ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాపరిషత్తు(గుంటూరు) : డయల్ యువర్ కలెక్టరు, స్పందన కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్ అన్నారు. కలెక్టరేట్‌లో ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 15 మంది కలెక్టరుకు ఫోన్ చేసి సమస్యలు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టరు హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సమీక్షిస్తున్నందున జిల్లా అధికారులు పెండిగ్ లేకుండా సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు 100 శాతం బయోమెట్రిక్ హాజరుకు అవసరమైన ఉపకరణాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు దినేష్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి, డీఆర్వో కొండయ్య, జేడీఏ విజయభారతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు, ఎల్‌డీఏం రాంబాబు పాల్గొన్నారు.