logo

నలుగురు బోధకులతో గురుకులాన్ని నడుపుతున్నారా?

కేవలం నలుగురు టీచర్లతోనే బాలుర గురుకులాన్ని ఎలా నడుపుతున్నారు?’ అంటూ గిరిజన సంక్షేమశాఖ సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు నివ్వెరపోయారు. ఆయన శనివారం పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలుర, బాలికల గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు

Published : 05 Dec 2021 01:21 IST

ఆశ్చర్యపోయిన గిరిజన సంక్షేమశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు

విద్యార్థినులతో కలసి భోజనం చేస్తున్న చినవీరభద్రుడు

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: ‘కేవలం నలుగురు టీచర్లతోనే బాలుర గురుకులాన్ని ఎలా నడుపుతున్నారు?’ అంటూ గిరిజన సంక్షేమశాఖ సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు నివ్వెరపోయారు. ఆయన శనివారం పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలుర, బాలికల గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీటిని సందర్శించడం ద్వారా గిరిజన సంక్షేమ వసతిగృహాలను గురుకులాలుగా మార్పుచేయడంపై తాను సంతృప్తి చెందుతున్నట్టు చెప్పారు. తాను చూసిన మంచి గురుకులాల్లో ఇక్కడి బాలికల గురుకులం కూడా ఒకటని పేర్కొన్నారు. రోజూ ఇదే భోజనం పెడుతున్నారా అంటూ.. ఆహారపట్టిక అమలుపై విద్యార్థులను ఆరా తీశారు. బాలుర గురుకులం ప్రిన్సిపల్‌ ఎక్కడని వాకబు చేయగా, సెలవులో వెళ్లారని సిబ్బంది చెప్పారు. తానే ఓ ప్లేట్‌ కడిగి తీసుకొని పిల్లలతో పాటు వరుసలో నిల్చొని భోజనం పెట్టించుకొని, వారితో కలసి కూర్చొని భోజనం చేశారు. ఉపాధ్యాయుల కొరతతో పాటు, చాలినన్ని గదుల్లేక విద్యార్థులు చదువుకునే తరగతి గదుల్నే రాత్రిళ్లు పడకకు వినియోగిస్తున్నట్టు ఉపాధ్యాయులు, వసతిగృహాల అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాస్మొటిక్‌ ఛార్జీలను చెల్లించడంలేదని, జీసీసీ నుంచి నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేయడంలేదని, అన్నీ బయటే కొనాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. బాలుర గురుకులంలో శుద్ధిజల పరికరం పాడైందని చెప్పారు. నాడు - నేడు పథకం కింద ఈ విద్యాసంస్థను చేర్చకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఆయనకు వివరించారు. వసతిగృహ అధికారిణి గాజుల హిమశిల్ప, బాలికల గురుకుల ప్రిన్సిపల్‌ చుక్కా వనజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని