logo
Published : 07/12/2021 05:32 IST

లంచమిస్తేనే.. దస్త్రం కదిలేది!

మేడికొండూరులో పట్టుబడిన వీఆర్వో 
కిశోర్‌బాబు, పక్కన మధ్యవర్తి ఖాజీపీరా 

*2019 మే నెలలో బాపట్ల తహశీల్దారు రైతుల నుంచి రూ.లక్ష తీసుకుంటూ కార్యాలయంలోనే అవినీతి నిరోధక శాఖ(అనిశా) పట్టుబడ్డారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లించడానికి సొమ్ము డిమాండ్‌ చేశారు. రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది. 
*పల్నాడులో మాచవరం మండలంలో వందల ఎకరాల ప్రభుత్వభూములు ఒక వీఆర్వో సాయంతో తహశీల్దారు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. ఈ విషయం ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో ఐదుగురు వీఆర్వోలను అక్కడి నుంచి బదిలీ చేశారు. 
*భూమికి సంబంధించిన ధ్రువపత్రాలు కావాలన్నా.. మార్పులు చేర్పులు చేయాలన్నా.. నిరభ్యంతర పత్రం అవసరమైనా లబ్ధిదారుల చేతిచమురు వదులుతోంది. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు ముక్కుపిండి సొమ్ము వసూలు చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. 

ఈనాడు, గుంటూరు వ్యవసాయ భూములకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు తొందరగా తీసుకోవాలన్నా ఉద్దేశంతో ఎంతోకొంత ఇస్తే తొందరగా పని అవుతుందన్న నమ్మకంతో కొందరు డబ్బులు బహుమతి ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రతి పనికి సొమ్ము ఆశించడం కొందరికి అలవాటైపోయింది. సొమ్ము ఇచ్చుకోని లబ్ధిదారులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పని కాకపోవడంతో విసుగు చెంది అనిశా అధికారులను ఆశ్రయిస్తున్న సందర్భాలు ఉన్నాయి. రెవెన్యూలో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పనులు చేయడానికి ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకువచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. దరఖాస్తు వెళ్లగానే మాకేంటి? అన్న ప్రశ్న ఎదురవుతోంది. కార్యాలయంలో రోజువారీగా అనేక ఖర్చులుంటాయని, అన్నీ బయటకు చెప్పుకోలేమని మీలాంటివారు కూడా ఇవ్వకపోతే మాజేబు నుంచి పెట్టుకోవాలా? అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.
విలువ ఆధారంగా రేటు  
జిల్లాలో గుంటూరు నగరంతోపాటు మున్సిపల్‌ పట్టణాల పరిసరాల్లో ఉన్న పల్లెల్లో భూముల విలువ అనూహ్యంగా పెరిగింది. భూములకు సంబంధించి ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేస్తే రూ.కోటి విలువైన ఆస్తికి సంబంధించిన పత్రాలు ఇస్తున్నప్పుడు రూ.లక్ష ఇవ్వలేరా? అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుని రేటు నిర్ణయిస్తున్నారు. అడిగినంత ఇవ్వకుండా ఎవరిచేత అయినా సిఫార్సు చేయిస్తే సాకులు చెబుతూ కాలయాపన చేస్తారు. వెబ్‌సైట్‌ పని చేయనందున తామేమి చేయలేమని చేతులేత్తేస్తారు కుటుంబసభ్యుల మధ్య భూవివాదాలు, క్రయవిక్రయాల్లో వివాదాలు వచ్చినప్పుడు ధరలు మరింత పెంచుతున్నారు. తహశీల్దారు కార్యాలయాల్లో పని చేసే కంప్యూటర్‌ ఆపరేటర్లతో కుమ్మక్కైన కొందరు వీఆర్వోలు డబ్బులు అవసరమైనప్పుడు అడంగల్‌ నుంచి కొందరి భూములకు సంబంధించి డిజిటల్‌ సిగ్నేచర్‌ తీసివేసి పెండింగ్‌లో పెట్టడం వంటివి చేస్తున్నారు. తహశీల్దారు పనుల ఒత్తిడిలో కొన్నిసార్లు కంప్యూటర్‌ ఆపరేటర్‌పై ఆధారపడటాన్ని ఆసరాగా తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అవినీతిలో అన్నిస్థాయిల్లో భాగస్వామ్యం ఎంతోకొంత ఉండటంతో కట్టడి సాధ్యకావడం లేదని ఆశాఖ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. కొందరు ఏళ్ల తరబడి ఒకే కార్యాలయంలో డీటీలుగా పని చేయడం, అక్కడ పనిచేస్తున్న తహశీల్దార్లపై ప్రజాప్రతినిధులకు ప్రతికూలంగా చెప్పి వారు అక్కడి నుంచి వెళ్లేలా చూసి ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు. నేతలు చెప్పిన పనులు చేయడంతోపాటు సొంత పనులు చక్కబెట్టుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇలాంటి కార్యాలయాల పరిధిలో మిగిలిన సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తుండటంతో లబ్ధిదారుల జేబుకు చిల్లుపడుతోంది.  

లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో
మేడికొండూరు, న్యూస్‌టుడే: మూడు ధ్రువపత్రాల జారీకి రూ.90 వేలు లంచం తీసుకుంటూ మేడికొండూరు-1 వీఆర్వో కిశోర్‌బాబు పట్టుబడినట్లు అనిశా అధికారులు సోమవారం తెలిపారు. అనిశా డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ తెలిపిన మేరకు వివరాలు.. మేడికొండూరుకు చెందిన చావపాటి షమీముల్లా తండ్రి నాగుల్‌మీరా కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మే నెలలో చనిపోయారు. తన తండ్రి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి షమీముల్లాకు ఆర్థిక స్థితి, నివాస, ప్రాపర్‌ పర్సన్‌ ధ్రువ పత్రాలు అవసరమయ్యాయి. వాటి కోసం మేడికొండూరు ఒకటో గ్రామ రెవెన్యూ అధికారి కట్టెపోగు కిశోర్‌బాబును కలవగా,  రూ.90వేలు లంచం అడిగారు. అంత మొత్తం ఇచ్చుకోలేక షమీముల్లా అవినీతి నిరోధిక శాఖ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనలతో షమీముల్లా మేడికొండూరులోని వీఆర్వో కిశోర్‌బాబు సొంత కార్యాలయంలో సోమవారం సాయంత్రం లంచం ఇస్తుండగా దాడి చేశారు. కిశోర్‌బాబుతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన గ్రామవాసి షేక్‌ ఖాజీపీరా (కేకే)ను పట్టుకుని కేసు నమోదు చేశారు.  

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని