‘సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం’
కొల్లూరు, న్యూస్టుడే: సీపీఎస్ రద్దు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట తప్పారని ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) జిల్లా అధ్యక్షురాలు సూరపనేని కల్పన ఆరోపించారు. ఏపీసీపీఎస్ఈఏ సింహగర్జన గోడప్రతికని సోమవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించిన సందర్భంగా స్థానిక ఉద్యోగులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో తడ నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో ‘నేను ఉన్నాను - నేను విన్నాను’ అని నమ్మబలికి 108 సార్లు సీపీఎస్ రద్దు వాగ్దానం చేసి మాట తప్పి, మడమ తిప్పారని కల్పన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లయినా సీపీఎస్ రద్దు ఊసే ఎత్తడం లేదన్నారు. సుదీర్ఘకాలం ఎదురుచూసిన దరిమిలా తాము సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడ్డామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 10న విజయవాడలో సింహగర్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వం దిగివచ్చి పాత పింఛను విధానాన్ని అమలు చేసే వరకూ తాము పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. తొలుత స్థానిక ప్రభుత్వోద్యోగులతో కలిసి సింహగర్జన గోడప్రతికని ఆవిష్కరించారు.