పాటు పాన్‌పరాగ్‌ ఇతర నిషేధిత గుట్కాలు, రేషన్‌ బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి. ఇక్కడ మాత్రం అంతంత మాత్రంగా పట్టుబడటం పలు విమర్శలకు తావిస్తుంది. సరైన తనిఖీలు లేకపోవడంతో అక్రమార్కులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని బాహాటంగానే వినిపిస్తోంది. గురువారం ఇక్కడ ఎర్రచందనం దుంగలు పట్టుబడటం గమనార్హం. అరకొర తనిఖీలే కావడంతో ఈ మార్గాన్ని ఎర్రచందనం రవాణాకు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

నాగార్జునసాగర్‌ మీదుగా తెలంగాణ నుంచి ఏపీలోకి తినుబండరాలు, ఎరువులు లోడు పేరుతో సరకు రవాణా జరుగుతుంది. అయితే బిల్లుల్లో ఉండే వస్తువులకు వాహనాల్లో తరలించే వస్తువులకు పొంతన ఉండటం లేదన్న విమర్శలున్నాయి. పోలీసులు ప్రతి వాహనం పరిశీలిస్తేనే అక్రమాల వ్యవహారం వెలుగులు చూసే అవకాశంఉంది. అయితే ఏపీలోకి వచ్చే కొన్ని వాహనాలను తనిఖీ చేయకుండానే వదిలేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. రాత్రి సమయంలో అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. చిత్తూరు జిల్లా అడవుల్లో లభించే ఎర్రచందనం దుంగలు ఏపీ-తెలంగాణ సరిహద్దులో పట్టుబడటంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను సాగర్‌లో ఏపీ పోలీసులు మాత్రమే తనిఖీలు చేస్తారు. ఇక్కడ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన రెండు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సులువుగా అక్రమ రవాణా చేయొచ్ఛు ఇప్పటికే మద్యం సీసాలు, గుట్కాలను తెలంగాణ నుంచి భారీగా వస్తున్నాయి. ఇక్కడ నుంచి రేషన్‌ బియ్యం తెలంగాణ ప్రాంతానికి తరలిస్తున్నారు. తాజాగా ఎర్రచందనం దుంగలు ఇక్కడి నుంచి నెల్లూరు తీసుకెళ్లి, కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు తరలించేందుకు రవాణా చేస్తున్నారు. అయితే ఎర్రచందనంతో ఏమాత్రం దొరకని తెలంగాణ ప్రాంతం నుంచి నెల్లూరుకు ఎలా తరలిస్తున్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా తనిఖీలు అంతంత మాత్రం కావడంతో ఈ మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి సరిహద్దులో గట్టి నిఘా పెట్టాలని, అక్రమాలను అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

చేపల మేత ముసుగులో తరలింపు

పట్టుబడిన ఎర్రచందనం దుంగలు

మాచర్ల, న్యూస్‌టుడే : చేపలకు మేత తరలించే వాహనంలో కొందరు ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పట్టుబడ్డారు. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం దుంగలను రాష్ట్ర సరిహద్దు పోలీసులు గుర్తించారు. వీటి బరువు 4.50 క్వింటాళ్ల వరకు ఉంటుందని సమాచారం. హైదరాబాద్‌ నుంచి వినుకొండకు చేపలమేత పేరుతో చిన్నలారీలో సరకు తరలిస్తుండగా సాగర్‌ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు ఆపి వాహనాన్ని పరిశీలించారు. వాహనంలో ఉన్నవారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో చేపల మేతను కిందకు దింపించారు. దాని కింద నల్లటి సంచి కప్పి ఉండటంతో పోలీసులు దాన్ని తొలగించగా ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వాహనంలో ఉన్న ఇద్దరు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. పోలీసులు వెంబడించినా దొరకలేదు. విజయపురిసౌత్‌ పోలీసులు స్టేషన్‌కు వాహనాన్ని తరలించి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దుంగలను నెల్లూరుకు తరలించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. పోలీసులు పట్టుబడిన ఎర్రచందనం విషయాన్ని ధ్రువీకరించలేదు. ఈ విషయపై విజయపురిసౌత్‌ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈవిషయమై ఉన్నతాధికారుల విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని