logo
Published : 05 Dec 2021 01:21 IST

ముందే మేల్కొందాం


రైల్వే స్టేషన్‌లో మాస్క్‌ లేకుండా ప్రయాణికులు

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బెంగళూరులో రెండు, హైదరాబాదులో ఒకటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గుంటూరులోని రెండు కార్పొరేట్‌ సంస్థల్లో మూడు రోజుల వ్యవధిలో ఎనిమిది కరోనా కేసులు నమోదు కావడం వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది. కానీ, రెండు నెలలుగా జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు ఎక్కడా సక్రమంగా అమలు కావటం లేదు. ఇలాగే వ్యవహరిస్తే ఒమిక్రాన్‌ బారిన పడక తప్పదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రేపల్లె అర్బన్‌, బాపట్ల, న్యూస్‌టుడే ప్రస్తుతం కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ప్రజలు మాత్రం కరోనాను దాదాపు మర్చిపోయి కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. రైతు బజార్లు, కూరగాయలు, మాసం, చేపల మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లు, నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడుతున్నారు. శానిటైజర్‌ వినియోగమే మర్చిపోయారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

పరిమితికి మించి ప్రయాణం

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఆటోలు.. ఆర్టీసీ బస్సుల్లోనూ నిబంధనలు అమలు కావటం లేదు. వాహనాల లోపల శానిటైజ్‌ చేయడం క్రమంగా మరిచారు. వైరస్‌ వ్యాప్తి తగ్గిందని ఎవరికి వారు ఖర్చేందుకులే అని నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైళ్లలో ప్రయాణించే వారు సైతం మాస్క్‌లు పెట్టడం లేదు. రహదారులపై తిరిగే వాహన చోదకులు మాస్క్‌ ధరించకుంటే అపరాధ రుసుం విధించే అధికారులు కార్యాలయాలకు పరిమితమయ్యారు.

స్వీయ మార్పుతోనే నివారణ

చాపకింద నీరుగా కొత్త వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలే చైతన్యవంతులు కావాలి. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి భౌతికదూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు అవసరం మేరకు శానిటైజర్లు వినియోగించాలి. కిక్కిరిసిన వాహనాల్లో పయనించకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదని గ్రహించి ఆరోగ్యం కాపాడుకోవాలి. రెండో దశ తీవ్రత.. జరిగిన నష్టాన్ని గుర్తుంచుకుని వ్యవహరించాలి. తమతోనే మార్పు ప్రారంభం కావాలని ఎవరికి వారు అనుకుంటే కరోనా దరిచేరదని నిపుణులు పేర్కొంటున్నారు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచితేనే..

ఒమిక్రాన్‌ ముప్పు నేపథ్యంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు గణనీయంగా పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. యాంటీజెన్‌, ర్యాపిడ్‌ కిట్ల కొరతతో జిల్లాలో నామమాత్రంగా పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌, తెనాలి, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల్లో మాత్రమే నిత్యం పరీక్షలు చేస్తున్నారు. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేసిన కిట్లు ఉంటే అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. కొత్త వైరస్‌ దృష్ట్యా గతంలో మాదిరిగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేసేలా ఉన్నతాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంది.

జిల్లాలో తాజా ఇదీ పరిస్థితి

నెల పరీక్షలు పాజిటివ్‌ కేసులు

సెప్టెంబరు 1.72 లక్షలు 3,472

అక్టోబరు 1.02 లక్షలు 2,093

నవంబరు 75,000 797

అన్ని పీహెచ్‌సీలకు కిట్లు

కరోనా కొత్త వేరియంట్‌ దృష్ట్యా జిల్లాలోని అన్ని సామాజిక, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నాం. అవసరమైన ర్యాపిడ్‌, యాంటీజెన్‌ కిట్లు ఒకట్రెండు రోజుల్లో ఆయా కేంద్రాలకు అందజేస్తాం. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి తప్పనిసరిగా పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకున్నాం. వైరస్‌ దరిచేరకుండా ప్రజలు బాధ్యతగా భౌతికదూరం పాటించి మాస్క్‌ ధరించాలి. కరోనా టీకా వేయించుకోవాలి.

- యాస్మిన్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని